నిషేధం వేళ పెళ్లిలో ఆతిఫ్ అస్లాంతో కలిసిన హనీ సింగ్!
భారత్‌లో పాకిస్థానీ షోల నిషేధంపై చర్చ జరుగుతున్న వేళ.. దుబాయ్‌లో ఓ పెళ్లి వేడుకలో హనీ సింగ్, ఆతిఫ్ అస్లాం కలిసి డ్యాన్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అబ్రార్ ఉల్ హక్ పాటలకు ఇద్దరూ స్టెప్పులేస్తున్న వీడియోను వేడుక హోస్ట్ సాదిక్ సలీమ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
By: Srikanth Kontham | 26 Nov 2026 2:26 PM ISTభారత్‌లో పాకిస్థానీ షోలను నిషేధించాలని తీవ్ర స్థాయిలో డిమాండ్లు వినిపిస్తుంటే మరోవైపు దుబాయ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పంజాబీ ర్యాపర్ హనీ సింగ్.. పాక్ గాయకుడు ఆతిఫ్ అస్లాం కలిసి డ్యాన్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్థాన్ తొలి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ జో బచే హై సంగ సమైత్ లో ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో వివాదం నడుస్తుండగా ఇద్దరు గాయకుల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దుబాయ్ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించిన సాదిక్ సలీమ్ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
పాకిస్థానీ సింగర్ అబ్రార్-ఉల్-హక్ పాటలకు హనీ సింగ్, ఆతిఫ్ అస్లాం ఉత్సాహంగా స్టెప్పులేస్తూ నూతన వధూవరులను చీర్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. తన కాన్సర్ట్ రిహార్సల్స్ నుంచి నేరుగా ఆతిఫ్ ఈ వేడుకకు హాజరయ్యారని.. హనీ సింగ్ ఎంతో ఉత్సాహంతో వేడుకలో సందడి చేశారని సాదిక్ పేర్కొన్నారు.
ఓ పక్క పాక్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ప్రసారాన్ని ఆపాలంటూ ఫిర్యాదులు అందుతుంటే మరోపక్క తాము సంగీతాన్ని, స్నేహాన్ని ఆస్వాదిస్తున్నామని సాదిక్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇలాంటి దృశ్యాలు కేవలం దుబాయ్‌లో మాత్రమే సాధ్యమవుతాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇరు దేశాల సంగీత ప్రియుల మధ్య చర్చకు దారితీసింది.
ఇదిలా ఉండగా జో బచే హై సంగ సమైత్ లో సిరీస్‌ను భారత్‌లో స్ట్రీమింగ్ చేయకూడదని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 2025 మే 8న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను గుర్తు చేసారు. పాకిస్థానీ కంటెంట్‌ను భారతీయ ఓటీటీ వేదికలపై పూర్తిగా నిషేధించేలా కఠిన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసారు.
ఫర్హత్ ఇష్తియాక్ రాసిన ఉర్దూ రొమాంటిక్ నవల ఆధారంగా తెరకెక్కిన సిరీస్‌లో అహద్ రజా మీర్, హానియా ఆమిర్, సనమ్ సయీద్, ఇక్ర అజీజ్, మహిరా ఖాన్ తదితరులు నటించారు. మోమినా దురైద్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇటీవల భారత్‌లో ఆదరణ పొందిన దర్-ఎ-నిజాత్ అనే పాకిస్థానీ సీరియల్‌కు సంబంధించి బెంగళూరులో ఏర్పాటు చేసిన రెండు ప్రైవేట్ స్క్రీనింగ్‌లను ఆన్‌లైన్ వ్యతిరేకత కారణంగా నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. సరిహద్దు వివాదాలు.. సినీ సంఘాల నిరసనల మధ్య కళాకారుల స్నేహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. కొందరు సంగీతానికి.. కళలకు సరిహద్దులు లేవని సమర్థిస్తుంటే? మరికొందరు దేశ ప్రయోజనాల దృష్ట్యా పాక్ కళాకారులతో ఎలాంటి వేదికలను పంచుకోకూడదని విమర్శిస్తున్నారు.
