Begin typing your search above and press return to search.

ఇండియా ఆస్కార్ ఎంట్రీ కాపీయా? సోషల్ మీడియాలో చర్చ

భారతదేశం నుండి ఆస్కార్ రేసులో నిలిచిన ‘హోమ్‌బౌండ్’ సినిమా చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం నెలకొంది.

By:  Madhu Reddy   |   17 March 2026 10:38 PM IST
ఇండియా ఆస్కార్ ఎంట్రీ కాపీయా? సోషల్ మీడియాలో చర్చ
X

భారతదేశం నుండి ఆస్కార్ రేసులో నిలిచిన ‘హోమ్‌బౌండ్’ సినిమా చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం నెలకొంది. ఈ చిత్రం మరో సినిమాకు ఫ్రేమ్-టు-ఫ్రేమ్ కాపీ అంటూ సోషల్ మీడియాలో ఒక రీల్ వైరల్ కావడమే దీనికి కారణం. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో, ధర్మా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఈ వివాదం ఏంటి? నిజంగా ఇది కాపీయేనా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

‘దిహాడీ’ సినిమాతో పోలికలు:

వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ‘హోమ్‌బౌండ్’ సినిమా 2021లో వచ్చిన ‘దిహాడీ: వాకింగ్ బ్యాక్ టు హోమ్’ అనే చిత్రానికి దగ్గర పోలికలు ఉన్నాయని నెటిజన్లు వాదిస్తున్నారు. మయూఖ పటేల్, నిధి పటేల్ దర్శకత్వం వహించిన ‘దిహాడీ’ సినిమా కూడా లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలు పడ్డ కష్టాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు ఒక దినసరి కూలీ చేసే పోరాటమే ఈ రెండు సినిమాల్లోనూ ప్రధానాంశం కావడంతో, ఇది కాకతాళీయమా లేక కాపీయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకే మూలం నుండి వచ్చిన కథలా?:

ఇక అయితే ఈ పోలికలపై మరో వాదన కూడా వినిపిస్తోంది. ‘హోమ్‌బౌండ్’ కథ నిజానికి న్యూయార్క్ టైమ్స్‌లో జర్నలిస్ట్ బషారత్ పీర్ రాసిన ఒక వ్యాసం అది 'ఏ ఫ్రెండ్షిప్ ఏ పాండెమిక్ అండ్ ఏ డెత్ ఆన్ ది రోడ్డుసైడే' ఆధారంగా రూపొందింది. మూల కథ ఒక్కటే కావడంతో కొన్ని సన్నివేశాలు ఒకేలా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఒక రచయిత్రి తన పుస్తకంలోని ఐడియాను ధర్మా ప్రొడక్షన్స్ కాపీ కొట్టిందని ఆరోపించినప్పటికీ, ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది.

విశ్వసనీయతపై దెబ్బ పడుతుందా?:

ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మక వేదికపై ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించిన సినిమాపై ఇలాంటి కాపీ ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఫ్రేమ్-టు-ఫ్రేమ్ కాపీ అనే ఆరోపణలు నిజమని తేలితే, అది ధర్మా ప్రొడక్షన్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థల గౌరవాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. పెద్ద బ్యానర్లు సినిమాలను ప్రమోట్ చేసేటప్పుడు అవి ఒరిజినల్ కథలని చెబుతుంటాయి, కానీ ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు ఆ వాదనలను పునరాలోచించుకోవాల్సి వస్తోంది.

సినిమా రంగంలో ఒకే రకమైన నేపథ్యం ఉన్న కథలు రావడం కొత్తేమీ కాదు. కానీ, క్రెడిట్ ఇవ్వడంలో లేదా అసలైన సృష్టికర్తలను గుర్తించడంలో పెద్ద సంస్థలు విఫలమవుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ‘హోమ్‌బౌండ్’ వివాదం నిజానిజాలు ఏవైనా, ఒక మంచి సినిమాపై ఇలాంటి మచ్చ పడటం బాధాకరమే.ఇక ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పందిస్తే తప్ప పూర్తి క్లారిటీ వచ్చేలా లేదు. అప్పటివరకు సోషల్ మీడియాలో ఈ పోలికల మీద చర్చలు కొనసాగుతూనే ఉంటాయి.