Begin typing your search above and press return to search.

కొత్త చ‌ట్టం: టాలీవుడ్‌లో మైన‌ర్ల వేధింపుల‌కు భారీ జ‌రిమానాలు?

హాలీవుడ్‌లో టీనేజ‌ర్లు, బాల‌ ఆర్టిస్టుల రక్షణ కోసం గతంలో ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త చ‌ట్టాలు అమ‌ల్లోకి రావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

By:  Sivaji Kontham   |   17 Jan 2026 2:00 PM IST
కొత్త చ‌ట్టం: టాలీవుడ్‌లో మైన‌ర్ల వేధింపుల‌కు భారీ జ‌రిమానాలు?
X

హాలీవుడ్‌లో టీనేజ‌ర్లు, బాల‌ ఆర్టిస్టుల రక్షణ కోసం గతంలో ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త చ‌ట్టాలు అమ‌ల్లోకి రావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 2025-2026 మధ్య కాలంలో ప్రభుత్వం - సాగ్ ఆఫ్ట్రా (SAG-AFTRA) యూనియన్ కొన్ని కీలక మార్పులు తీసుకురావ‌డంపై హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. జోడీ ఫోస్టర్ వంటి సీనియర్ నటీమణులు లేవనెత్తిన ఆందోళనల నేపథ్యంలో ఈ కొత్త చట్టాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఈ నియ‌మాల‌ను టాలీవుడ్ స‌హా భార‌తీయ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల‌కు ఎందుకు అనువ‌ర్తింప‌జేయ‌రు? ఇక్క‌డ హాలీవుడ్ కంటే భిన్న‌మైన ప‌రిస్థితులు ఉన్నాయా? మైన‌ర్ల‌కు లైంగిక వేధింపుల ర‌క్ష‌ణ‌కు సంబంధించిన శిక్ష‌ణ అవ‌స‌రం లేదా? అంటే ముందుగా హాలీవుడ్ లో ఎలాంటి చ‌ట్టాలు ఉన్నాయి అనే వివ‌రాల్లోకి వెళ్లాలి.

ఆ కొత్త నిబంధనల ప్ర‌కారం... `మాండేటరీ రిపోర్టింగ్` విస్తరణ (AB 653 చట్టం) త‌ప్ప‌నిస‌రి చేసారు. 1 జనవరి 2026 నుండి కాలిఫోర్నియాలో అమల్లోకి వచ్చిన ఈ కొత్త చట్టం ప్రకారం.. టాలెంట్ ఏజెంట్లు, మేనేజర్లు, యాక్టింగ్ కోచ్‌లకు కూడా కొత్త నియ‌మ‌ నిబంధ‌న‌ల్ని వర్తింపజేశారు. గతంలో కేవలం సెట్ టీచర్లు , వైద్యులకు మాత్రమే పరిమితమైన బాధ్యతను ఇప్పుడు ఇత‌ర సెక్ష‌న్ల‌కు వ‌ర్తింప జేయ‌డం సంచ‌ల‌న‌మైంది.

మైనర్ ఆర్టిస్టులపై ఏదైనా శారీరక లేదా మానసిక వేధింపులు జరుగుతున్నాయని తెలిసినా, లేదా అనుమానం వచ్చినా వీరు వెంటనే అధికారులకు నివేదించాలి. అలా చేయకపోతే వారి లైసెన్సులు రద్దు కావడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తారు.

డిజిటల్ రిప్లికాలు, ఏఐ రక్షణను అమ‌ల్లోకి తెచ్చారు. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో నటీనటుల రూపాలను మార్చే అవకాశం ఉన్నందున.. టీనేజ్ ఆర్టిస్టుల కోసం ప్రత్యేక రక్షణ కల్పించారు. మైనర్ ఆర్టిస్టుల డిజిటల్ ఇమేజ్ లేదా వాయిస్‌ని వారి తల్లిదండ్రుల స్పష్టమైన అనుమతి లేకుండా ఉపయోగించకూడదు. భవిష్యత్తులో ఈ డిజిటల్ రూపాలను తప్పుడు పద్ధతుల్లో డీప్ ఫేక్స్‌గా వాడకుండా ఉండేందుకు కఠినమైన ఒప్పందాలను ప్రవేశపెట్టారు.

హాలీవుడ్ లో ఇటీవ‌ల సోషల్ మీడియా & చైల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్ చట్టాలు కూడా అమ‌ల్లోకి వ‌చ్చాయి. కేవలం సినిమాల్లో నటించే వారే కాకుండా, యూట్యూబ్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించే పిల్లల కోసం కూడా కొత్త చట్టాలు వచ్చాయి. అలాగే పిల్లలు సంపాదించే ఆదాయంలో కనీసం 15 శాతం మొత్తాన్ని వారి పేరు మీద ఒక ట్రస్ట్ అకౌంట్‌లో (కూగున్ అకౌంట్) జమ చేయాలి. వారు 18 ఏళ్లు నిండాక మాత్రమే ఆ డబ్బును తీసుకోవచ్చు.

సోషల్ మీడియా కంటెంట్ కోసం పిల్లలను ఎక్కువ గంటలు పని చేయించకూడదు. స్కూల్ సమయాల్లో వీడియో షూటింగ్స్ చేయకూడదు. ఈరోజుల్లో తక్కువ బడ్జెట్ ఉన్న వెబ్ సిరీస్‌లు లేదా షార్ట్ ఫిల్మ్స్ విషయంలోనూ టీనేజ్ ఆర్టిస్టులకు తప్పనిసరిగా యూనియన్ ఇన్సూరెన్స్ - సేఫ్టీ నిబంధనలు వర్తిస్తాయి. షార్ట్ ఫార్మ్ కంటెంట్ కోసం ప‌ని చేసేప్పుడు రక్షణ బాధ్య‌త‌లు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌దే.

ఆల్కహాల్ & రెడ్ కార్పెట్ నిబంధనలు కూడా అమ‌ల్లోకి వ‌చ్చాయి. వెట‌ర‌న్ న‌టి జోడీ ఫోస్టర్ లేవనెత్తిన అంశాల ఆధారంగా, అవార్డు వేడుకలు లేదా ప్రమోషన్ ఈవెంట్లలో మైనర్ ఆర్టిస్టుల పట్ల ప్రవర్తించే విధానంపై `కోడ్ ఆఫ్ కాండక్ట్`ను రూపొందించారు. 14 నుండి 17 ఏళ్ల మధ్య ఉన్న టీనేజ్ ఆర్టిస్టులు తమ వర్క్ పర్మిట్ పొందాలంటే, వారు వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా `సె*వల్ హరా*మెంట్ ప్రివెన్షన్` (లైంగిక వేధింపుల నిరోధ‌క‌త‌) శిక్షణను పూర్తి చేయాలి. వేధింపులను ఎలా గుర్తించాలి? ఎక్కడ ఫిర్యాదు చేయాలి? అనే దానిపై వీరికి అవగాహన కల్పిస్తారు.

ఈ నిబంధనలు ఉల్లంఘించే ప్రొడక్షన్ కంపెనీలకు 2026 నుండి భారీ జరిమానాలు విధించేలా చట్టాలను రూపొందించారు. 10,000 డాల‌ర్ల‌ వరకు ప్రతి ఉల్లంఘనకు నిర్మాణ సంస్థ‌లు చెల్లించుకోవాల్సి ఉంటుంది. బ‌హుశా ఇలాంటి నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు టాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు లేదా భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లు సిద్ధంగా ఉన్నాయా? అన్న‌ది వేచి చూడాలి.