సురేష్ బాబు ఆ రిస్క్ చేస్తారా?
ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సినిమాకు అలాంటి బ్రేకే పడినట్టు తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 29 July 2025 10:00 PM ISTఎప్పటి పనిని అప్పుడే చేయాలి, ఒకసారి ఆ పని వాయిదా పడిందంటే దాంతో మనం వేరే వారికి అవకాశం ఇచ్చినట్టే. ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా అనుకునే దర్శకనిర్మాతలు పలు సందర్భాల్లో నష్టపోయారు. తామెంతో ఆశతో డ్రీమ్ ప్రాజెక్టుగా తీయాలనుకునే సినిమాలు కూడా ఈ కారణంతో ఆగిపోతాయి. అదే ఆలోచనలు, లేదా స్టోరీ లైన్ తో మరో సినిమా వస్తే తమ ప్రాజెక్టుకు బ్రేక్ పడటం ఖాయం.
రుద్రమదేవి తర్వాత భారీ ప్రాజెక్టు
ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సినిమాకు అలాంటి బ్రేకే పడినట్టు తెలుస్తోంది. అదే హిరణ్యకశ్యప. భారీ బడ్జెట్, సెట్స్ కు పేరు గాంచిన గుణ శేఖర్ రుద్రమదేవి సినిమా తర్వాత దాని కంటే భారీగా హిరణ్యకశ్యప సినిమాను చేయాలనుకున్నారు. రానా దగ్గుబాటిని ప్రధాన పాత్రలో అనుకుని సురేష్ ప్రొడక్షన్స్ లో దాన్ని చేయడానికి సురేష్ బాబును ఒప్పించి సినిమాను అనౌన్స్ కూడా చేశారు.
పలు కారణాలతో తప్పుకున్న గుణశేఖర్
కానీ పలు కారణాలతో ఆ ప్రాజెక్టు నుంచి పక్కకు వచ్చి శాకుంతలం తీసిన గుణశేఖర్ శాకుంతలం తర్వాత ఈ సినిమాను చేస్తారనుకున్నారంతా. కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా గుణ శేఖర్ లేకుండా సురేష్ ప్రొడక్షన్సే సొంతంగా హిరణ్య కశ్యపను తీయాలని నిర్ణయించుకుని గతేడాది అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. త్రివిక్రమ్ రచనలో ఆ సినిమాను చేద్దామనుకున్నారు. అయితే ఆ అప్డేట్ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఇప్పటి వరకు హిరణ్య కశ్యప గురించి మరో అప్డేట్ లేదు.
మహావతార్ కు మంచి రెస్పాన్స్
అయితే ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తుంటే సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఈ సినిమాకు బ్రేక్ వేసేలానే ఉంది. దానికి కారణం రీసెంట్ గా కన్నడ నుంచి వచ్చిన మహావతార్: నరసింహ సినిమా. ఆ సినిమాకు కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. యానిమేటెడ్ సినిమాగా వచ్చిన మహావతార్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
భక్త ప్రహ్లాద కథతో తెరకెక్కిన ఈ సినిమాలో హిరణ్య కశ్యపుడిది చాలా కీలక పాత్ర. మహావతార్ లో ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా చాలా బావుంది. మహావతార్ కు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చాక అదే పాత్రపై ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ ఫుల్ లెంగ్త్ ఫిల్మ్ చేసే సాహసం చేస్తుందా అనేది అసలు అనుమానం. ఆడియన్స్ కూడా ఆల్రెడీ చూసేసిన పాత్ర పై సినిమా అంటే అంత ఆసక్తి చూపించరు కాబట్టి సురేష్ బాబు హిరణ్య కశ్యప సినిమాకు బ్రేక్ వేయడమే బెటర్.
