పొరుగు మార్కెట్ సరే.. సొంత మార్కెట్ సంగతేంటి?
పాన్ ఇండియన్ మార్కెట్లో రాణించేందుకు చాలా మంది హీరోలు రకరకాల ప్రయోగాలకు దిగుతున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 13 Dec 2025 5:00 PM ISTపాన్ ఇండియన్ మార్కెట్లో రాణించేందుకు చాలా మంది హీరోలు రకరకాల ప్రయోగాలకు దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయోగాలు అన్నిసార్లు ఫలిస్తాయా? అంటే చెప్పలేం. డార్లింగ్ ప్రభాస్ మాస్ యాక్షన్ సినిమాలతో పాన్ ఇండియాలో అదరగొడుతున్నాడు. సాహో, సలార్ దీనికి ఉదాహరణలు. ఈ రెండిటికీ భిన్నంగా లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో అభిమానులను సర్ ప్రైజ్ చేస్తున్నాడు. బాహుబలి, కల్కి 2898 ఏడి చిత్రాల విజయాలు దీనికి సాక్ష్యం.
అయితే ప్రభాస్ తరహాలోనే పాన్ ఇండియన్ స్టార్ డమ్ కోసం చాలా మంది హీరోలు ప్రయత్నిస్తున్నారు. టాలీవుడ్ నుంచి పలువురు అగ్ర హీరోలు పాన్ ఇండియాలో గ్రాండ్ సక్సెస్ సాధించారు. కన్నడ రంగం నుంచి యష్, రిషబ్ శెట్టి పాన్ ఇండియాలో రాణిస్తున్నారు. అయితే ప్రభాస్ లేదా అల్లు అర్జున్, యష్, రిషబ్ రేంజులో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న తమిళ హీరోలు లేకపోవడం నిజంగా నిరాశపరిచేదే. సౌతిండియన్ సినిమాకి ప్రధాన కేంద్రమైన చెన్నై నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ మినహా ఎవరైనా స్టార్ పాన్ ఇండియాలో సత్తా చాటుతారా? అంటూ ఆరాలు ఎక్కువయ్యాయి. దళపతి విజయ్ తమిళనాడులో అదరగొడుతున్నాడు. అతడికి కూడా ఇరుగు పొరుగు మార్కెట్లపై పట్టు ఇంకా చిక్కలేదు. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో అతడు ఇంకా పెద్దగా రాణించలేదు.
అలా చూస్తే కోలీవుడ్ లో ధనుష్ ప్రయత్నాలు ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. అతడు ఇప్పటికే హిందీ మార్కెట్లో పెద్ద సక్సెస్ సాధించాడు. రాంజానా, తేరే ఇష్క్ మే లాంటి చిత్రాలతో అక్కడ బంపర్ హిట్టు కొట్టాడు. తెలుగులోను అతడు నటించిన సినిమాలకు మంచి వసూళ్లు దక్కుతున్నాయి. విమర్శకుల ప్రశంసలు పొందిన `తేరే ఇష్క్ మే` వరల్డ్ వైడ్ 150 కోట్లు వసూలు చేసింది. ఇందులో 75 శాతం ఉత్తరాది నుంచి వచ్చినదే. అయితే తమిళనాడులో కేవలం 9 కోట్లు మాత్రమే వసూలు చేయడం ఆశ్చర్యపరిచింది. ఒక తమిళ హీరోకి హిందీ ప్రజలు 120 కోట్లు పైగా వసూళ్లను అందించగా, తమిళ ప్రజలు కేవలం 9కోట్లు మాత్రమే అందించారు. ఇటీవల విడుదలైన కుబేరకు తెలుగులో మంచి వసూళ్లు దక్కినా కానీ తమిళనాడులో ఆశించిన వసూళ్లను సాధించలేదు. తమిళంలో తమిళ స్టార్ హీరో గ్రాఫ్ పడిపోవడం నిజంగా ఆశ్చర్యపరిచింది. ఇటీవలే విడుదలైన `ఇడ్లీ కడై` పూర్తిగా తమిళ వాసనలతో రూపొందించినా కానీ తమిళనాడులో ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ చిత్రం కేవలం 70 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇది ధనుష్ స్థాయి విజయం కానే కాదు.
అయితే ధనుష్ ఇటీవల ఒక అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతడు తన సొంత భాషలో అంతగా రాణించడం లేదు. ధనుష్ మార్కెట్ రేంజ్ అంతకంతకు పడిపోతోందని సందేహాలు కలుగుతున్నాయి. ధనుష్ ఇరుగు పొరుగున బాగా రాణిస్తున్నాడు. కానీ సొంత భాషలో దిగజారిపోవడం ఊహించని పరిణామం.
అయితే ధనుష్ పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నా.. ఇంకా బలంగా ఎదిగేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. హిందీ, తెలుగు భాషలలో రాణించినా తన సొంత భాషలోను తన మార్కెట్ ని నిలబెట్టుకునే వ్యూహాన్ని ధనుష్ అనుసరించాలని సూచిస్తున్నారు. ధనుష్ పాన్ ఇండియాలో తనను తాను నిరూపించుకున్నా కానీ, సొంత పరిశ్రమలో జీరో అయిపోతే అది అతడికి పెద్ద మైనస్ గా మారుతుంది. అలా కాకుండా అతడు దళపతి విజయ్, శివకార్తికేయన్ తరహాలో సొంత భాషలోను ఘనమైన వసూళ్లతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇరుగు పొరుగు భాషల్లో స్ట్రెయిట్ సినిమాలకు ప్రయత్నిస్తున్న ధనుష్ తిరిగి తమిళంలోను రాణించాలని ఆకాంక్షిద్దాం.
