Begin typing your search above and press return to search.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన బయోపిక్స్.. హైయెస్ట్ ఎవరంటే?

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన టాప్ బయోపిక్ మూవీస్ ఏంటి? అత్యధిక వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది ఎవరో ఇప్పుడు చూద్దాం..

By:  Madhu Reddy   |   15 July 2026 5:00 AM IST
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన బయోపిక్స్.. హైయెస్ట్ ఎవరంటే?
X

భారతీయ సినిమా ఇండస్ట్రీలో నిజ జీవిత కథలకు (బయోపిక్స్) ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కేవలం కల్పిత కథలతోనే కాకుండా, కొందరు సాధించిన అద్భుతమైన విజయాలు, పడిన కష్టాలను వెండితెరపై చూపిస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. మన దేశంలో ఇప్పటివరకు వచ్చి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన టాప్ బయోపిక్ మూవీస్ ఏంటి? అత్యధిక వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది ఎవరో ఇప్పుడు చూద్దాం..

రూ. 2000 కోట్ల రికార్డుతో 'దంగల్':

ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన బయోపిక్‌గా మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' మొదటి స్థానంలో నిలిచింది. ఇక హర్యానాకు చెందిన రెజ్లింగ్ కోచ్ మహవీర్ సింగ్ ఫోగాట్, అతని కుమార్తెలు గీతా, బబీతా ఫోగాట్ జీవితాల ఆధారంగా 2016లో వచ్చిన ఈ చిత్రం ఏకంగా రూ. 2,000 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది.

రూ. 500 కోట్ల క్లబ్‌లో 'సంజు':

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. ఆయన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ఆధారంగా రణ్‌బీర్ కపూర్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన చిత్రం సంజు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి ఏకంగా రూ. 586 కోట్లు వసూలు చేసింది. సంజయ్ దత్ పాత్రలో రణ్‌బీర్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

క్రికెట్ దేవుడి కథ 'ధోని':

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జీవిత ప్రయాణం అందరికీ ఆదర్శం. ఒక సాధారణ టికెట్ కలెక్టర్ నుంచి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ గా ఆయన ఎదిగిన తీరును చూపిస్తూ వచ్చిన చిత్రం 'ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ఈ చిత్రం రూ. 216 కోట్ల వసూళ్లతో క్రికెట్, సినీ అభిమానుల మనసులు గెలుచుకుంది.

మ్యాథ్స్ జీనియస్ 'సూపర్ 30':

బీహార్‌కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన చిత్రం 'సూపర్ 30' పేద విద్యార్థులను ఐఐటీకి పంపేందుకు ఆయన పడిన కష్టాలు, సమాజంతో చేసిన పోరాటాన్ని చూపించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద రూ. 208 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

క్రీడాకారుల బయోపిక్స్:

భారత స్ప్రింటర్ 'ఫ్లయింగ్ సిఖ్' మిల్ఖా సింగ్ జీవితం ఆధారంగా వచ్చిన 'భాగ్ మిల్ఖా భాగ్' సినిమా రూ. 109 కోట్లు సాధించింది. అలాగే 2014 లో స్టార్ బాక్సర్ మేరీ కోమ్ జీవిత పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన 'మేరీ కోమ్' చిత్రం రూ. 64 కోట్లు రాబట్టింది.

సంచలనం సృష్టించిన 'ది డర్టీ పిక్చర్':

సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ నటిగా వెలిగిన సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా విద్యాబాలన్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'ది డర్టీ పిక్చర్' ఈ సినిమా మహిళా ఓరియంటెడ్ బయోపిక్ అయినప్పటికీ అప్పట్లోనే దాదాపు రూ. 80 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. ఇక విద్యాబాలన్ కెరీర్‌లోనే ఇది ఒక మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది.

నిజ జీవిత సంఘటనలు, స్ఫూర్తిదాయకమైన కథలతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ వసూళ్లను చూస్తే అర్థమవుతుంది. క్రీడలు, సినిమా, విద్య వంటి రంగాల్లోని ప్రముఖుల బయోపిక్స్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో పాటు ప్రజల గుండెల్లో కూడా ఎప్పటికీ నిలిచిపోతాయి..