Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: సినిమా ఇండ‌స్ట్రీని నాశ‌నం చేసే ప‌థ‌కం!

అవునా..! సినిమా ఇండ‌స్ట్రీని నాశ‌నం చేసే ప‌థ‌కం కూడా ఉంటుందా? అంటే.. అవును.. ఉంటుంది. అదెట్టా? అంటే...

By:  Sivaji Kontham   |   9 Jan 2026 8:00 PM IST
టాప్ స్టోరి: సినిమా ఇండ‌స్ట్రీని నాశ‌నం చేసే ప‌థ‌కం!
X

అవునా..! సినిమా ఇండ‌స్ట్రీని నాశ‌నం చేసే ప‌థ‌కం కూడా ఉంటుందా? అంటే.. అవును.. ఉంటుంది. అదెట్టా? అంటే... ఏదైనా పెద్ద స్టార్ న‌టించిన సినిమాకి రూ. 1000 టికెట్ ధ‌ర నిర్ణ‌యించ‌డ‌మే ఈ విప‌త్తున‌కు కార‌ణం. ఇదేమి చోద్య‌మో కానీ ఇరుగు పొరుగున లేని టికెట్ రేట్లు మ‌న‌కు మాత్ర‌మే ఉంటాయి. ఇక్క‌డ ప్ర‌భుత్వాలు సినిమా రంగానికి చాలా సేవ చేయ‌డం అంటే టికెట్ దోపిడీని ప్రోత్స‌హించ‌డంగా భావిస్తున్నాయి. టికెట్ ధ‌ర‌ల్ని అదుపులో ఉంచ‌డం ద్వారా థియేట‌ర్ల‌కు వ‌చ్చే ట్రాఫిక్ ని పెంచాల‌నే నిపుణుల ఆలోచ‌న‌ల‌ను కూడా ఇక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోరు.

బెనిఫిట్ షోల పేరుతో టికెట్ పై వేల‌కు వేలు గుంజుకోవ‌డం, సాధార‌ణ టికెట్ ధ‌ర అంటూ క‌నీసం రూ.400 అయినా టికెట్ పై దండుకోవ‌డం మ‌న తెలుగు రాష్ట్రాల్లో రెగ్యుల‌ర్‌గా చూసే ప్ర‌క్రియ‌. న‌లుగురు స‌భ్యులున్న‌ ఒక సామాన్య మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం టికెట్లు, స్నాక్స్ క‌లుపుకుని క‌నీసం రూ.3000లోపు ఖ‌ర్చు చేయ‌లేని దుస్థితి. అందువ‌ల్ల సామాన్యులు వినోదం కోసం కేటాయించే బ‌డ్జెట్ జీరో అయిపోయింది. ప్ర‌తి కుటుంబం పెరిగిన‌ అధిక‌ జీవ‌న‌వ్య‌యం ఈతి బాధ‌ల కోస‌మే చాలా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప‌రిస్థితి తెలిసినా సినీప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కు ప‌ట్టదు.

సీపీఐ నారాయ‌ణ లేదా ఇంకెవ‌రైనా క‌మ్యూనిస్ట్ ప‌రిశ్ర‌మ మారాలి! అని సూచించింది ఇందుకే. సామాన్యుడి కోణంలో ఇండ‌స్ట్ట్రీ పెద్ద‌లు ఆలోచించ‌డం లేదు గ‌నుక‌నే, మెజారిటీ ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. త‌క్కువ ఖ‌ర్చుతో ఆదుకునే ఓటీటీల‌నే మార్గంగా ఎంచుకుంటున్నారు. అధిక టికెట్ ధ‌ర‌ల్ని చెల్లించ‌లేక థియేట‌ర్ల‌కు వ‌చ్చే వారి సంఖ్య కేవ‌లం 10శాతం లోపు మాత్ర‌మే ఉంది. కానీ ఇది మారాలి అని చెబుతూనే, తిరిగి అవే త‌ప్పిదాల‌ను ఇండ‌స్ట్రీ ప్ర‌జ‌లే చేస్తున్నారు.

త‌మిళ‌నాడులో సినిమా చూడాల‌నుకుంటే రూ.150-200 మ‌ధ్య‌లోనే టికెట్ ధ‌ర అందుబాటులో ఉంది. అక్క‌డ ప్ర‌భుత్వాలే టికెట్ ధ‌ర‌లు అదుపు త‌ప్ప‌కుండా ప్ర‌జ‌ల్ని కాపాడుతున్నాయి. థియేట‌ర్ల‌కు రప్పిస్తున్నాయి. సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ద‌ళ‌ప‌తి `జ‌న‌నాయ‌గ‌న్` టికెట్ ధ‌ర‌లు పూర్తిగా అదుపులో ఉన్నాయి. అటు క‌ర్నాట‌క‌, కేర‌ళ‌లోను టికెట్ ధ‌ర‌ల విష‌యంలో ప్ర‌భుత్వాలు చాలా జాగ్ర‌త్త‌గా ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లోకి వ‌చ్చేప్ప‌టికి స్ట్రెయిట్ సినిమాల‌కే కాదు, అనువాద సినిమాల టికెట్ ధ‌ర‌ల్ని కూడా పెంచుకునే వెసులుబాటు ఉంది. విజ‌య్ `జ‌న‌నాయ‌గ‌న్` ప్ర‌స్తుతం సెన్సార్ ప‌ర‌మైన చిక్కుల్ని ఎదుర్కొంటోంది. కానీ ఈ చిత్రానికి ప‌రిమిత ధ‌ర‌ల‌తో అయితేనే రిలీజ్ చేసుకోవ‌డం పాజిబుల్ అని ప్ర‌భుత్వ‌మే కండిష‌న్ పెడుతోంది.

కర్నాట‌క సినిమా టికెట్ రేట్లపై నియ‌మాలు

కర్నాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలపై సామాన్యులకు ఊరటనిచ్చేలా కీలక నియమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు ఆకాశాన్ని తాకకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని పరిమితులను విధించింది. కర్నాటకలో మల్టీప్లెక్స్‌లు సహా అన్ని థియేటర్లలో సినిమా టికెట్ గరిష్ట ధర రూ.200 (పన్నులు కాకుండా) మించకూడదని ప్రభుత్వం గతంలోనే జీవో జారీ చేసింది. గోల్డ్ క్లాస్ సీట్లు, ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్లకు ఈ నియ‌మం వర్తించదు. వీటి ధరలు థియేటర్ యాజమాన్యం నిర్ణయించుకోవచ్చు.

బుక్‌మైషో లేదా పేటీఎం వంటి ప్లాట్‌ఫారమ్‌లలో టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజులపై కూడా నియంత్రణ ఉండాలని క‌ర్నాట‌క‌ ప్రభుత్వం సూచిస్తోంది. థియేట‌ర్ల‌లో ఆహార‌ప‌దార్థాలు, కోలాల ధ‌ర‌ల‌పైనా క‌ర్నాట‌క‌లో కొన్ని ఆంక్ష‌లున్నాయి. పాప్ కార్న్, వాట‌ర్ బాటిల్స్, తినుబండారాల ధ‌ర‌లు ఎంఆర్‌పి కంటే మించకూడ‌దు. క‌న్న‌డ‌లో టాక్సిక్ లాంటి భారీ బ‌డ్జెట్ సినిమాకి అయినా, జ‌న‌నాయ‌గ‌న్ సినిమాకి అయినా ఈ నియ‌మాల‌న్నీ వ‌ర్తిస్తాయి. కానీ ఇవే నియ‌మాలు ఎప్ప‌టికీ తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్తించ‌వు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలే ప్ర‌జ‌ల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు స‌హ‌క‌రిస్తుంటే, తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఎప్ప‌టికీ దీనిని ప‌ట్టించుకోని ప‌రిస్థితి ఉంద‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రాకుండా ఓటీటీలు, బుల్లితెర‌ను ఆద‌రించ‌డానికి కార‌ణ‌మేమిటో ఇప్ప‌టికైనా అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తేనే మంచిది. లేదంటే థియేట‌ర్లు క‌ళ్యాణ మంట‌పాలుగా మార‌డానికి మ‌రో అవ‌కాశం సినీపెద్ద‌లే క‌ల్పించిన‌ట్టు!!