Begin typing your search above and press return to search.

VFX / CGI లో సినిమా తీయాలంటే ఎద‌ర‌య్యే స‌వాళ్లు?

అయితే వీఎఫ్ఎక్స్- గ్రాఫిక్స్ బేస్డ్ క‌థ‌ల్ని రాసుకునే ద‌ర్శ‌కులు తాము ఆశించిన ఔట్ పుట్ సాధించ‌లేక‌, అవ‌స‌ర‌మైన బ‌డ్జెట్లు తేలేక నానా తంటాలు ప‌డుతుంటారు.

By:  Sivaji Kontham   |   27 Jan 2026 8:00 AM IST
VFX / CGI లో సినిమా తీయాలంటే ఎద‌ర‌య్యే స‌వాళ్లు?
X

విజువ‌ల్ గ్రాఫిక్స్ లేదా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఎంత ఎక్కువ‌గా ఉంటే, తెర‌పై మాయాజాలం అంత‌గా అబ్బుర‌ప‌రుస్తుంది. అయితే సాంకేతికంగా ఎంత ఎలివేష‌న్ ఉన్నా మంచి క‌థ‌, క‌థ‌నాలు, న‌టీన‌టుల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌, స్క్రీన్ ప్లే జిమ్మిక్ లేక‌పోతే సినిమాలు ఆడ‌టం లేదు. అయితే వీఎఫ్ఎక్స్- గ్రాఫిక్స్ బేస్డ్ క‌థ‌ల్ని రాసుకునే ద‌ర్శ‌కులు తాము ఆశించిన ఔట్ పుట్ సాధించ‌లేక‌, అవ‌స‌ర‌మైన బ‌డ్జెట్లు తేలేక నానా తంటాలు ప‌డుతుంటారు. గ‌తంలో నాగార్జున‌- `ఢ‌మ‌రుకం, చిరంజీవి -అంజి చిత్రాలు ఈ కేట‌గిరీలోనే తెర‌కెక్కాయి. సినిమాలు ప్రారంభ‌మ‌య్యాక బ‌డ్జెట్లు అంత‌కంత‌కు పెరిగిపోవ‌డం స‌మ‌స్య‌గా మారింది..విజువ‌ల్ గ్రాఫిక్స్- ఎఫెక్ట్స్ కోసం అధికంగా పాకులాడ‌టం తో బ‌డ్జెట్లు అదుపుత‌ప్పి కాస్ట్ ఫెయిల్యూర్స్‌గా మారాయి.

ఇటీవ‌ల‌ వీఎఫ్ఎక్స్- ఆఫ్ట‌ర్ ఎఫెక్ట్స్ వంటివి అధికంగా ఉప‌యోగిస్తూ తెర‌కెక్కిస్తున్న విశ్వంభ‌ర‌, స్వ‌యంభు వంటి చిత్రాలు ఆల‌స్యంగా రావ‌డం వెన‌క కార‌ణాలు ఏమిటో విశ్లేషించేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. నిజానికి భారీ తారాగ‌ణంతో పాటు, సాంకేతికంగా ది బెస్ట్ కావాల‌నుకున్న‌ప్పుడు చాలా కాలం వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. అలాంటి కార‌ణాల‌తోనే ఇవి అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతున్నాయ‌నే చ‌ర్చ చాలా కాలంగా సాగుతోంది.

నిజానికి గ్రాఫిక్స్ (VFX / CGI) సినిమాలు తీయాలంటే ద‌ర్శ‌కుడు ఎలాంటి త‌ల‌నొప్పులు ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసుకుంటే చాలా సంక్లిష్ఠ‌మైన విష‌యాలు ఉన్నాయి. ఇలాంటివి ఒక దర్శకుడికి అత్యంత సవాలుతో కూడుకున్నవి. బయటకు కనిపించే విజువల్స్ వెనుక దర్శకుడు పడే `తలనొప్పులు` సామాన్యమైనవి కావు. ఇది ఒక రకంగా `కనిపించని ప్రపంచాన్ని ఊహించి, షూటింగ్ చేయడం`. ఇదేమీ ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు.

అధునాత‌న సాంకేతిక‌త‌తో బ్లూ మ్యాట్ లేదా గ్రీన్ మ్యాట్ స్క్రీన్ షూటింగ్ చాలా జాగ్ర‌త్త‌గా చేయాల్సి ఉంటుంది. షూటింగ్ సమయంలో నటుల వెనుక కేవలం పచ్చని లేదా నీలం రంగు తెరలు మాత్రమే ఉంటాయి. ఇది నిజంగా ఒక స‌వాల్... అక్కడ ఒక పెద్ద యుద్ధం జరుగుతోందని లేదా ఒక డ్రాగన్ ఎగురుతోందని దర్శకుడు ఊహించుకుని నటులకు వివరించాలి. తార‌లు కూడా ఊహించుకుని న‌టించాలి. న‌టీనటులు సరైన వైపు చూడకపోతే, ఐ లైన్ మిస్ మ్యాచ్ అయితే, గ్రాఫిక్స్ వేసిన తర్వాత అవి చాలా కృత్రిమంగా కనిపిస్తాయి.

సినిమా తీయకముందే కంప్యూటర్ పై కార్టూన్లలాంటి వీడియోలను తయారు చేస్తారు. స్టోరీబోర్డ్ వేసే స‌మ‌యంలో ప్రి-విజువలైజేషన్ లో తప్పులు దొర్లితే అంతా వృధానే. షూటింగ్ సమయంలో కెమెరా యాంగిల్స్ ఈ ప్రి విజువ‌ల్స్‌ కి సరిపోకపోతే, పోస్ట్ ప్రొడక్షన్ లో గ్రాఫిక్స్ సెట్ అవ్వవు. దీనివల్ల షూట్ చేసిన సీన్లను మళ్ళీ రీ షూట్ చేయాల్సి వస్తుంది. అలాగే షూటింగ్‌లో వాడిన లైటింగ్, గ్రాఫిక్స్ లో సృష్టించే వాతావరణానికి సరిపోవాలి. ఉదాహరణకు నటుడిపై ఎండ పడుతున్నట్లు లైటింగ్ పెట్టి, వెనుక గ్రాఫిక్స్‌లో వర్షం కురుస్తున్నట్లు చూపిస్తే సినిమా ఫ్లాప్ అవుతుంది. అయితే ప్రతి ఫ్రేమ్‌లో లైటింగ్ మ్యాచ్ చేయడం అనేది దర్శకుడికి, సినిమాటోగ్రాఫర్‌కి పెద్ద పరీక్ష.

ఒక భారీ సినిమా కోసం వందల మంది VFX ఆర్టిస్టులు పనిచేస్తుంటారు. దర్శకుడు అనుకున్న `విజన్` ఆ ఆర్టిస్టులకు సరిగ్గా చేరకపోతే, అవుట్‌పుట్ పేలవంగా వస్తుంది. దీనికి పెద్ద ఉదాహ‌ర‌ణ ఆదిపురుష్‌. ఇలాంటి సినిమాల్లో గ్రాఫిక్స్ విమర్శల పాలు కావడానికి ప్రధాన కారణం దర్శకుడి ఆలోచనకు, గ్రాఫిక్స్ అవుట్‌పుట్‌కు మధ్య పొంతన లేకపోవడమే.

గ్రాఫిక్స్ అంటేనే ఖర్చుతో కూడిన పని. ఒక్కోసారి ఒక్క షాట్ సరిగ్గా రావడానికి నెలల సమయం పడుతుంది. ఆదిపురుష్, రా-వ‌న్, ఢ‌మ‌రుకం, అంజి స‌హా చాలా సినిమాల‌కు ఇలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పుడు, బడ్జెట్ పెరిగిపోతున్నప్పుడు నాణ్యతతో రాజీ పడాల్సి వస్తుంది. దీనివల్ల విజువల్స్ `కార్టూన్` లాగా కనిపిస్తాయి. గుణ‌శేఖ‌ర్ `రుద్ర‌మదేవి` క్లైమాక్స్ చూసిన వారికి ఈ విష‌యంపై మ‌రింత క్లారిటీ వ‌స్తుంది. అస‌లు ఆ సినిమాకి క్లైమాక్స్ తెర‌కెక్కించిన‌ట్టే అనిపించ‌దు. అనుకున్న రేంజ‌లో గ్రాఫిక్స్ తేవ‌డానికి బ‌డ్జెట్లు స‌రిపోని దుస్థితిలో ఆ క్లైమాక్స్ అలా పేల‌వంగా త‌యారైంది.

గ్రాఫిక్స్ హడావుడిలో పడి దర్శకులు ఒక్కోసారి కథ, భావోద్వేగాల మీద దృష్టి పెట్టడం మర్చిపోతే ఇక ఆ సినిమా చూడ‌టం క‌ష్టం. గ్రాఫిక్స్ అనేది కథను చెప్పడానికి ఒక సాధనం మాత్రమే కావాలి.. అదే కథ కాకూడదు. ఇది చాలా మంది దర్శకులు ఎదుర్కొనే అతిపెద్ద ట్రాప్.

అందుకే ఇవ‌న్నీ తెలిసిన వాడిగా రాజమౌళి లాంటి దర్శకులు గ్రాఫిక్స్ సినిమాల కోసం 2-3 ఏళ్ల సమయం తీసుకుంటారు. పక్కా ప్లానింగ్ లేకపోతే గ్రాఫిక్స్ సినిమాలు దర్శకుడికి ఒక నరకంలా మారుతాయి. ప్ర‌తిదీ ప్ర‌ణాళిక ప్ర‌కారం చేయాల‌నుకున్నా బ‌డ్జెట్ల ప‌రంగా స‌వాళ్లు ఎదుర‌వుతాయి.