సినిమా తీస్తే తెలుస్తుంది.. డ్యాన్స్ చేస్తే కాదు: వీరమల్లు నిర్మాత కౌంటర్
అయితే సినిమా రిలీజ్ అయ్యాక వైసీపీ నేత అంబటి రాంబాబు.. తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 28 July 2025 12:14 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన హరిహర వీరమల్లు మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్.. సిల్వర్ స్క్రీన్ పై కనిపించారనే చెప్పాలి. పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో రూపొందిన ఆ సినిమాతో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తున్నారు పవర్ స్టార్.
పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కిన వీరమల్లు మూవీకి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక వైసీపీ నేత అంబటి రాంబాబు.. తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
మూడేళ్ల తర్వాత పవన్ మూవీ వస్తుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొందని, సినిమా హిట్ అవ్వాలని అందరూ కోరుకున్నారన్నారని అంబటి రాంబాబు అన్నారు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ట్వీట్ చేసినట్టు మరోసారి చెప్పారు. అనేక ఒడిదుడుకుల మధ్య హరిహర వీరమల్లు సినిమా నిర్మాణం పూర్తి అయిందని తెలిపారు.
అందుకే నిర్మాత రత్నానికి కనక వర్షం కురిపించాలని కూడా కోరుకున్నట్టు చెప్పిన అంబటి రాంబాబు.. తన ట్వీట్ పై చాలా చర్చ జరిగిందని తెలిపారు. అయితే టికెట్ ధరలతో ప్రేక్షకుల్ని దోపిడీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు నిర్మాత రత్నం రెస్పాండ్ అయ్యారు.
సినిమాకు ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారని, ఇష్టం లేని వాళ్ళు బలవంతంగా రారని ఏఎం రత్నం తెలిపారు. కానీ కొందరు గిట్టని వాళ్లు.. అంబటి రాంబాబు వంటి వారు టికెట్ రేట్లు పెంచారు.. దోచుకున్నారు అని అంటున్నట్లు చెప్పారు. కానీ సినిమా తీస్తే తెలుస్తుంది.. రోడ్ల మీద డ్యాన్సులు వేస్తే కాదని రత్నం కౌంటర్ ఇచ్చారు.
అయితే పర్సనల్ గా ఎవరినీ కామెంట్ చేయకూడదని, కానీ ఆయన అన్నారు కాబట్టి తాను కూడా రెస్పాండ్ అయినట్లు రత్నం చెప్పారు. తనతో సినిమా చేయమని, వర్క్ చేయమని సవాల్ విసిరారు. అప్పుడే మూవీ అంటే ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రత్నం కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.
