‘హే బల్వంత్’ మూవీ రివ్యూ
By: Prakash Chimmala | 20 Feb 2026 2:03 PM IST‘హే బల్వంత్’ మూవీ రివ్యూ
నటీనటులు: సుహాస్- శివాని నాగారం- నరేష్- సుదర్శన్- హర్షవర్ధన్- అజయ్ ఘోష్- బాబూ మోహన్- అన్నపూర్ణ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: మహిరెడ్డి పండుగుల
నిర్మాత: నరేందర్ రెడ్డి
రచన-దర్శకత్వం: గోపి అచ్చర
హీరోగా ‘కలర్ ఫొటో’ సహా కొన్ని మంచి సినిమాలతో మెప్పించిన యువ నటుడు సుహాస్.. మధ్యలో కొంచెం ట్రాక్ తప్పాడు. ఇప్పుడతను ‘హే బల్వంత్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు గోపి అచ్చర రూపొందించిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
కృష్ణ (సుహాస్) చదువు పూర్తి చేసుకుని తన తండ్రి బల్వంత్ (నరేష్) వ్యాపారాన్ని టేకప్ చేయాలని చూస్తున్న కుర్రాడు. ఐతే తండ్రి చేసే వ్యాపారమేంటో అతడికి తెలియకుండానే.. దాని మీద చాలా అంచనాలు పెట్టుకుని ఉంటాడు. బిజినెస్ మీద కృష్ణకు ఉన్న ఆసక్తి.. తన ఐడియాలు చూసి చిత్ర (శివాని నాగారం) అతణ్ని ఇష్టపడుతుంది. ఇంతలో బల్వంత్ అనారోగ్యం పాలవడంతో కృష్ణ ఆయన వ్యాపారాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఎంతో ఉత్సాహంగా తండ్రి ఆఫీసుకు వెళ్లిన కృష్ణకు అక్కడ జరిగే వ్యాపారం చూసి దిమ్మదిరిగిపోతుంది. ఇంతకీ బల్వంత్ వ్యాపారమేంటి.. దాని గురించి తెలిసిన కృష్ణ.. ఎలా రియాక్టయ్యాడు. దీని వల్ల చిత్రతో అతడికి వచ్చిన ఇబ్బందులేంటి.. చివరికి వీళ్లిద్దరూ కలిశారా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
కొన్ని సినిమాల్లో సన్నివేశాలు బాగానే అనిపిస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఓకే అనిపిస్తుంది. కానీ సినిమాలో ఏదో ఒక జీర్ణించుకోలేని.. కన్విన్స్ కాలేని పాయింట్ ఏదో ఒకటి ఉంటుంది. మిగతా వ్యవహారం ఎంత పాజిటివ్ అనిపించినా.. ఆ పాయింట్ దగ్గర స్ట్రక్ అయ్యామంటే ముందుకు సాగడం కష్టమనిపిస్తోంది. పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డ ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుంది. అందులోనూ సినిమా కోర్ కాన్సెప్టే అలాంటి పాయింట్ చుట్టూ తిరిగినపుడు.. మిగతా వ్యవహారం ఎంత బాగున్నా సరే.. సినిమాను పూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితి తలెత్తుతుంది. ‘హే బల్వంత్’ సినిమా ఈ కోవకే చెందుతుంది. తెలుగు ప్రేక్షకులు బాగా అడ్వాన్స్ అయిపోయారని.. ఎంత బోల్డ్ కాన్సెప్ట్ అయినా అంగీకరించేస్తున్నారని కొత్త దర్శకుడు గోపీ అచ్చర ఒక సాహసోపేతమైన పాయింట్ తీసుకుని దాని మీదే ‘హే బల్వంత్’ను నడిపించాడు. ఐతే సినిమాలో కామెడీ చాలా వరకు వర్కవుట్ అయినా సరే.. కన్విన్స్ కాలేని ప్లాట్ పాయింట్ వల్ల ప్రేక్షకులకు మిశ్రమానుభూతి కలుగుతుంది. కామెడీకి ఎమోషన్ కూడా మిక్స్ చేయాలన్న ప్రయత్నం సత్ఫలితాన్ని ఇవ్వలేదు. కేవలం కామెడీ కోసమైతే మాత్రం ‘హే బల్వంత్’ను ఓసారి ట్రై చేయొచ్చు.
‘హే బల్వంత్’ ప్రోమోలన్నీ సినిమాలో హీరో తండ్రి చేసే బిజినెస్ ఏంటి అనే పాయింట్ చుట్టూ తిరగడం వల్లే ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఒక క్యూరియాసిటీ కలిగింది. దాని గురించి లోతుగా చర్చించలేం కానీ.. అది సినిమాలోని పాత్రల్లాగే ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేని విధంగా ఉంటుంది. ఐతే దాని మీద వినోదం పండించాలనుకుంటే ఇబ్బందేమీ లేదు. నిజానికి ఆ నేపథ్యంలో కామెడీ కూడా బాగా వర్కవుట్ అయింది సినిమాలో. వీలైనంత మేర వల్గారిటీ లేకుండానే కామెడీ సన్నివేశాలు రాసుకున్నారు. సుదర్శన్.. వెన్నెల కిషోర్ లాంటి అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు తోడవడం.. వన్ లైనర్స్ కూడా బాగా పేలడంతో నవ్వులకు ఢోకా లేకపోయింది. హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు.. ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్లు సరదాగా సాగిపోయాయి. ప్రేమకథలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేకున్నాన.. ప్రథమార్ధంలో ‘హే బల్వంత్’ బాగానే టైంపాస్ చేయిస్తుంది. హీరో స్నేహితుడి పాత్రలో సుదర్శన్ పంచిన వినోదం ప్రథమార్ధానికి అతి పెద్ద బలం. హీరో తండ్రి చేసే బిజినెస్ విషయంలో సస్పెన్స్ వీడి హీరో మైండ్ బ్లాంక్ అయ్యే ఎపిసోడ్.. ఆ తర్వాత కథానాయికకు తెలియకుండా మేనేజ్ చేసే ఎపిసోడ్లు.. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్.. వీటన్నింటినీ దర్శకుడు బాగా డీల్ చేశాడు. ప్రథమార్ధం వరకు ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేశాడు.
కానీ ద్వితీయార్ధంలో మాత్రం ‘హే బల్వంత్’ అంచనాలకు తగ్గట్లుగా సాగలేదు. హీరో తండ్రి చేసే బిజినెస్ మీద వినోదం వరకు ఓకే కానీ.. దాని మీద ఎమోషన్ కూడా వర్కవుట్ చేయాలని చేసిన ప్రయత్నమే పెద్దగా ఫలించలేదు. నరేష్ చేసిన తండ్రి పాత్రను ఎంత జస్టిఫై చేయాలని చూసినా సరే.. ప్రేక్షకులు కన్విన్స్ కావడం కష్టమే. పైగా ద్వితీయార్ధంలో మెలో డ్రామా.. సెంటిమెంట్ ఓవర్ డోస్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సన్నివేశాలు మరీ ఫోర్స్డ్ అనిపిస్తాయి కూడా. సెకండాఫ్ లో కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అన్ని పాత్రలనూ ఒక చోటికి తీసుకొచ్చి వాటి మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కామెడీ పండించడానికి ప్రయత్నించడం చాలా సినిమాల్లో చూశాం. ఇక్కడ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ సీన్లు బోరింగ్ గా అనిపిస్తాయి. ముగింపులో తండ్రీ కొడుకుల ఎమోషన్ మీద నడిపించిన సన్నివేశాలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. నరేష్ బాగా పెర్ఫామ్ చేస్తూ తన పాత్రను పండించడానికి గట్టి ప్రయత్నం చేసినా.. ఆ పాత్ర కన్విన్సింగ్ గా లేకపోవడం వల్ల కోరుకున్న ఎమోషన్ రావడం కష్టమే. మొత్తంగా చెప్పాలంటే టైంపాస్ కామెడీ కోసం ‘హే బల్వంత్’ను చూడచ్చు .
నటీనటులు:
సుహాస్ కృష్ణ పాత్రను ఈజీగా చేసుకుపోయాడు. చాలా సింపుల్ గా పాత్రలో ఒదిగిపోయే తీరు ప్రేక్షకులకు నచ్చుతుంది. హీరోలా కాకుండా ఒక ముఖ్య పాత్రధారుల్లో ఒకడిలా కనిపిస్తాడతను. కామెడీ సీన్లలోనే కాక ఎమోషనల్ ఎపిసోడ్లలోనూ సుహాస్ బాగా చేశాడు. హీరోయిన్ శివాని నాగారం పాత్ర.. నటన ఆకట్టుకుంటాయి. ఆమె కామెడీ టైమింగ్ బాగుంది. మాది ఆర్థడాక్స్ ఫ్యామిలీ అంటూ ఆమె చెప్పే డైలాగ్.. దాని మీద నడిపించిన కామెడీ వర్కవుట్ అయింది. నరేష్ పాత్ర కథలో హీరోను డామినేట్ చేసే స్థాయిలో ఉంది. ఆయన పెర్ఫామెన్సుకు తిరుగులేదు. కామెడీ ఓ మోస్తరుగా అనిపిస్తుంది కానీ.. ఎమోషనల్ సీన్లలో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. పతాక సన్నివేశాల్లో ఆయన బలమైన ముద్ర వేశారు. నెల్లూరు యాసలో సుదర్శన్ పంచులు సినిమాకు అతి పెద్ద బలం. అతను కనిపించినపుడల్లా నవ్వులు పండాయి. వెన్నెల కిషోర్ రెండు ఎపిసోడ్లలో నవ్వించాడు. అజయ్ ఘోష్.. హర్షవర్ధన్ ఓకే. నటిగా అరంగేట్రం చేసిన యాంకర్ ప్రశాంతి ప్రేక్షకులు ఊహించని పాత్రలో చక్కగా నటించి మెప్పించింది. అన్నపూర్ణమ్మ.. మిగతా ఆర్టిస్టులు అంతా ఓకే.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘హే బల్వంత్’ పర్వాలేదనిపిస్తుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఉత్సాహభరితంగా సాగింది. పాటలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మహిరెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు సరిపడా స్థాయిలో ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ గోపి అచ్చరకు కామెడీ మీద మంచి పట్టున్న సంగతి అర్థమవుతుంది. తన డెబ్యూ మూవీ కోసం అతను చాలా రిస్కీ సబ్జెక్టును ఎంచుకున్నాడు. ఆ పాయింట్ మీద సినిమాలో సస్పెన్స్ మెయింటైన్ చేసిన తీరు.. రెండు ముఖ్యమైన ట్విస్టులతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసిన తీరు బాగుంది. కానీ దీని మీద ఎమోషన్లను వర్కవుట్ చేయాలనుకోవడం.. సమాజానికి ఏదో సందేశం ఇవ్వాలనుకోవడం మాత్రం మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. అక్కడే దర్శకుడు తడబడ్డాడు అనిపిస్తుంది. దర్శకుడు ఈ పాయింట్ తీసుకోవడం తప్పని అనలేం కానీ.. దాని మీద కామెడీని.. ఎమోషన్ ను కలపాలన్న ప్రయత్నమే పెద్దగా ఫలించలేదు.
చివరగా: హే బల్వంత్.. నవ్వుకోవచ్చు కానీ!
రేటింగ్- 2.5/5
