‘ఆ డైరెక్టరే నా గురువు.. టాలీవుడ్‌కు తెచ్చారు’: హేషామ్ అబ్దుల్ ఎమోషనల్!
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ చిత్రం సెప్టెంబర్ 11న రిలీజ్ కాబోతోంది.
By: M Prashanth | 4 Sept 2026 10:49 PM ISTఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ చిత్రం సెప్టెంబర్ 11న రిలీజ్ కాబోతోంది. ఆదిత్య హాసన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే యూత్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వహాబ్ మాట్లాడిన విషయాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తాను ఇంకా తెలుగు నేర్చుకుంటున్నానని, త్వరలోనే పూర్తిగా తెలుగులో మాట్లాడతానని హేషామ్ చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ తనకు ఇస్తున్న ఆదరణ, బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిని చేసిన దర్శకుడు ఆదిత్య హాసన్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
డైరెక్టర్ ఆదిత్య ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారని, తనను కూడా ఆ మాయలోకి తీసుకెళ్లారని హేషామ్ చెప్పారు. సినిమా విడుదలయ్యే వరకు తాను ఆ ట్రాన్స్ నుంచి బయటకు రావడం కష్టమేనని అన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవిల కెరీర్‌లోనే ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుందని, వారిద్దరితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
తనను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు శివ నిర్వాణ గురించి చెబుతూ హేషామ్ వేదికపై భావోద్వేగానికి గురయ్యారు. శివ నిర్వాణ తన గురువు లాంటి వారని, టాలీవుడ్‌లో మ్యూజిక్ ఎలా చేయాలి, ఇక్కడి పరిశ్రమతో ఎలా ముందుకెళ్లాలి అనే విషయాలను ఆయనే నేర్పించారని చెప్పారు. తనకు లైఫ్ ఇచ్చిన వ్యక్తిగా ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు.
ఈవెంట్‌కు వచ్చిన రష్మిక మందన్న, నటుడు శివాజీలను హేషామ్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే శైలేష్ కొలను దర్శకత్వంలో రాబోతున్న ‘ఏమో ఏమో ఇది’ సినిమా గురించి ప్రస్తావిస్తూ, ‘ఎపిక్’ పూర్తయిన వెంటనే ఆ వర్క్ మొదలుపెట్టేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్న ‘ఎపిక్’ ఒక మంచి మ్యూజికల్ జర్నీగా అందరినీ అలరిస్తుందని అన్నారు.
యాంకర్ రిక్వెస్ట్ మేరకు హేషామ్ వేదికపై పాటలు పాడి అలరించారు. ఇటీవల సెన్సేషన్ క్రియేట్ చేసిన తన పాపులర్ పాటతో పాటు, ఎపిక్ చిత్రంలోని ‘సంచారమే’ పాటను లైవ్‌లో పాడి ప్రేక్షకులను మెప్పించారు. సినిమా ప్రతి ఒక్కరినీ నవ్విస్తూ, కదిలిస్తూ, ప్రేమలో పడేలా చేస్తుందని చెబుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
