వెండి తెరపై హీరోయిన్ల ప్రయోగాలు!
ప్రస్తుతం హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన సవాల్‌తో కూడిన పాత్రలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు.
By: Srikanth Kontham | 28 March 2026 6:00 PM ISTప్రస్తుతం హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన సవాల్‌తో కూడిన పాత్రలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు. సౌత్ నుండి నార్త్ వరకు.. అలాగే బాలీవుడ్ నుంచి సౌత్ వరకు హీరోయిన్ల మధ్య జరుగుతోన్న క్యారెక్టర్ ఎక్స్ఛేంజ్ అన్నది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. భాషా భేదం లేకుండా వైవిధ్యమైన కథాంశాలతో కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్న తీరు ఆకట్టుకుంటోంది. నేచురల్ స్టార్ సాయి పల్లవి బాలీవుడ్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన `రామాయణ` చిత్రంలో అమ్మడు సీత పాత్ర పోషిస్తుంది.
ఆమెలోని సహజమైన నటన, గంభీరత ఆ పాత్రకు నిండుదనాన్ని ఇస్తాయ నడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి `18` అనే చిత్రంలోనూ సాయి పల్లవి అల్ట్రా మోడ్రన్ స్టైలిష్ పాత్రలో కనిపిస్తుంది. ఈ రెండు భిన్నమైన పాత్రలు సాయి పల్లవిలోని వైవిధ్యాన్ని చాటిచెబుతున్నాయి.
అలాగే అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా పంథా మార్చింది. బాలీవుడ్‌లో మోడ్రన్ అర్బన్ పాత్రలు చేసిన జాన్వీ ఇప్పుడు సౌత్ సినిమాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఎన్టీఆర్ సరసన `దేవర` పల్లెపిల్ల తంగ పాత్రలో అలరించింది. తెరపై కాసేపే కనిపించినా? అదోక ఐకానిక్ రోల్ గా చెప్పొచ్చు. అలాగే రామ్ చరణ్ సరసన `పెద్ది` లోనూ వైవిథ్యమైన పాత్రలో కనిపించబోతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ కావడంతో జాన్వీ పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుందనే అంచనాలున్నాయి. అదే సమయంలో బాలీవుడ్ ప్రాజెక్టులలో తన గ్లామర్ మోడ్రన్ లుక్స్ పరంగానూ ఎక్కడా తగ్గడం లేదు. ఇలా జాన్వీ రెండు ఇండస్ట్రీల మధ్య సమతుల్యతను పాటిస్తున్నారు. మలయాళ కుట్టి మమిత బైజు కూడా కెరీర్‌ను తెలివిగా ప్లాన్ చేసుకుంటోంది.
సూర్య హీరోగా నటిస్తోన్న `విశ్వనాథన్ అండ్ సన్స్` లో అమ్మడు మెచ్యూర్డ్ బాధ్యతాయుతమైన పాత్ర పోఫిస్తోంది. అదే సమయంలో ధనుష్ హీరోగా నటిస్తోన్న `కర` చిత్రంలో స్వచ్ఛమైన విలేజ్ గాళ్ పాత్రను పోషిస్తోంది. ఒకే సమయంలో వైవిధ్యమైన పాత్రలను చేయడం మమితలోని నటన సామర్థ్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు.మొత్తంగా హీరోయిన్లు ఇప్పుడు తమ ఇమేజ్‌ను ఒకే రకమైన పాత్రలకు పరిమితం చేయడం లేదన్నది సుస్పష్టం. ఈ విధమైన ప్రయోగాలు హీరోయిన్ కెరీర్ గ్రాఫ్‌ను పెంచడమే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నారు.
