రైటర్ విజన్ లో హీరో ప్రమేయం ప్లస్సా-మైనస్సా!
సినీ నిర్మాణం అనేది సృజనాత్మక ప్రక్రియ మాత్రమే కాదు. వందల కోట్ల పెట్టుబడితో కూడిన వ్యాపారం.
By: Srikanth Kontham | 16 April 2026 8:40 PM ISTసినీ నిర్మాణం అనేది సృజనాత్మక ప్రక్రియ మాత్రమే కాదు. వందల కోట్ల పెట్టుబడితో కూడిన వ్యాపారం. దర్శకుడు తన మౌలిక ఆలోచనతో కథను సిద్ధం చేసుకున్నప్పుడు అందులో హీరో ప్రమేయం పెరగడం అనేది సహజంగానే చర్చకు దారితీస్తుంది. దర్శకు, రచయిత సినిమా తీయడానికి రెడీ అయితే? హీరో తన ఇమేజ్‌ను, అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు కోరుతుంటారు. ఈ క్రమంలో దర్శకుడి ప్రాథమిక ఆలోచన పక్కదారి పట్టి, సినిమా ఒక ఫార్ములా చిత్రంగా మారిపోయే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తుంటారు.
స్టార్ పవర్ ఎక్కువగా ఉన్న పరిశ్రమలో హీరోల ఇమేజ్ ఒక చట్రం లాంటిది. దర్శకుడు రాసుకున్న కథలో హీరో పాత్ర బలహీనంగా ఉన్నా లేదా నెగటివ్ షేడ్స్ ఉన్నా అది అభిమానులకు నచ్చదేమో అన్న భయం హీరోల్లో ఉంటుంది. ఈ క్రమంలో కథా చర్చల దశలో హీరో ఎలివేషన్స్ కోసం సీన్లను మార్చడం వల్ల కథలోని సహజత్వం దెబ్బతింటుంది. దర్శకుడు చెప్పాలనుకున్న అసలు సందేశం కంటే? హీరోని గొప్పగా చూపించే ప్రయత్నమే ఎక్కువైతే? అది దర్శకుడి మౌలిక ఆలోచనను దెబ్బతీస్తుంది.
మరో కోణంలో చూస్తే? హీరోల ప్రమేయం ఎప్పుడూ నష్టదాయకం కాదు. నేటి కాలంలో ఒక సినిమా పరాజయం పాలైతే దాని ప్రభావం హీరో మార్కెట్‌పై తీవ్రంగా ఉంటుంది. అందుకే స్క్రిప్ట్ విషయంలో హీరోలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడి విజన్‌ను విమర్శించడం కంటే? ఆ కథను మరింత మంది ప్రేక్షకులకు ఎలా చేర్చాలి అనే విషయంలో హీరోలు ఇచ్చే సూచనలు ఒక్కోసారి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. దీనిని ఆధిపత్యం అనడం కంటే? ఒక ప్రాజెక్ట్‌ను విజయవంతం చేయడానికి చేసే సమిష్టి కృషిగా చూడాలి.
అయితే ప్రతి చిన్న విషయంలోనూ హీరోలు జోక్యం చేసుకోవడం వల్ల దర్శకులు ఒత్తిడికి లోనవుతారు. ముఖ్యంగా యువ దర్శకులు స్టార్ హీరోలతో పనిచేస్తున్నప్పుడు తమ మౌలిక ఆలోచనలను బలంగా చెప్పలేకపోతుంటారు. హీరో చెప్పినట్లుగా కథను మార్చడం వల్ల దర్శకుడిలోని సృజనాత్మకత చచ్చిపోతుంది. వెండితెరపై మనం చూసేది దర్శకుడి విజన్ కాదు. హీరో కోరుకున్న వెర్షన్ మాత్రమే అవుతుంది. ఇది దీర్ఘకాలంలో వైవిధ్యమైన సినిమాల రాకను అడ్డుకుంటునే ప్రమాదం ఉంటుంది.
దర్శకుడి ఆలోచనకు, హీరో అనుభవానికి మధ్య సరైన సమన్వయం కుదిరినప్పుడు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ సాధ్యమవుతుంది. రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు తమ విజన్ విషయంలో రాజీ పడరు. అదే సమయంలో హీరోల ఇమేజ్‌ను ఎలా వాడుకోవాలో వారికి తెలుసు. హీరోలు సూచనలు ఇచ్చే సలహా దారులుగా ఉంటే సినిమా నాణ్యత పెరుగుతుంది. కానీ వారు కథను శాసించే స్థాయికి వెళ్తే మాత్రం అది సృజనాత్మకతకు గొడ్డలి పెట్టు లాంటిదే.
హీరో ప్రమేయం ఉన్నా? లేకపోయినా? ప్రేక్షకుడు కోరుకునేది ఒక మంచి కథను మాత్రమే. దర్శకుడి మౌలిక ఆలోచనను గౌరవిస్తూనే కమర్షియల్ అంశాలను జోడించిన సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. స్టార్ హీరోలు తమ ఆధిపత్యాన్ని పక్కన పెట్టి దర్శకుడి విజన్‌కు ప్రాణం పోసే నటులుగా మారినప్పుడు మరిన్ని గొప్ప సినిమాలు వస్తాయి. లేనిపక్షంలో హీరోల కోసం తీసే సినిమాలు కాలక్రమంలో విస్మరించబడతాయి అన్నది అంతే వాస్తవం.
