క్లాసిక్ ఫ్రాంచైజీలో ముదురుతోన్న వివాదాలు!
ఫిరోజ్ నడియాద్వాలా తన పట్ల ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో తాను దర్శకత్వం వహించిన మొదటి భాగం `హేరా ఫేరీ` (2000) ఎడిటింగ్ విషయంలో ఫిరోజ్ తనను అవమానించారని గుర్తు చేసుకున్నారు.
By: Srikanth Kontham | 4 July 2026 3:37 PM ISTబాలీవుడ్ లో అత్యంత ఆదరణ పొందిన హాస్య చిత్రాల ఫ్రాంచైజీ `హేరా ఫేరీ` మూడో భాగం చుట్టూ వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. దర్శకుడు ప్రియదర్శన్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ప్రకటిం చారు. నిర్మాత ఫిరోజ్ తనను పలుమార్లు అవమానించారని.. ఆ కారణంగానే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుండి పూర్తిగా వైదొలగాల్సి వచ్చిందని ప్రియదర్శన్ బహిరంగంగా వెల్లడించడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఫిరోజ్ నడియాద్వాలా తన పట్ల ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో తాను దర్శకత్వం వహించిన మొదటి భాగం `హేరా ఫేరీ` (2000) ఎడిటింగ్ విషయంలో ఫిరోజ్ తనను అవమానించారని గుర్తు చేసుకున్నారు.
తాను ఐదు గంటల నిడివితో అందించిన కట్‌ను ఫిరోజ్ చూసి అది ఒక పేదవాడి సినిమా వెర్షన్ లా ఉందని వ్యాఖ్యానించారన్నారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా ఎడిట్ చేశానని చెప్పుకున్నారని ప్రియదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురంచి అక్షయ్ కుమార్ వద్ద చెడుగా చెప్పే ప్రయత్నం కూడా నిర్మాత చేసినట్లు ఆరో పించారు.`నీకు హేరా ఫేరీ 3 చేసే హక్కులు ఉన్నాయి. కానీ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రియదర్శన్‌తో మాత్రం చేయవద్దు` అని అక్షయ్ ను కోరినట్లు తనకు తెలిసిందని ప్రియదర్శన్ పేర్కొన్నారు.
అలాగే ఈ ప్రాజెక్ట్‌ను ప్రియదర్శన్ అంగీకరించడానికి గల కారణాలను రివీల్ చేసారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ వంటి నటుల అభ్యర్థన మేరకే తాను `హేరా ఫేరీ 3` చేయడానికి ఒప్పుకున్నానన్నారు. తాను కథ చెప్పినప్పుడు హీరోలంతా ఎంతో ఉత్సాహం చూపించారన్నారు. ఒకవేళ ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించి ఉంటే సినీ చరిత్రలోనే ఇదొక అతిపెద్ద ఫ్రాంచైజీగా నిలిచేదని నమ్మకం వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాన్ని `ధురంధర్` సినిమా కంటే ఎంతో భారీ స్థాయిలో అద్భుతంగా తీర్చిదిద్దే వ్యూహం తన వద్ద ఉందని ప్రియదర్శన్ ధీమా వ్యక్తం చేసారు.
అలాగే వ్యక్తిగత విభేదాలతో పాటు ప్రాజెక్ట్‌ను చుట్టుముట్టిన చట్టపరమైన సమస్యలు కూడా సినిమా భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. `హేరా ఫేరీ 3` ప్రకటన రాగానే సౌత్ ఇండియాకు చెందిన సెవెన్ ఆర్ట్స్ ఫిల్మ్స్ అధినేత జి.పి. విజయకుమార్ నుండి తనకు ఫోన్ వచ్చిందని వెల్లడించారు. ఈ సినిమాను నిర్మిస్తే అది కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయన హెచ్చరించినట్లు ప్రియదర్శన్ తెలిపారు. ఈ ప్రాంచైజీ హక్కులకు సంబంధించి కోర్టుల్లో ఉన్న వివాదాల వల్ల సినిమా ముందుకు సాగడం కష్టమన్నారు.
`నా దృష్టిలో హేరా ఫేరీ మొదటి భాగం పుట్టింది. రెండో భాగం ఫిర్ హేరా ఫేరీ అనారోగ్యం పాలైంది. ఇప్పుడు రాబోతున్న `హేరా ఫేరీ 3` పూర్తిగా మరణించినట్లే` అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టపరమైన వివాదాలు - అంతర్గత విభేదాల కారణంగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశాలే లేవని ఐకానిక్ పాత్రలైన రాజు, శ్యామ్, బాబూరావులను ప్రేక్షకులు మళ్లీ తెరపై ఒకేసారి చూసే అవకాశం రాకపోవచ్చని ప్రియదర్శన్ భావిస్తున్నారు. అయితే ప్రియదర్శన్ మాటలకు కౌంటర్ గా నిర్మాత ఫిరోజ్ నడియాద్వాలా సినిమా అనుకున్నట్లే జరుగుతుందని నమ్మకం వ్యక్తం చేసారు. ప్రియదర్శన్ ప్రాజెక్ట్‌లో లేని మాట నిజమే అయినా? సినిమా పనులు మాత్రం సరైన దిశలోనే సాగుతున్నాయన్నారు.
