ఈ సినిమా రిలీజవ్వదు అంటూ పెద్ద షాకిచ్చిన దర్శకుడు!
అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై తాజాగా దర్శకుడు ప్రియదర్శన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాయి.
By: Sivaji Kontham | 1 July 2026 9:21 AM ISTనిర్మాతతో ఘర్షణల కారణంగా `ఈ సినిమా రిలీజవ్వదు!` అంటూ పెద్ద ప్రకటన చేసాడు చిత్రదర్శకుడు. ఇంతకుముందు ఇందులో పాత్రధారి అయిన ప్రముఖ నటుడితో విభేధాల కారణంగా సినిమా చిత్రీకరణ అంతకంతకు ఆలస్యమైంది. చివరికి దర్శకుడే ఇంత పెద్ద ప్రకటన చేయడంతో ఈ భారీ మల్టీస్టారర్ రిలీజవుతుందా? అనే సందిగ్ధతలు నెలకొన్నాయి. లీగల్ వివాదాలు వదిలిపెట్టని హేరాఫేరి 3 గురించే ఈ చర్చ.
బాలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యంత ఆదరణ పొందిన కల్ట్ కామెడీ ఫ్రాంచైజీ `హేరా ఫేరి`. దీని మూడో భాగం `హేరా ఫేరి 3` కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై తాజాగా దర్శకుడు ప్రియదర్శన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాయి. పలు రకాల లీగల్ సమస్యలు, అంతర్గత వివాదాల వల్ల ఈ సినిమా బహుశా ఎప్పటికీ థియేటర్లలోకి రాకపోవచ్చని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్ట్ నుండి తాను పూర్తిగా తప్పుకున్నట్లు ప్రియదర్శన్ స్పష్టం చేయడంతో అసలు ఈ సినిమా భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
దర్శకనిర్మాతల మధ్య తలెత్తే క్రియేటివ్ డిఫరెన్సెస్ ఒక సినిమాను ఎలాంటి డైలమాలోకి నెట్టేస్తాయో చెప్పడానికి ఈ చిత్రమే ఒక ఉదాహరణ. నిర్మాత ఫిరోజ్ నడియాద్వాలా, దర్శకుడు ప్రియదర్శన్ మధ్య భిన్నమైన ప్రకటనలు నడుస్తున్నాయి. వెరైటీ ఇండియా ఇంటర్వ్యూలో నిర్మాత మాట్లాడుతూ... ప్రియదర్శన్ ఈ సినిమాలో భాగం కాకపోయినా సినిమా పనులు సరైన దిశలోనే ట్రాక్‌లో సాగుతున్నాయని పేర్కొన్నారు. కానీ ప్రియదర్శన్ మాత్రం తాను ప్రాజెక్ట్‌లో లేనని కన్ఫర్మ్ చేస్తూనే ఈ సినిమా విడుదలే కాదంటూ భిన్నమైన వెర్షన్ వినిపించారు. బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీకి దర్శకుడే లేకుండా ఇప్పుడు నిర్మాత ఒంటరిగా ఈ సినిమాను ఎలా ముందుకు నడిపిస్తారోననే చర్చ జోరుగా సాగుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కు వివాదాలు, ఆటంకాలు కొత్తేమీ కాదు. మొదట ఈ మల్టీస్టారర్ నుండి సీనియర్ నటుడు పరేష్ రావల్ తప్పుకుంటున్నట్లు ప్రకటించగా... ఆ తర్వాత ఆయనపై కోర్టు కేసు కూడా నడిచింది. ప్రాజెక్ట్ ఆలస్యాల వల్ల.. అలాగే పారితోషికం కారణాలతో ఈ ఫ్రాంచైజీకి అత్యంత కీలకమైన `బాబూరావ్`(పరేష్) పాత్రధారి తప్పుకోవడంతో హేరాఫేరి 3 కి ఆరంభంలోనే పెద్ద పంచ్ పడింది. ఆ తర్వాత వివాదాలు సద్ధుమణిగి ఆయన వెనక్కి వచ్చినా.. అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమా ప్రస్తుతానికి ముందుకు కదలడం లేదని గతంలోనే హింట్ ఇచ్చారు. ఇలా నటీనటుల గందరగోళం సినిమాకు మొదటి నుండి శాపంగా మారింది.
నటీనటుల మార్పుల పరంగా చూస్తే.. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, సంజయ్ దత్, టబు వంటి దిగ్గజ స్టార్లు నటిస్తున్న ఈ సినిమాలో కథానాయికలు మారుతూ వచ్చారు. ప్రస్తుతం గ్లామరస్ బ్యూటీ దిశా పటానీ ఇందులో ఒక కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన `వెల్ కం 3` సినిమాకు దిశా పటానీ గ్లామర్ పెద్ద అస్సెట్ అయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగులు సాధించడానికి దిశా గ్లామర్ కంటెంటే ప్రధాన కారణం. ఇప్పుడు హేరాఫేరి 3 కి కూడా దిశా అదనపు అస్సెట్‌గా మారుతుందని భావించారు. కానీ దర్శకనిర్మాతల గొడవల కారణంగా ఈ క్రేజీ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.
సినిమా నిలిచిపోవడానికి అంతర్గత గొడవలతో పాటు లీగల్ సమస్యలు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. సౌత్‌కు చెందిన `సెవెన్ ఆర్ట్స్ ఇంటర్నేషనల్` అనే ప్రొడక్షన్ హౌస్ ఈ ఫ్రాంచైజీ - క్యారెక్టర్ల రైట్స్ తమవేనని కోర్టుకు వెళ్ళడం ఈ ప్రాజెక్ట్‌ను మరింత చిక్కుల్లో పడేసింది. 2000 సంవత్సరంలో వచ్చిన మొదటి భాగం `హేరా ఫేరి`ని ప్రియదర్శన్ అద్భుతంగా తెరకెక్కించి మైలురాయిగా నిలిపారు. మళ్లీ మూడో భాగానికి ఒరిజినల్ త్రయంతో పాటు ప్రియదర్శన్ వస్తున్నారనే సరికి అంచనాలు పెరిగాయి కానీ.. ప్రస్తుత లీగల్ చిక్కులు.. దర్శకుడి ఎగ్జిట్ చూస్తుంటే రాజు, శ్యామ్, బాబురావ్‌ల కాంబినేషన్‌ను మళ్లీ స్క్రీన్‌పై చూడటం అసాధ్యంగానే కనిపిస్తోంది. హా* బ్యూటీ దిశా పటానీ స్పెషల్ గ్లామర్ ట్రీట్ ని అభిమానులు కోల్పోయినట్టే!
