డైరెక్టర్ - ప్రొడ్యూసర్ మధ్య అగ్లీ ఫైట్.. అంతకంతకూ ముదురుతున్న వివాదం!
బాలీవుడ్ లో అత్యంత ఆదరణ పొందిన క్లాసిక్ కామెడీ ఫ్రాంచైజీ `హేరా ఫేరీ` మూడో భాగంపై గత కొంతకాలంగా వివాదాలు రాజుకుంటున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 4 July 2026 7:05 AM ISTబాలీవుడ్ లో అత్యంత ఆదరణ పొందిన క్లాసిక్ కామెడీ ఫ్రాంచైజీ `హేరా ఫేరీ` మూడో భాగంపై గత కొంతకాలంగా వివాదాలు రాజుకుంటున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సులువుగా 100 కోట్లు వసూలు చేయగల సత్తా ఉన్న ఈ సీక్వెల్ ప్రాజెక్ట్‌కు దర్శకుడు, నిర్మాత మధ్య జరుగుతున్న అంతర్గత పోరు పెద్ద ముప్పుగా మారింది. దర్శకుడు ప్రియదర్శన్, నిర్మాత ఫిరోజ్ నాడియాడ్‌వాలా ఒకరిపై ఒకరు హద్దులు దాటి విమర్శలు చేసుకుంటూ.. అవమానించుకుంటూ అగ్లీగా గొడవ పడుతున్నారు. ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీని వీరిద్దరి కోల్డ్ వార్ గొంతు నులిమి చంపేస్తోందంటూ సినీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
గత కొద్దిరోజులుగా దర్శకుడు ప్రియదర్శన్ నిర్మాత ఫిరోజ్ నాడియాడ్‌వాలాపై సంచలన ఆరోపణలు చేస్తూ ఇండస్ట్రీలో బాంబు పేల్చారు. తనను పదే పదే అవమానించడం, అలాగే సినిమాను చుట్టుముట్టిన చట్టపరమైన వివాదాల కారణంగా ఈ చిత్రం భవిష్యత్తులో ఎప్పటికీ థియేటర్లలోకి రాకపోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అసలు ఈ ఫ్రాంచైజీ కథ ముగిసిపోయిందంటూ ప్రియదర్శన్ వ్యాఖ్యానిస్తూ.. ``నా ఉద్దేశం ప్రకారం.. హేరా ఫేరీ పుట్టింది.. హేరా ఫేరీ 2 జబ్బు పడింది.. ఇక హేరా ఫేరీ 3 పూర్తిగా చచ్చిపోయింది. ఈ పాత పాత్రలను ప్రేక్షకులు మళ్లీ స్క్రీన్‌పై ఎప్పటికీ చూడలేరు`` అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ మాట్లాడుతూ.. నిర్మాత తన విషయంలో ప్రదర్శించిన వివక్షను బయటపెట్టారు. గతంలో నిర్మాత ఫిరోజ్ నాడియాడ్‌వాలా హీరో అక్షయ్ కుమార్‌తో మాట్లాడుతూ.. ``నీకు హేరా ఫేరీ 3 తీసే హక్కులు ఉన్నాయి.. కానీ ఆ సినిమాను మాత్రం ప్రియదర్శన్‌తో తీయకు..నా ఏకైక అభ్యర్థన ఇదే`` అని చెప్పినట్లు ప్రియదర్శన్ వెల్లడించారు. అంతేకాకుండా 2000 సంవత్సరంలో వచ్చిన మొదటి భాగం `హేరా ఫేరీ’ కేవలం తన ఎడిటింగ్ వల్లే హిట్టయిందని... ప్రియదర్శన్ తీసిన ఒరిజినల్ కట్ ఒక పేదవాడి సినిమా లాగా ఉందంటూ ఫిరోజ్ తనను గతంలో చాలాసార్లు అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానికి ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రావడానికి హీరోలందరూ ఎంతో ఆసక్తి చూపించారని ప్రియదర్శన్ పేర్కొన్నారు. స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ ల కోరిక మేరకే తాను మూడో భాగానికి అద్భుతమైన కథను సిద్ధం చేశానని... వారు కూడా కథ విని ఎంతో ఎగ్జైట్ అయ్యారని తెలిపారు. అయితే సినిమాను ముందుకు తీసుకెళ్లడంలో హీరోలు ఆసక్తి చూపించినా.. కేవలం నిర్మాత ప్రవర్తన .. వ్యక్తిగత అహంకారాల వల్లే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలతో పాటు.. ఈ సినిమాకు భారీ లీగల్ సమస్యలు కూడా ఉన్నట్లు ప్రియదర్శన్ బాహాటంగా చెప్పారు. 2025లో సెవెన్ ఆర్ట్స్ ఫిల్మ్స్ అధినేత జీపీ విజయ్ కుమార్ తనకు స్వయంగా ఫోన్ చేసి.. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తే కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కింద తీవ్రమైన కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపారు. ఇలా అటు లీగల్ సమస్యలు, ఇటు ఈగోల గొడవలతో ఈ క్రేజీ సీక్వెల్ దాదాపు అటకెక్కినట్లేనని తేలిపోవడంతో బాబు రావ్, రాజు, శ్యామ్ ల కాంబినేషన్‌ను మళ్ళీ థియేటర్లలో చూడాలనుకున్న సగటు సినిమా అభిమానికి తీవ్ర నిరాశే మిగిలింది.
