ఇంకా తండ్రి జ్ఞాపకాల్లోనే కుమార్తెలు!
ఈ విషయమై ప్రముఖ నటి, ధర్మేంద్ర సతీమణి హేమామాలిని ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
By: Srikanth Kontham | 21 July 2026 11:43 AM ISTబాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజ నటుడు ధర్మేంద్ర కుటుంబానికి సంబంధించి తాజాగా వెలువడిన వార్తలు సినీ వర్గాలను.. అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన మహానటుడి వ్యక్తిగత జీవితం ఆయన కుటుంబ సభ్యులపై చూపిన ప్రభావం ఎంతగా ఉందో? ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ధర్మేంద్ర కుమార్తెలు ఈషా డియోల్, అహానా డియోల్ తండ్రిని కోల్పోయిన భావన నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేకపోతున్నారనే విషయం ఆలోచింపజేస్తోంది.
ఈ విషయమై ప్రముఖ నటి, ధర్మేంద్ర సతీమణి హేమామాలిని ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తమ కుటుంబం ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను పంచుకున్నారు. ఒక తండ్రిగా ధర్మేంద్ర కుటుంబానికి అందించిన తోడ్పాటు, ఇచ్చిన భరోసా ఎంతో వెలకట్టలేనిదన్నారు. ఆయన లేని లోటును పూడ్చడం మాటలతో సాధ్యం కాదని, ఆ శూన్యతను భరించడం పిల్లలకు ఎంతో కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీ హోదా ఉన్నప్పటికీ సాధారణ కుటుంబం వలే అనుబంధాల చుట్టూ తిరిగే వారి మానసిక స్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
తండ్రితో ఉన్న అనుబంధం అంటే ఇంట్లోని పెద్ద దిక్కును కోల్పోవడం మాత్రమే కాదు. అది వ్యక్తిగత ఎదుగుదలలో కీలకమైన మార్గదర్శకత్వాన్ని కోల్పోవడంతో సమానం. ఈషా డియోల్, అహానా డియోల్ తమ రంగాలలో నిలదొక్కుకున్నప్పటికీ కుటుంబ పరంగా తండ్రి నుంచి లభించే భరోసా ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ధర్మేంద్ర ఉనికి తమకు అందించిన మానసిక ధైర్యం మరెక్కడా దొరకదని ప్రస్తుతం ఆ జ్ఞాపకాలతోనే రోజువారీ జీవితాన్ని నెట్టుకొస్తున్నారని హేమామాలిని చెప్పుకొచ్చారు.
సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖుల జీవితాల్లో కూడా ఇలాంటి సున్నితమైన భావోద్వేగాలు, అంతర్గత వేదనలు ఉంటాయనేది ఈ ఉదంతంతో మరోసారి రుజువవుతోంది. వెండితెరపై నవ్వులు పంచే నటుల వెనుక ఎన్నో వ్యక్తిగత కష్టాలు, కుటుంబ బాధ్యతలు, బరువైన జ్ఞాపకాలు ఉంటాయి. ధర్మేంద్ర లాంటి మహానటుడి నీడలో పెరిగిన పిల్లలకు ఆయన లేని లోటును జీర్ణించుకోవడం సులభమైన విషయం కాదు.
కానీ కాలం మాత్రం ఎలాంటి గాయాన్ని అయినా? మాన్పించగలదు అన్నది అంతే వాస్తవం.
కుటుంబ బంధాల విలువ ఎలాంటి పరిస్థితులలోనైనా చెక్కుచెదరకుండా ఉంటుందని ఈ సంఘటన నిరూపిస్తోంది. ఓ వైపు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి శ్రమిస్తూనే.. మరోవైపు కుటుంబంలోని శూన్యతను భరించడం ఈషా, అహానాలకు పరీక్షా సమయమే. హేమామాలిని కుటుంబం పంచుకున్న ఈ అనుభవాలు ఒక సెలబ్రిటీ కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు. ప్రతి కుటుంబంలోనూ తండ్రి పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో? చాటిచెబుతున్నాయి.
జీవితంలో ఎన్ని విజయాలున్నా? కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఆప్యాయతలు, అనురాగాలే అసలైన సంపద అని ఈ ఉదంతం బోధిస్తుంది. ధర్మేంద్ర జ్ఞాపకాలతో ముందుకు సాగుతున్న ఈషా , అహానాలు భావోద్వేగ సవాల్‌ను ఎదుర్కొని మరింత మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
