ఏడాది గడిచినా తగ్గని దుఖం!
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర తొలి వర్ధంతి సందర్భంగా భార్య హేమమాలిని భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ధర్మేంద్రతో కలిసి దిగిన అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ, ఏడాది గడిచినా ఆయనను కోల్పోయిన బాధ తగ్గలేదని తెలిపారు. భర్త తనకు మంచి స్నేహితుడు, మార్గదర్శి, సర్వస్వమని పేర్కొన్నారు. తన జీవితంలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.
By: Srikanth Kontham | 24 Nov 2026 6:18 PM ISTకాలం ఎంత వేగంగా గడిచిపోయినా? ఆత్మీయులను కోల్పోయిన బాధ మాత్రం మనసును వీడదు. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూసి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఆయన తొలి వర్ధంతి సందర్భంగా సతీమణి.. నటి హేమమాలిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ సందేశం అభిమానుల కళ్లు చెమర్చేలా చేస్తోంది. ధర్మేం ద్రతో కలిసి ఉన్న కొన్ని అరుదైన ఇప్పటివరకు బయటకు రాని ఫోటోలను షేర్ చేస్తూ మనసులో ఆవేదనను అక్షరరూపంలో వెల్లడించారు. సంవత్సరం గడిచిపోయినా దుఃఖం తీవ్రత ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు.
ధర్మేంద్ర భర్త మాత్రమే కాదని తన సర్వస్వమని చెప్పుకొచ్చారు. మంచి స్నేహితుడిగా.. మార్గదర్శిగా, వెన్నెముకలా నిలిచిన వ్యక్తిని కోల్పోవడం తన జీవితంలో పూడ్చలేని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన లేకుండా జీవితం ఎంతో శూన్యంగా అనిపిస్తోందని రాశారు. ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నా? ఏమాత్రం గర్వం లేకుండా మూలాలను మర్చిపోకుండా అందరిపైనా ప్రేమను పంచిన గొప్ప మనిషి ధర్మేంద్ర అని కొనియాడారు. ఆత్మకు మరణం లేదని.. మళ్లీ జన్మ ఉంటుందని భగవద్గీత చెబుతున్నా.. ఈ జన్మలో ఆయన ఆత్మీయ సాన్నిధ్యాన్ని కోల్పోయిన బాధను తట్టుకోలేకపోతున్నానని ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా ధర్మేంద్రను గుర్తు చేసుకుంటూ ప్రేమను కురిపిస్తున్న కోట్లాది మంది అభిమానులకు హేమమాలిని కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఎలాంటి వ్యక్తి అనేది అభిమానుల జీవితాల్లో ఆయనకెంత ప్రత్యేక స్థానం ఉందో తెలియజేస్తూ వస్తున్న సందేశాలు ఎంతో ఊరటనిస్తున్నాయని పేర్కొన్నారు. 1970లో `తుమ్ హసీన్ మై జవాన్` సెట్స్‌లో తొలిసారి కలుసుకున్న ధర్మేంద్ర -హేమమాలిని.. ఆ తర్వాత `షోలే`, `సీతా ఔర్ గీతా`, `డ్రీమ్ గర్ల్` వంటి ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. తెరపై కెమిస్ట్రీ కాస్తా ప్రేమగా మారి 1980లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఈషా, అహానా డియోల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ధర్మేంద్ర తొలి వర్ధంతి సందర్భంగా సన్నీ డియోల్, బాబీ డియోల్‌లతో పాటు కుటుంబ సభ్యులు, బాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు. ఆరు దశాబ్దాలకు పైగా సహజ నటనతో ..హీ-మ్యాన్ ఇమేజ్‌తో భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ధర్మేంద్ర భౌతికంగా దూరమైనా సినిమాల ద్వారా.. మధుర జ్ఞాపకాల ద్వారా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే నిలిచి ఉంటారు.
