Begin typing your search above and press return to search.

హేమ‌మాలిని కూతుళ్ల‌ను దూరం పెట్టిన డియోల్ ఫ్యామిలీ?

బంధాలు అనుబంధాలు ఈరోజుల్లో పెద్ద చ‌ర్చ‌! డ‌బ్బు కోసం ఆడే ఆట‌లో బంధాలు తెర‌మ‌రుగ‌య్యాయి.

By:  Sivaji Kontham   |   18 Dec 2025 7:06 PM IST
హేమ‌మాలిని కూతుళ్ల‌ను దూరం పెట్టిన డియోల్ ఫ్యామిలీ?
X

బంధాలు అనుబంధాలు ఈరోజుల్లో పెద్ద చ‌ర్చ‌! డ‌బ్బు కోసం ఆడే ఆట‌లో బంధాలు తెర‌మ‌రుగ‌య్యాయి. ఒకే కుటుంబంలో ఆస్తుల కోసం అన్న‌ద‌మ్ములు, అక్క‌చెల్లెళ్లు, త‌ల్లితండ్రులు- వార‌సుల మ‌ధ్య గొడ‌వ‌లు చూస్తున్నాం. ఇటీవ‌ల 30వేల కోట్ల సంస్థానానికి అధిప‌తి అయిన న‌టుడు, నిర్మాత సంజ‌య్ క‌పూర్ అక‌స్మాత్తుగా మ‌ర‌ణించాక ఆస్తుల కోసం అత‌డి ప్ర‌స్తుత భార్య‌తో మాజీ భార్య పిల్ల‌లు పోరాటం సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో అత్తా కోడ‌ళ్ల మ‌ధ్య కూడా ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది.

బాలీవుడ్ వెట‌ర‌న్ హీరో, లెజెండ‌రీ స్టార్ ధ‌ర్మేంద్ర మ‌ర‌ణం త‌ర్వాత కూడా ప్ర‌ముఖ జాతీయ మీడియాలో అత‌డి ఇద్ద‌రు భార్య‌ల పిల్ల‌ల మ‌ధ్య వైరుధ్యాల గురించిన‌ క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ధ‌ర్మేంద్ర మ‌ర‌ణించిన త‌ర్వాత హేమ‌మాలిని, ఆమె పిల్ల‌ల‌ను డియోల్ కుటుంబం పూర్తిగా వ‌దిలేసింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. స‌న్నీడియోల్, బాబిడియోల్, వారి కుటుంబీకులు ధ‌ర్మేంద్ర‌-హేమ‌మాలిని జంట కుమార్తెలు అయిన ఇషాడియోల్, అహ‌నా డియోల్ ల‌ను ప‌ట్టించుకోలేదు. క‌నీసం ధర్మేంద్ర సంతాప స‌భ‌ల‌లో కూడా ఇరు కుటుంబాలు క‌లుసుకోక‌పోవ‌డం చాలా సందేహాలకు తావిచ్చింది. అదే స‌మ‌యంలో ధ‌ర్మేంద్ర‌కు ఉన్న 400 కోట్ల ఆస్తుల కోసం స‌వ‌తి బిడ్డ‌లైన‌ అన్నా చెల్లెళ్ల మ‌ధ్య బిగ్ ఫైట్ కొన‌సాగుతుంద‌ని కూడా కొన్ని క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

తండ్రి వార‌స‌త్వ ఆస్తి కోసం కుమార్తెలు ఇషాడియోల్, అహ‌నా డియోల్ త‌మ సవ‌తి సోద‌రులు అయిన స‌న్నీడియోల్, బాబి డియోల్ తో పోరాడుతార‌ని చ‌ర్చ సాగింది. అయితే హేమ‌మాలిని, ఆమె కుమార్తెలు ఇప్ప‌టివ‌ర‌కూ చాలా హుంద‌గా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతానికి సంతాప స‌భ‌ల‌తో స‌రిపుచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆస్తి త‌గాదాలేవీ లేక‌పోవ‌డంతో అంతా స్త‌బ్ధుగా, సైలెంట్ గా ఉంది. ఇది నిజానికి తుఫాన్ రాబోయే ముందు నిశ్శ‌బ్ధ‌మా? లేక దీనిని ఇంత‌టితో విడిచిపెట్టేద్దామ‌నే ఆలోచ‌నా? అన్న‌ది చూడాల్సి ఉంది.

ఈ ఏడాది నవంబర్ 24న ధర్మేంద్ర మరణంతో హిందీ చిత్ర పరిశ్రమ కోలుకోలేని దెబ్బ తింది. ఇండ‌స్ట్రీ ఒక గొప్ప న‌టుడిని కోల్పోయింది. సీనియర్ స్టార్ తన 90వ పుట్టినరోజుకు కొన్ని వారాల ముందు 89 ఏళ్ల వయస్సులో ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మూడు రోజుల అనంత‌రం నవంబర్ 27న ధ‌ర్మేంద్ర‌ కుమారులు సన్నీ డియోల్ -బాబీ డియోల్ ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో త‌మ తండ్రి సంస్మ‌ర‌ణ‌ కోసం ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించారు. ఈ ప్రార్థనా సమావేశానికి హాజరుకాని ధర్మేంద్ర భార్య హేమా మాలిని, అదే రోజు తన ఇంట్లో గీతా పారాయణం నిర్వహించారు. డిసెంబర్ 11న హేమ తన కుమార్తెలు ఇషా డియోల్ , అహానా డియోల్‌తో కలిసి ఢిల్లీలో ఒక ప్రత్యేక ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ నవలా రచయిత్రి, కాలమిస్ట్ శోభా డే ధ‌ర్మేంద్ర‌తో హేమ మాలిని స‌మీక‌ర‌ణం గురించి ప్ర‌స్థావించారు. ధర్మేంద్ర భార్య ప్రకాష్ కౌర్‌తో ఉన్న మొదటి కుటుంబం, ఆయన మరణానంతరం హేమను దూరం పెట్టిందని ఆరోపించారు.

ఇది క‌ష్ట‌త‌ర‌మైన‌, బాధాకరమైన నిర్ణయమై ఉంటుంది... ఆమె(హేమ మాలిని) తన జీవితంలో 45 సంవత్సరాలు ఆయ‌న‌తో గ‌డిపింది. అయినా ఆ కుటుంబం ఆమెను దూరం పెట్టింద‌ని శోభా డే విచారం వ్య‌క్తం చేసారు. ధ‌ర్మేంద్ర‌తో వివాహం కార‌ణంగా హేమ‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. అయినా మొద‌టి కుటుంబం దూరం పెట్టింది. ఈ బాధ‌ను త‌న‌లోనే దాచుకున్నారు కానీ ఎక్క‌డా బ‌రస్ట్ అవుట్ అవ్వ‌లేదు. ఆ బాధనంతా తన వ్యక్తిగత గోప్యత కోసమే దాచుకున్నారు. ఆమె దానిని ఎలా ఎదుర్కోవాలనుకుంటే అలా ఎదుర్కొన్నారు. ఆమె ఒక బహిరంగ కార్యక్రమాన్ని అత్యంత గౌరవప్రదంగా నిర్వహించారని భావిస్తున్నాను. కేవలం తన కోసమే కాదు.. తాను కోల్పోయిన వ్యక్తి కోసం కూడా..`` అని అన్నారు.

హేమ స్వయంగా ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న స్త్రీ. ఆధిపత్యం ప్రదర్శించడం కంటే గౌరవానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె నిర్ణయించుకోవడం త‌న‌ వ్యక్తిత్వం గురించి చాలా చెబుతుందని భావిస్తున్నాను. ధరం జీ మరణించిన వెంటనే ఆ భావోద్వేగ క్షణాలను .. ఆమె కన్నీటి చుక్కలను, ఆమె ప్రతి నిట్టూర్పును కవర్ చేయడానికి మీడియా ఇష్టపడి ఉండేది. ఆమె వ్య‌క్తిగ‌త విష‌యాల‌లోకి చొరబడి.. చాలా ముఖ్యమైన ఆ గౌరవాన్ని పూర్తిగా దూరం చేసి ఉండేది.. అని శోభా డే అభిప్రాయ‌ప‌డ్డారు.

హేమా మాలిని మధుర నుండి పార్లమెంట్ సభ్యురాలు. తన భర్త మరణానంత‌రం ఏదైనా భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించాలని హేమ సూచించి ఉంటే, అధికార పార్టీ బహుశా అన్ని విధాలా సహకరించి ఉండేదని శోభా వ్యాఖ్యానించారు. ధరం జీకి రెండు సమాంతర కుటుంబాలు ఉన్నాయని.. ఒకటి ప్రాథమిక కుటుంబం, మరొకటి హేమ .. కానీ భార్యాభర్తలుగా వారిద్దరూ ఏ దశలోనూ ఒకరికొకరు దూరం కాలేదని లేదా ఒకరినొకరు కాదనలేదని శోభా పేర్కొన్నారు. హేమ సరైన ఎంపిక చేసుకుందని చెబుతూ ఆమె తన మాటలను ముగించారు.

1980లో హేమా మాలిని- ధర్మేంద్ర పెళ్లాడారు.. కానీ ధర్మేంద్ర అప్పటికే ప్రకాష్ కౌర్‌ను పెళ్లి చేసుకుని 26 సంవత్సరాలు అయింది.