ధర్మేంద్ర మరణంపై ప్రియురాలు కన్నీటి లేఖ!
లెజెండరీ నటుడు ధర్మేంద్ర మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది.
By: M Prashanth | 27 Nov 2025 12:49 PM ISTలెజెండరీ నటుడు ధర్మేంద్ర మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన ఇక లేరు అనే నిజాన్ని జీర్ణించుకోవడం కష్టమే. ముఖ్యంగా ఆయన సతీమణి, నటి హేమమాలిని గారికి ఈ బాధ వర్ణనాతీతం. ఇన్నాళ్లు మౌనంగా ఆ వేదనను అనుభవిస్తున్న ఆమె, తాజాగా సోషల్ మీడియా వేదికగా తన భర్తను తలుచుకుంటూ మొదటిసారి స్పందించారు.
వెండితెరపై ఎవర్ గ్రీన్ జంటగా పేరు తెచ్చుకున్న ధర్మేంద్ర, హేమమాలిని నిజ జీవితంలోనూ అంతే అన్యోన్యంగా గడిపారు. నవంబర్ 24న ఆయన తుదిశ్వాస విడిచినప్పటి నుంచి ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ మౌనాన్ని వీడుతూ, ట్విట్టర్ వేదికగా ఆమె రాసిన ఎమోషనల్ లేఖ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అందులో ఉన్న ప్రతి మాటా ఆమె ఆవేదనకు అద్దం పడుతోంది.
హేమమాలిని తన పోస్ట్ లో స్పందిస్తూ.. "ధరమ్ జీ నాకు కేవలం భర్త మాత్రమే కాదు, నా ఇద్దరు బిడ్డలకు ప్రేమను పంచిన తండ్రి. అంతకుమించి నాకు ఒక స్నేహితుడు, ఫిలాసఫర్, గైడ్, కవి. కష్టసుఖాల్లో నాకు ఎప్పుడూ తోడుగా నిలిచిన నా సర్వస్వం ఆయనే" అంటూ హృదయవిదారకంగా రాసుకొచ్చారు. మంచిలోనూ, చెడులోనూ ఆయన ఎప్పుడూ తన వెన్నంటే ఉన్నారని గుర్తు చేసుకున్నారు.
ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా, వ్యక్తిగతంగా చాలా సాధారణంగా ఉండేవారని, ఆ మంచితనమే ఆయన్ను అందరికీ దగ్గర చేసిందని హేమమాలిని కొనియాడారు. ఆయన టాలెంట్, వినయం ఆయన్ను ఒక ఐకాన్ గా నిలబెట్టాయని అన్నారు. ఆయన సాధించిన విజయాలు, ఆ కీర్తి ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయని ఆమె పేర్కొన్నారు.
ఇప్పుడు ఆయన లేని లోటును మాటల్లో చెప్పలేనని, ఆ శూన్యం తన జీవితాంతం అలాగే ఉండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల బంధం తర్వాత, ఇప్పుడు కేవలం జ్ఞాపకాలను మాత్రమే పట్టుకుని బతకాల్సి రావడం దురదృష్టకరమని వాపోయారు. ఈ నోట్ తో పాటు, ధర్మేంద్రతో కలిసి ఉన్న కొన్ని మధుర జ్ఞాపకాల ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు.
డిసెంబర్ 8న ఆయన 90వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా, అంతలోనే ఇలా జరగడం నిజంగా విధి విచిత్రం. పవన్ హన్స్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ధర్మేంద్ర భౌతికంగా దూరమైనా, ఆయన జ్ఞాపకాలు తనతోనే ఉంటాయని హేమమాలిని అన్నారు. ఈ కష్టకాలంలో ఆమె ధైర్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
