Begin typing your search above and press return to search.

కాస్మొటిక్ సర్జరీలపై డ్రీమ్ గర్ల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో డ్రీమ్ గర్ల్ గా దశాబ్దాల పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన నటి హేమా మాలిని.

By:  Srikanth Kontham   |   2 Sept 2026 7:00 PM IST
కాస్మొటిక్ సర్జరీలపై డ్రీమ్ గర్ల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు?
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో డ్రీమ్ గర్ల్ గా దశాబ్దాల పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన నటి హేమా మాలిని. ఈ సీనియ‌ర్ బ్యూటీ సదా నిత్యనూతన సౌందర్యంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా హేమా మాలిని గ్లామర్ రంగంలో వయసు పెరుగుతున్న కొద్దీ అందాన్ని కాపాడుకునేందుకు నటీనటులపై ఉండే ఒత్తిళ్లు , కాస్మొటిక్ ప్రాసెస్ పై స్పందించారు. వయసుతో పాటు వచ్చే మార్పులను సహజంగా స్వీకరిస్తూనే రూపాన్ని కాపాడుకోవడానికి నిజంగా అవసరమైతే కాస్మొటిక్ ట్రీట్మెంట్స్ తీసుకోవడంలో తప్పులేదని అభి ప్రాయపడ్డారు.

వయసు పెరుగుతున్న కొద్దీ అందంగా వృద్ధాప్యం వైపు వెళ్లడం ఎంతో ముఖ్యం. అలాగే మనల్ని మనం ఆకర్షణీయంగా ఉంచుకోవడం కూడా అంతే అవసరం. మన బాహ్య రూపాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏదైనా నిజంగా అవసరం అనిపిస్తే కచ్చితంగా అలాంటి కాస్మొటిక్ పద్ధతులను ప్రయత్నించవచ్చు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సౌందర్య వైద్య విధానాలపై హేమ‌ సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

సినీ రంగంలో నటీనటులపై ఎల్లప్పుడూ యంగ్‌గా, కాంతివంతంగా కనిపించాలనే పరిశ్రమ ఒత్తిడి నిరంతరం ఉంటుందని అంగీకరించారు. అయితే కేవలం సర్జరీలు లేదా కాస్మొటిక్ ట్రీట్మెంట్స్ మాత్రమే మనిషికి శాశ్వత అందాన్ని ఇవ్వలేవని క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో మాత్రమే అది సాధ్యమవుతుందని హేమా మాలిని స్పష్టం చేశారు. బాహ్య సౌందర్యానికి సాంకేతికత తోడైనప్పటికీ దానికి పునాది మాత్రం శరీర ఆరోగ్యం , మానసిక ప్రశాంతత అవ‌స‌రమ‌ని గుర్తు చేశారు.

తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో నిత్యనూతనంగా కనిపించడానికి పాటించే రహస్యాలను కూడా ఈ సందర్భంగా రివీల్ చేసారు. రోజూ క్రమం తప్పకుండా చేసే క్లాసికల్ డాన్స్, యోగా, సమతుల్యమైన పూర్తి శాకాహార ఆహార నియమాలు తన ఆరోగ్యాన్ని, గ్లోను కాపాడుతున్నాయని వెల్లడించారు. రోజూ తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడమే చర్మ సౌందర్యానికి అసలైన రహస్యమని వివరించారు.

కేవలం బాహ్య సంరక్షణే కాకుండా అంతర్గత ఆలోచనా ధోరణి కూడా మనిషి రూపాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని హేమా మాలిని పేర్కొన్నారు. `మనసులో ప్రతికూల ఆలోచనలను తొలగించి సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకున్నప్పుడే ఆనందం , కాంతి ముఖంలో ప్రతిబింబిస్తాయి. ఆ ఇన్నర్ పీస్ అనేది ఏ కాస్మొటిక్ ట్రీట్‌మెంట్ ఇవ్వలేదని అభిప్రాయ‌ప‌డ్డారు.

మొత్తానికి కాస్మొటిక్ ప్రొసీజర్లపై అపోహలు ఉన్న సమాజంలో హేమా మాలిని చేసిన చేసిన‌ వ్యాఖ్యలు ట్రెండింగ్‌గా మారాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రాసెస్లను సమర్థిస్తూనే సహజ సిద్ధమైన ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాధాన్యతను గుర్తు చేసిన ఆమె వ్యాఖ్యలను అభిమానులు -సౌందర్య నిపుణులు స్వాగతిస్తున్నారు.