Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసుపై నటి హేమ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

దాదాపు రెండేళ్ల క్రితం బెంగళూరులో జరిగిన డ్రగ్స్ పార్టీ వివాదం అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

By:  M Prashanth   |   19 March 2026 9:01 AM IST
డ్రగ్స్ కేసుపై నటి హేమ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
X

దాదాపు రెండేళ్ల క్రితం బెంగళూరులో జరిగిన డ్రగ్స్ పార్టీ వివాదం అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ కేసులో పలువురు తెలుగు వ్యక్తుల పేర్లు బయటకు రావడంతో పాటు సీనియర్ నటి హేమ పేరు వినిపించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అనంతరం కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆ వివాదం కొంతకాలానికి సద్దుమణిగింది. తాజాగా మళ్లీ డ్రగ్స్ కేసులు వెలుగులోకి వస్తున్న వేళ, హేమ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ లోని ఓ ఫామ్ హౌస్‌ పై తెలంగాణ ఈగల్ టీమ్, పోలీసులు దాడులు నిర్వహించగా డ్రగ్స్ పార్టీ వ్యవహారం బయటపడింది. ఆ కేసులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన కొందరు రాజకీయ నేతల పేర్లు వినిపించడం సంచలనం సృష్టించింది. ఆ పరిణామాల నేపథ్యంలో గత బెంగళూరు డ్రగ్స్ కేసును ప్రస్తావిస్తూ హేమ తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

బెంగళూరు డ్రగ్స్ కేసులో తాను నిర్దోషినని కోర్టు తేల్చినప్పటికీ, ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు మరచిపోలేనివని హేమ పేర్కొన్నారు. తాను ఒక సెలబ్రిటీ కావడం వల్ల తనపై తీవ్ర దుష్ప్రచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను పదేపదే ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థలు, తాను క్లీన్ చిట్ పొందిన విషయాన్ని మాత్రం చూపించలేదని విమర్శించారు.

2024 మే 19న బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్ హౌస్‌ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు మే 20 తెల్లవారుజామున దాడులు చేపట్టారు. ఆ సందర్భంగా మొత్తం 88 మందిపై కేసులు నమోదు చేయగా, అందులో 9 మంది నిర్వాహకులు ఉన్నారు. హేమతో పాటు 79 మంది డ్రగ్స్ వినియోగించారన్న ఆరోపణలతో పోలీసులు కోర్టులో 1000కు పైగా పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

అయితే తాను ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదని హేమ అప్పట్లోనే చెప్పారు. అయినప్పటికీ తనపై వచ్చిన విమర్శలు, ఆరోపణలు ఆగలేదని తెలిపారు. చివరకు 2025 జనవరి 2న బెంగళూరు కోర్టు ఆమె వాదనలు పరిశీలించి, డ్రగ్స్ వినియోగించలేదని తేల్చి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో తనకు న్యాయం జరిగిందని హేమ అన్నారు. ఆరు నెలల పాటు తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, ఎన్నిసార్లో తప్పు లేదని చెప్పినా ఎవరూ నమ్మలేదని గుర్తు చేసుకున్నారు.

కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే నిజం బయటపడిందని, ఆ తర్వాత వీడియో ద్వారా తనపై ఉన్న ఆరోపణలు తప్పని వెల్లడించినట్లు చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో అరెస్టయితేనే దోషులని భావించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. జైలుకు వెళ్లినంత మాత్రాన నేరం చేసినట్టు అనుకోవడం తగదన్నారు. అంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఆరోపణలతో పాటు నిజాలు కూడా సమానంగా ప్రజలకు తెలియజేయాలని ఆమె సూచించారు. ప్రస్తుతం మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో మరోసారి ఆ అంశం చర్చకు రావడంతో, తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేస్తూ హేమ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.