Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ న‌టి నివాసంలో విలువైన వస్తువుల మాయం?

ఈ అత్యవసర పిటిషన్ దాఖలు చేయడానికి బలమైన కారణాలను క్లిచ్‌కో న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

By:  Srikanth Kontham   |   29 Sept 2026 2:00 PM IST
ప్ర‌ముఖ న‌టి నివాసంలో విలువైన వస్తువుల మాయం?
X

హాలీవుడ్ నటి హేడెన్ పానెటియర్ ఇటీవల అకస్మాత్తుగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. హేడెన్ మరణం తర్వాత తన 11 ఏళ్ల కుమార్తె కయా భవిష్యత్తు, ఆస్తిపాస్తుల సంరక్షణ కోసం ఆమె మాజీ భ‌ర్త‌, మాజీ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ వ్లాదిమిర్ క్లిచ్‌కో కోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెకు దక్కాల్సిన వారసత్వ ఆస్తులకు రక్షణగా ఉండేందుకు తాత్కాలిక గార్డియన్‌గా వ్యవహరించే అనుమతిని ఇవ్వాలని అభ్యర్థిస్తూ లాస్ ఏంజెల్స్ కౌంటీ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.

`హీరోస్`, `నాష్‌విల్లే` వంటి ప్రజాదరణ పొందిన టీవీ సిరీస్‌లతో గుర్తింపు పొందిన హేడెన్ పానెటియర్ గత ఆగస్టు 16న సౌత్ కరోలినాలో తన 36వ ఏట ప్రాణాలు కోల్పోయారు. అకస్మాత్తుగా డ్రగ్స్ ఓవర్‌డోస్ కావడం వల్లే ఆమె మరణించినట్లు కరోనర్ నివేదికలో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో హేడెన్ చట్టబద్ధమైన ఏకైక వారసురాలిగా ఉన్న చిన్నారి కయాకు దక్కాల్సిన ఆస్తుల భద్రత అత్యంత కీలకమైన అంశంగా మారింది.

ఈ అత్యవసర పిటిషన్ దాఖలు చేయడానికి బలమైన కారణాలను క్లిచ్‌కో న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హేడెన్ మరణంపై ఫెడరల్ అధికారులు దర్యాప్తు జరుపుతుండటంతో ఆమెకు సంబంధించిన అనేక విలువైన వస్తువులను సీజ్ చేశారు. అలాగే లాస్ ఏంజెల్స్‌లోని హేడెన్ నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తులు అనధికారికంగా ప్రవేశించడం, కొన్ని విలువైన వస్తువులు మాయం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన ప్రతినిధి లేకపోతే ఆమె ఎస్టేట్ ఆస్తులు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

పాప భవిష్యత్తు కోసం ఆస్తులను కాపాడటమే ఏకైక ఉద్దేశమని క్లిచ్‌కో స్పష్టం చేశారు. పర్సనల్ రిప్రజెంటేటివ్‌ను శాశ్వతంగా నియమించే వరకు, చిన్నారి ఆస్తులకు తాత్కాలిక రక్షకుడిగా తనకు బాధ్యతలు అప్పగించాలని కోరారు. దాఖలైన పిటిషన్‌పై అక్టోబర్ 8న కోర్టులో విచారణ జరగనుంది. న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా ఆస్తుల నిర్వహణపై పూర్తి స్పష్టత రానుంది.

చిన్నారి కయా రెండేళ్ల వయసు నుంచే తండ్రి క్లిచ్‌కో వద్ద ఉక్రెయిన్‌లో పెరుగుతోంది. ప్రసవానంతర డిప్రెషన్, వ్యసనం వంటి సమస్యలతో పోరాడిన హేడెన్, కుమార్తె సంరక్షణ బాధ్యతలను క్లిచ్‌కోకే అప్పగించారు. మరణించే కొన్ని రోజుల ముందు కూడా హేడెన్ కుమార్తెను చూడటానికి ఉక్రెయిన్ వెళ్లాలని ప్రణాళిక చేసుకున్నట్లు తండ్రి విచారణ అధికారులకు వెల్లడించారు.

ఉక్రెయిన్‌కు చెందిన 50 ఏళ్ల వ్లాదిమిర్ క్లిచ్‌కో ఒలింపిక్ స్వర్ణపతక విజేత, సుదీర్ఘకాలం హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. ఆయన సోదరుడు విటాలీ ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తల్లి మరణంతో నిరాధారణకు గురైన కుమార్తె కయా హక్కులను, ఆర్థిక భద్రతను కాపాడేందుకు క్లిచ్‌కో చట్టపరంగా చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి.