Begin typing your search above and press return to search.

36 ఏళ్ల‌కే న‌టి దుర్మ‌ర‌ణం.. పోలీసులు చెప్పిన‌ షాకింగ్ కార‌ణం!

ఇదే కోవలో హాలీవుడ్ అందాల తార, గ్లామర్ ఐకాన్ మార్లిన్ మన్రో 1962లో నిద్రమాత్రలు మోతాదు మించి తీసుకోవడం వల్ల అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.

By:  Sivaji Kontham   |   23 Sept 2026 10:22 AM IST
36 ఏళ్ల‌కే న‌టి దుర్మ‌ర‌ణం.. పోలీసులు చెప్పిన‌ షాకింగ్ కార‌ణం!
X

హాలీవుడ్ నటి హేడెన్ పనెటీరి అకాల మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కేవలం 36 ఏళ్ల వయసులో ఈ న‌టి ప్రాణాలు కోల్పోవడంపై పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. గ్రీన్విల్లే కౌంటీ కరోనర్ కార్యాలయం ఈ మరణానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ధృవీకరించగా.. ఇది ప్రమాదవశాత్తూ మరణమని తేలింది. ఫెంటానిల్, 4-ఏ.ఎన్.పి.పి, అల్ప్రాజోలం, మెథోకార్బామోల్, క్వెటియాపైన్ వంటి ప‌లు రకాల మందుల విషతుల్య ప్రభావాల వల్ల న‌టి మృతి చెందినట్లు వెల్లడైంది.

ఈ ఘటనపై పోలీసులు- డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (డిఇఏ) సంయుక్తంగా దర్యాప్తు జరిపాయి. పోస్ట్ మార్టమ్ నివేదికలో న‌టి శరీరానికి ఎలాంటి గాయాలు లేవని తేలింది. అయితే గతంలో హేడెన్ తాను ఎదుర్కొన్న మానసిక ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్ , డ్రగ్స్ వ్యసనాల గురించి తన జ్ఞాపకాల పుస్తకంలో బహిరంగంగానే వెల్ల‌డించారు. చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి.. పెద్దయ్యాక ఇలాంటి మానసిక సంఘర్షణలకు లోనవుతున్న బాల నటులకు మరింత రక్షణ కల్పించాలనే డిమాండ్లు ఈ విషాద ఘటనతో మళ్లీ తెరపైకి వచ్చాయి.

మత్తు పదార్థాలు లేదా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ మోతాదు మించడం (ఓవర్‌డోస్) వల్ల అకాల మరణం చెంది కేవలం హేడెన్ మాత్రమే కాకుండా గతంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖ నటీమణులు, పాప్ గాయనిలు సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తారు. అలాంటి వారిలో అత్యంత ప్రసిద్ధులైన ఐదుగురు ప్రముఖుల జీవితాలు విషాదాంతమయ్యాయి. అంతర్జాతీయంగా అపారమైన కీర్తిని సంపాదించిన పాప్ దివార విట్నీ హ్యూస్టన్ 2012లో కొకైన్ వాడకం - గుండె సమస్యల కారణంగా బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగి మరణించారు. అలాగే అద్భుతమైన గాత్రంతో గుర్తింపు తెచ్చుకున్న బ్రిటీష్ గాయని అమీ వైన్‌హౌస్ కేవలం 27 ఏళ్ల వయసులో ఆల్కహాల్ పాయిజనింగ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు.

ఇదే కోవలో హాలీవుడ్ అందాల తార, గ్లామర్ ఐకాన్ మార్లిన్ మన్రో 1962లో నిద్రమాత్రలు మోతాదు మించి తీసుకోవడం వల్ల అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. 1960ల నాటి ప్రముఖ అమెరికన్ రాక్ అండ్ బ్లూస్ మ్యూజిక్ ఐకాన్ జానిస్ జోప్లిన్ కూడా 1970లో హెరోయిన్ ఓవర్‌డోస్ కారణంగా కేవలం 27 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు. ఇక 1990లలో సంచలనం సృష్టించిన ప్రముఖ మోడల్, నటి అన్నా నికోల్ స్మిత్ వ్యక్తిగత విషాదాలు .. ఆందోళనల కారణంగా 2007లో ర‌క‌రకాల సిడేటివ్‌లు, ప్రిస్క్రిప్షన్ మందులను మోతాదు మించి తీసుకోవడం వల్ల మరణించారు.

సెలబ్రిటీల జీవితాలు బయటకు ఎంత గ్లామరస్‌గా కనిపించినా తెరవెనుక వారు ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు, వ్యసనాలు వారిని ఏ స్థాయికి తీసుకెళ్తాయో ఇలాంటి ఘటనలు నిరూపిస్తున్నాయి. హేడెన్ పనెటీరి అకాల మరణం మరోసారి హాలీవుడ్‌లో మానసిక ఆరోగ్యం- డ్రగ్స్ వ్యసనాలపై తీవ్ర చర్చకు దారితీసింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి ఒత్తిడిని ఎదుర్కొనే కళాకారులకు సరైన కౌన్సిలింగ్, రక్షణ చర్యలు ఉండాల్సిన అవసరాన్ని ఈ విషాదాలు గుర్తుచేస్తున్నాయి.