Begin typing your search above and press return to search.

సంగీత లోకంలో విషాదం..క‌ఠిన శిక్ష‌కు AICWA డిమాండ్!

హరియాణ్వీ సంగీత పరిశ్రమలో ప్రాచుర్యం పొందిన యువ గాయకుడు అంకిత్ బాలియాన్ దారుణ హత్యకు గురవడం చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

By:  Srikanth Kontham   |   29 Aug 2026 7:03 PM IST
సంగీత లోకంలో విషాదం..క‌ఠిన శిక్ష‌కు AICWA డిమాండ్!
X

హరియాణ్వీ సంగీత పరిశ్రమలో ప్రాచుర్యం పొందిన యువ గాయకుడు అంకిత్ బాలియాన్ దారుణ హత్యకు గురవడం చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఉదంతంపై సినీ కార్మికుల అఖిల భార‌త సినీ కార్మికులు సంఘం (AICWA) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితుడి కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలని .. హత్యకు పాల్పడిన నేరస్థులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బహిరంగ విజ్ఞప్తి చేసింది.

అంకిత్ బాలియాన్‌ను అజ్ఞాత దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతుడైన కళాకారుడిని ఇలా క్రూరంగా హ‌త‌మార్చ‌డంపై సంగీత ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన హర్యానా తో పాటు ఉత్తరాది సంగీత రంగంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. ఒక కళాకారుడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం ప‌రిశ్ర‌మ‌ను కలచివేసింది.

ఈ దారుణ ఉదంతంపై ఏఐసీడ‌బ్ల్యూఏ అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా స్పందించారు. ప్రభుత్వం స్థానిక పోలీసు యంత్రాంగం కేసును ప్రాధాన్యతతో విచారించాలని డిమాండ్ చేశారు. కళాకారులకు సరైన భద్రత కల్పించడంలో వైఫల్యాలు ఎదురవుతున్నాయని, అంకిత్ బాలియాన్ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను తక్షణమే అదుపులోకి తీసుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయాలని విజ్ఞప్తి చేశారు.

కళాకారులు , సంగీతకారులు సమాజంలో ప్రతిభతో అందరినీ అలరిస్తుంటారని, అలాంటి వారిపై ఇలాంటి దాడులు జరగడం విచారకరమని అసోసియేషన్ పేర్కొంది. ఈ తరహా ఘటనలు పరిశ్రమలోకి వచ్చే కొత్త ప్రతిభావంతులను భయభ్రాంతులకు గురిచేస్తాయన్నారు. కాబట్టి నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇండస్ట్రీలో భద్రతా భావాన్ని నింపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు.

అంకిత్ బాలియాన్ అకాల మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ తీవ్ర సానుభూతిని తెలియజేసింది. బాధితుడి కుటుంబానికి తగిన ఆర్థిక సాయంతో పాటు పూర్తి స్థాయి న్యాయ పోరాటంలో అసోసియేషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సంద‌ర్భంగా కోరారు.