గ్యాంగ్‌స్టర్‌గా సవాల్‌ను స్వీకరిస్తాడా?
కానీ ఇలాంటి ఒక సవాల్ ని స్వీకరించేందుకు నవతరం హీరో హర్షవర్ధన్ రాణే సిద్ధమవుతున్నాడు. అతడు ఇప్పటివరకూ రొమాంటిక్ కామెడీలతో ఆకట్టుకున్నాడు.
By: Sivaji Kontham | 27 Oct 2025 5:00 AM ISTసత్య .. గ్యాంగ్ స్టర్ .. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ ..ఇంకా చాలా గ్యాంగ్ స్టర్ డ్రామాలు బాలీవుడ్ లో వచ్చాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకం అని నిరూపించాయి. ఈ సినిమాల్లో నటీనటుల ప్రదర్శనలు పరాకాష్టలో మెప్పించాయి. అందుకే ఇప్పుడు మరోసారి గ్యాంగ్ స్టర్ డ్రామాను ఎంపిక చేసుకుంటే, దానిలో ప్రధాన పాత్రధారి కొత్తదనం, వైవిధ్యం ప్రదర్శించడంలో సత్తా చాటాల్సి ఉంటుంది. షారూఖ్ డాన్ లో అండర్ వరల్డ్ కింగ్ గా నటించి మెప్పించాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ `కింగ్` చిత్రంలో మరోసారి మాఫియా డాన్ గా నటిస్తున్నాడు.
ఇలాంటి సమయంలో ఒక నవతరం హీరో అండర్ వరల్డ్ లో ప్రవేశించే యువకుడిగా, పరిణతి చెందిన డాన్‌గా భిన్నమైన షేడ్స్ లో నటించాలంటే చాలా సవాళ్లను స్వీకరించాలి. నటనలో కొత్తదనం చూపించాలి. కథ, కథనంలో మేకర్స్ కొత్తదనం ఆవిష్కరించాలి. ముఖ్యంగా ఎమోషన్స్ ని కనెక్ట్ చేసే ఎలిమెంట్స్ ని జోడించాల్సి ఉంటుంది. ఎక్కడ ఏది సింక్ కాకపోయినా అది మిస్ ఫైర్ అవ్వడం ఖాయం.
కానీ ఇలాంటి ఒక సవాల్ ని స్వీకరించేందుకు నవతరం హీరో హర్షవర్ధన్ రాణే సిద్ధమవుతున్నాడు. అతడు ఇప్పటివరకూ రొమాంటిక్ కామెడీలతో ఆకట్టుకున్నాడు. సనమ్ తేరి కసమ్, ఏక్ దీవానే కి దీవానియాత్ చిత్రాలతో నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు రాణే. ఈ రెండు చిత్రాలు ప్రేమకథలు.. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ నేపథ్యంలో రక్తి కట్టించాయి. కానీ ఇప్పుడు హర్షవర్ధన్ పూర్తిగా ఒక భిన్నమైన ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. అండర్ వరల్డ్ మాఫియా పాత్ర అతడికి పూర్తిగా కొత్త. ఇది ఒక సవాల్.
ఇది తన కెరీర్ లో ఒక సాహసంగానే చూడాలి. డాన్ పాత్రలో మునుపెన్నడూ చూడని కొత్తదనాన్ని చూపించేందుకు అతడు చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఒక రొటీన్ ప్రేమికుడిగా లేదా భగ్న ప్రేమికుడిగా కనిపించినంత సులువుగా డాన్ పాత్రలోకి ఒదిగిపోవడం కుదరదు. కానీ నటుడిగా కొత్త దశకు చేరాలంటే ఇలాంటి ఒక ప్రయత్నం చేయాలి. హర్షవర్ధన్ రొటీన్ కి భిన్నంగా ఒక డాన్ గా ఎలా పరివర్తన చెందుతాడో వేచి చూడాలి. ఈ ప్రతిష్ఠాత్మక గ్యాంగ్ స్టర్ డ్రామాను బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తాకపూర్ నిర్మించనున్నారు. ఒక అన్ నోన్ ప్రపంచం నుంచి అండర్ వరల్డ్ లోకి ప్రవేశించే యువకుడి భావోద్వేగాలను వెండితెరపైకి తీసుకు రావాలనే ప్రయత్నమిది. ఇది ఒక రకంగా ఆర్జీవీ సత్య స్టోరి లైన్ ని పోలి ఉంటుంది. కానీ ఇప్పుడు దానికి మించి మోడ్రన్ యుగపు డాన్‌గా హర్షవర్ధన్ పరిణతి చెందిన నటనను కనబరచాల్సి ఉంటుంది. తనకు సంబంధం లేకుండానే అండర్ వరల్డ్ లో ప్రవేశించే యువకుడిగా హర్షకు నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉంది. కానీ అతడు ఏం చేస్తాడో వేచి చూడాలి.
హర్షవర్ధన్ తదుపరి `సిలా` చిత్రంలో సాదియా ఖతీబ్, కరణ్ వీర్ మెహ్రాతో కలిసి కనిపిస్తాడు. ఆ తర్వాత ఏక్తాకపూర్ నిర్మించే గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం ప్రిపేర్ అవుతాడు. భూమిక నిర్మించిన తెలుగు సినిమా తకిట తకిట నుంచి హర్షవర్ధన్ రాణే ప్రయాణం ఆసక్తికరం. అతడు బాలీవుడ్ లో పెద్ద స్టార్ గా తనను తాను ఆవిష్కరించుకునే సమయంలో ఇది అద్భుత అవకాశం.
