Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో కెరీర్‌ను స్టాక్ మార్కెట్‌తో పోల్చిన న‌టుడు!

బాలీవుడ్ యువ నటుడు హర్షవర్ధన్ రాణే కెరీర్ గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

By:  Srikanth Kontham   |   24 Aug 2026 10:42 PM IST
ఇండస్ట్రీలో కెరీర్‌ను స్టాక్ మార్కెట్‌తో పోల్చిన న‌టుడు!
X

బాలీవుడ్ యువ నటుడు హర్షవర్ధన్ రాణే కెరీర్ గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. సినిమా ఇండస్ట్రీలో నటుడి స్థానం, బాక్సాఫీస్ సక్సెస్ పూర్తిగా మార్కెట్ సెంటిమెంట్‌పై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్టాక్ మార్కెట్‌లో షేర్ల విలువ హెచ్చుతగ్గుల లాంటిదేనని పేర్కొన్నారు. తన కెరీర్ గ్రాఫ్, ఇండస్ట్రీలో ఎదురవుతున్న సవాళ్లపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కెరీర్‌లో ఎదగడానికి లభించిన అవకాశాలను ఎంతో గౌరవిస్తానని హర్షవర్ధన్ రాణే తెలిపారు. ఒకవేళ ఇండస్ట్రీ తనను పట్టించుకోకపోతే వ్యక్తిగతంగా తీసుకోనని మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరణగా భావిస్తానన్నారు.

`ఇండస్ట్రీలో స్టాక్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. బంగారం ధరలు కొన్ని నెలల్లో పెరుగుతాయి..త‌గ్గుతాయి. జీవితం కూడా సరిగ్గా స్టాక్ మార్కెట్ లాంటిదే. మార్కెట్ పుంజుకున్నప్పుడు ప్రతిదీ గణితాత్మకంగా సాగుతుందన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం తాను నటించిన `సనమ్ తేరి కసమ్` సినిమా రీ-రిలీజ్ ద్వారా మళ్లీ భారీ ప్రజాదరణ పొందడం కెరీర్‌కు కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. ఎవరైనా తనను పట్టించుకోకపోతే మరింత కష్టపడతానని, తనకు మరిన్ని అవకాశాలు ఇస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని పేర్కొన్నారు.

ఎలాంటి అవకాశాలు రాక‌పోతే? అది తనలో మరింత కసిని, పట్టుదలను పెంచుతుందని వెల్లడించారు. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ దూసుకుపోతున్నాడు. రామ్ గోపాల్ వర్మ `దయా నాయక్` చిత్రంతో పాటు ఓమంత్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ మూవీ `సైలాబ్` లో నటిస్తున్నారు. అలాగే తన ఆరాధ్య నటుడు జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో తెర‌కెక్కుతోన్న `ఫోర్స్ 3` చిత్రంలోనూ విలన్ పాత్రలో న‌టిస్తున్నారు. 2004లో జాన్ అబ్రహాంకు హెల్మెట్ డెలివరీ చేసిన తానిప్పుడు అదే నటుడితో ఒకే ఫ్రేమ్‌లో స్క్రీన్ షేర్ చేసుకోవడం థ్రిల్లింగ్‌గా ఉందని గుర్తు చేసుకున్నారు.

రామ్ గోపాల్ వర్మతో పనిచేయడం నిత్యం కొత్త సవాళ్లకు గురిచేస్తుందని తెలిపారు. వర్మ తన సినిమా శైలిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ నటులను కొత్త కోణంలో ఆవిష్కరిస్తారని.. ఆయనతో పనిచేయడం అద్భుతమైన అనుభూతిని ఇస్తుందన్నారు. ఇలా విభిన్న జానర్ల సినిమాలతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్న హ‌ర్ష‌వ‌ర్ద‌న్ అప్ క‌మింగ్ చిత్రాలపై చాలా ఆశ‌లే పెట్టుకున్నారు.

అలాగే హర్షవర్ధన్ రాణే టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. అత‌డి కెరీర్ తెలుగు సినిమాతోనే ప్రారంభ‌మైంది. టాలీవుడ్‌లో ఆయన నటించిన చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టడమే కాకుండా నటుడిగా బలమైన పునాది వేశాయి. రాఘవేంద్ర రావు సమర్పణలో తెరకెక్కిన `తకిట తకిట` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాణే సహజ నటనతో తొలి సినిమాతోనే యువతను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన `అనగనగా ఒక ధీరుడు` చిత్రంలోనూ కీలక పాత్రలో నటించి మెప్పించారు.