యువహీరో ద్వంద్వ వైఖరికి చీవాట్లు
ఇక తన సహనటి, పాకిస్తానీ బ్యూటీ మావ్రా హుకేన్ భారతదేశం విషయంలో తన వైఖరిని దాచుకోకుండా విమర్శించగా, దానిని హర్షవర్ధన్ రాణే తనదైన శైలిలో ఖండించాడు.
By: Sivaji Kontham | 22 Sept 2025 8:00 AM ISTఆపరేషన్ సింధూర్ సమయంలో వినోద పరిశ్రమలో తీవ్ర పరిణామాల గురించి తెలిసిందే. ముష్కర తీవ్రవాదుల ఘాతుకానికి భారతదేశం ప్రతీకారం తీర్చుకునే సమయంలో తారలు కొందరు దేశానికి మద్ధతుగా స్పందించారు. భారతదేశానికి బాసటగా నిలిచారు. మన దేశాన్ని తిడుతూ, కించపరిచిన పాకిస్తానీ స్టార్లను పూర్తిగా వ్యతిరేకించారు. భారతీయ వినోద పరిశ్రమలో పాకిస్తానీ నటీనటులకు దారులు మూసేయాలని కూడా చాలా మంది ఆకాంక్షించారు.
ఇక తన సహనటి, పాకిస్తానీ బ్యూటీ మావ్రా హుకేన్ భారతదేశం విషయంలో తన వైఖరిని దాచుకోకుండా విమర్శించగా, దానిని హర్షవర్ధన్ రాణే తనదైన శైలిలో ఖండించాడు. సనమ్ తేరి కసమ్ రీరిలీజ్ లో పెద్ద హిట్టయిన సందర్భంలోనే, పాక్ నటితో విరోధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన ఉత్సాహంలో ఉన్నప్పుడు అతడు పాకిస్తానీ కోస్టార్ మావ్రా విషయంలో ఎలాంటి వైఖరిని అనుసరించాడో అందరికీ గుర్తుంది. కానీ ఇప్పుడు ఇంతలోనే అతడిలో ఎంతటి మార్పు.
ఇప్పుడు పాకిస్తానీ పాట బోల్ కఫ్ఫారా క్యా హోగా (ఏక్ దీవానే కి దీవానియాత్ లో పాట) ఎంతో అద్భుతంగా ఉంది! అంటూ కీర్తిస్తున్నాడు. నిజానికి పాకిస్తానీ నటిని వ్యతిరేకించిన అతడు దాయాది దేశానికి చెందిన పాటను ఎలా ప్రశంసించగలడు? అనేది విమర్శలకు తావిస్తోంది. అతడి ద్వంద్వ ప్రమాణాలను పలువురు విమర్శిస్తున్నారు. అవసరాన్ని బట్టి, తన కెరీర్ కోసం ఇలా మారడం సరికాదని కూడా సూచిస్తున్నారు. స్థిరమైన విధానం, ఆలోచన చాలా ముఖ్యమని హర్షవర్ధన్ కి సూచిస్తున్నారు.
హర్షవర్ధన్ టాలీవుడ్ లో `తకిట తకిట` అనే చిత్రంలో నటించాడు. అతడి మొదటి ప్రయత్నం డిజాస్టరైంది. ఈ సినిమాతో నిర్మాతగా మారిన భూమిక- భరత్ ఠాకూర్ జంట డిజాస్టర్ ఫలితంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. నిజానికి హర్షవర్ధన్ సినిమాల్లోకి రాక మునుపు ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపాడు. సికిందరాబాద్ పరిసరాల్లోని ఒక ఫర్నిచర్ షాప్‌లో కార్పెంట్రీ పని కూడా చేసానని తెలిపాడు. పాత సోఫాలను రీమోడల్ చేసి అమ్మకాలతో కనీస అవసరాలకు సంపాదించుకున్నానని వెల్లడించడం షాకిచ్చింది.
