వారసుడు రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటుడు!
తాజాగా ఈ ప్రచారంపై హర్షవర్ధన్ నెటిజన్లకు గట్టి సమాధానమిచ్చారు. కెరీర్ ముగిసిపోయిందంటూ వస్తోన్న వార్తలను హర్షవర్ధన్ కపూర్ తోసిపుచ్చారు.
By: Srikanth Kontham | 9 Jun 2026 12:08 PM ISTబాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ వారసుడిగా.. సోనమ్ కపూర్ సోదరుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటుడు హర్షవర్ధన్ కపూర్ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా హర్షవరదన్ వెండితెరపై ఆశించిన స్థాయిలో కనిపించకపోవడంతో నటనకు గుడ్‌బై చెప్పేశారంటూ సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై హర్షవర్ధన్ నెటిజన్లకు గట్టి సమాధానమిచ్చారు. కెరీర్ ముగిసిపోయిందంటూ వస్తోన్న వార్తలను హర్షవర్ధన్ కపూర్ తోసిపుచ్చారు.
తాను నటనను వదిలిపెట్టలేదని.. సంఖ్య కోసం కాకుండా కంటెంట్‌కు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే చేయాలనే ఉద్దేశంతోనే విరామం తీసుకున్నానని వివరణ ఇచ్చారు. పరిశ్రమలో నిరంతరం సినిమాలు చేస్తూ రేసులో ఉండటం కంటే ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే మంచి పాత్రలు చేయడంపైనే ఆసక్తి ఉందని ఈ సందర్భంగా వివరించారు. హర్షవర్ధన్ కపూర్ తన సినీ ప్రయాణాన్ని ఎంతో వైవిధ్యంగా ప్రారంభించారు. `మిర్జ్యా`, `భవేష్ జోషి సూపర్ హీరో` వంటి ప్రయోగాత్మక చిత్రాలలో ఆయన నటనకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ హంగులతో కూడిన రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ నటుడిగా తనలోని సృజనాత్మకతను నిరూపించుకునే స్క్రిప్ట్‌లను ఎంచుకోవడమే తక్కువ సినిమాల్లో కనిపించడానికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు.
స్టార్ కిడ్స్ అనగానే భారీ బడ్జెట్, కమర్షియల్ ప్రాజెక్ట్‌లతోనే కెరీర్‌ను నిర్మించుకుంటారనే అంచనా ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ హర్షవర్ధన్ మాత్రం ఆ మూస ధోరణిని బద్దలు కొడుతూ ఇండీ తరహా చిత్రాలకు, ఓటీటీ వేదికలపై వచ్చే బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తన సోదరి సోనమ్ కపూర్ లాగే తాను కూడా చిత్ర పరిశ్రమలో తనకంటూ సొంత ముద్ర వేయడానికే ప్రయత్నిస్తున్నాడని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల గురించి చిన్న చిన్న విషయాలకే రకరకాల అంచనాలు, పుకార్లు పుట్టుకురావడం సర్వ సాధారణంగా మారిపోయింది. నటుడు కొన్ని రోజులు కెమెరా ముందుకు రాకపోతే కెరీర్ ముగిసిందని భావించడం సరికాదని.. తెరవెనుక ఎంతో స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుంటాయని హర్షవర్ధన్ గుర్తు చేశారు. భవిష్యత్తులో రాబోయే కొత్త ప్రాజెక్ట్‌ల ద్వారా ఈ వదంతులకు సరైన సమాధానం లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. పెద్ద సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చినా? బాక్సాఫీస్ విజయాల ఒత్తిడికి లోనవకుండా కేవలం నటనపై ఉన్న అభిరుచితోనే ముందుకు సాగుతున్నారు హర్షవర్ధన్. పరిశ్రమలో సుదీర్ఘ కాలం నిలదొ క్కుకోవడానికి క్వాంటిటీ కంటే క్వాలిటీ ఎంత ముఖ్యమో నమ్ముతున్న ఆయన ధోరణి సినీ సర్కిల్స్‌లో ప్రశంసలు అందుకుంటోంది.
