Begin typing your search above and press return to search.

రెండో రోజూ ఫుల్ స్పీడ్ లో 'దీవాన'.. మేకర్స్ ఫుల్ ఖుషీ!

యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ దీవాన విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నట్లు మూవీ టీమ్ చెబుతోంది.

By:  M Prashanth   |   21 Jun 2026 8:12 PM IST
రెండో రోజూ ఫుల్ స్పీడ్ లో దీవాన.. మేకర్స్ ఫుల్ ఖుషీ!
X

యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ దీవాన విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నట్లు మూవీ టీమ్ చెబుతోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఆ సినిమా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తోందని మేకర్స్ వెల్లడించారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో సాయంత్రం షోలకు బుకింగ్స్ వేగంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు.




ఈ సందర్భంగా మూవీ టీమ్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది. రెండో రోజు నుంచి దీవాన మూవీకి మంచి బుకింగ్స్ నమోదవుతున్నాయని, అన్ని ప్రాంతాల్లో సాయంత్రం షోలు వేగంగా నిండిపోతున్నాయని తెలిపింది. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ఆ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న రెస్పాన్స్ పట్ల ఆనందం వ్యక్తం చేసింది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రాండ్‌ గా విడుదలైన ఆ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తమకు ఉత్సాహాన్ని ఇస్తోందని పేర్కొంది.

మొదట ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే చివరి నిమిషంలో విడుదల తేదీని జూన్ 20కు మార్చారు. అయినప్పటికీ రిలీజ్‌ కు ముందే ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఆ ప్రీమియర్లకు వచ్చిన రెస్పాన్స్ సినిమాపై అంచనాలను పెంచింది. విడుదల తర్వాత కూడా అదే ఉత్సాహం కొనసాగుతుండటంతో మూవీ యూనిట్ సంతృప్తి వ్యక్తం చేస్తోంది.

శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రాన్ని వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందనే అభిప్రాయం వినిపిస్తోంది.

దీవాన కథ విషయానికి వస్తే, జీవితాన్ని సరదాగా గడిపే ఓ యువకుడు ప్రేమ కారణంగా తన జీవితాన్ని మార్చుకోవడానికి చేసే ప్రయత్నాల చుట్టూ కథ సాగుతుంది. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, బాధ్యత, లక్ష్యం వంటి అంశాలను దర్శకుడు కథలో మిక్స్ చేశారు. ముఖ్యంగా యువతకు దగ్గరగా ఉండే అంశాలు సినిమాలో ఉండటంతో మంచి కనెక్ట్ ఏర్పడిందని సినీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.

హర్షిత్ రెడ్డి నేచురల్ యాక్టింగ్ తో ప్రశంసలు అందుకుంటుండగా, స్మేహా మణిమేఘలై కూడా తన పాత్రకు న్యాయం చేసిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచిందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో చిన్న సినిమాలు మంచి కంటెంట్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అదే జాబితాలో దీవాన కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా మౌత్ టాక్ బాగుంటే చిన్న సినిమాలకు వీకెండ్ కలెక్షన్లు కీలకం అవుతాయి. ప్రస్తుతం రెండో రోజే బుకింగ్స్ జోరుగా ఉన్నాయని మేకర్స్ ప్రకటించడం చూస్తుంటే, ఆ సినిమాకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందని అర్థమవుతోంది. ఏదేమైనా విడుదలైన రెండో రోజే బుకింగ్స్ పెరగడం దీవానకు ప్లస్ గా మారింది. వీకెండ్ ముగిసే నాటికి ఆ సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో, ప్రేక్షకుల ఆదరణ ఎంతవరకు కొనసాగుతుందో వేచి చూడాలి.