Begin typing your search above and press return to search.

ఉద్దేశం కాదు.. మాట్లాడిన తీరే తప్పు.. శివాజీ వ్యాఖ్యలపై హర్షవర్ధన్!

సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ.. తన పాత్రలకు జీవం పోస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు శివాజీ.

By:  Madhu Reddy   |   16 Jan 2026 3:00 PM IST
ఉద్దేశం కాదు.. మాట్లాడిన తీరే తప్పు.. శివాజీ వ్యాఖ్యలపై హర్షవర్ధన్!
X

సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ.. తన పాత్రలకు జీవం పోస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు శివాజీ. ఒకప్పుడు హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. ముఖ్యంగా రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో కంటెస్టెంట్ గా పాల్గొని తన మంచి మనసుతో అందరి హృదయాలను దోచుకున్నారు.. అలాంటి ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో విలన్ పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటూ అభిమానులకు మరింత చేరువవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా గత ఏడాది ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహిళల వస్త్రధారణ పై శివాజీ చేసిన కామెంట్లు పెద్ద దుమారమే సృష్టించాయి.

ముఖ్యంగా ఈ వివాదంలోకి అనసూయ , చిన్మయి, నాగబాబు లాంటి సెలబ్రిటీలు కూడా వచ్చి చేరారు. మహిళ కమిషన్ కూడా రంగంలోకి దిగి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు శివాజీ స్పందించి క్షమాపణలు చెప్పక తప్పలేదు. అయితే ఇప్పుడు తాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు హర్షవర్ధన్ కీలక కామెంట్లు చేశారు. శివాజీ చేసిన మాటలలో ఉద్దేశం సరైనదే కానీ ఆయన మాట్లాడిన తీరు సరిగా లేకపోవడం వల్ల ఈ విమర్శలు వచ్చాయి అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్.. స్వేచ్ఛలో దుస్తులు భాగం కావాలి కానీ దుస్తులు మాత్రమే స్వేచ్ఛ కాదని చెప్పుకొచ్చారు. పైగా మహిళల వస్త్రధారణ పై శివాజీ చేసిన కామెంట్లకు ఉదాహరించి కూడా ఆయన క్లారిటీగా చెప్పారు. దొంగల మనసు మార్చడం కంటే నా ఇంటికి తాళం వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే అది నా చేతిలో ఉన్న పని. కాబట్టి నా ఇంట్లో వాళ్లకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం నాకు సులభం. అంతేకానీ దొంగల్లారా మీరు ఒకసారి ఆలోచించండి.నేను లేని సమయంలో ఒంటరిగా ఉన్న నా వాళ్ళ పై మీరు దాడి చేయకండి అని దొంగలకు మనం ఎలా చెప్పగలం.. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఈ అంశంపై కూడా ఆలోచిస్తే ఒక విషయం నాకు అర్థం అవుతుంది

ముఖ్యంగా రెండు టాపిక్లను ఎప్పుడూ కూడా కలిపి చూడకూడదు. స్వేచ్ఛ గురించి మాట్లాడితే దాని మీదే ఫోకస్ చేయాలి.. దుస్తుల గురించి మాట్లాడితే వాటిపైనే మాట్లాడాలి. మంచి ఉద్దేశంతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాట్లాడే తీరు సరిగా లేకపోతే వాళ్లు శివాజీ , అనసూయలు అవుతారు. అందుకే ఉద్దేశం సరైనదే అయినా..ఆయన మాట్లాడిన తీరు మాత్రమే తప్పు అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు హర్షవర్ధన్.

మొత్తానికైతే మోడ్రన్ దుస్తులు ధరించడం మాత్రమే స్వేచ్ఛ కాదు.. వాటి గురించి మాట్లాడే సమయంలో స్వేచ్ఛ అనే పదాన్ని ఉపయోగించకూడదు అని.. ముఖ్యంగా మనం ఉంటున్న ప్రదేశాన్ని బట్టి మన డ్రెస్సింగ్ కూడా ఉంటుంది. దుస్తులు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంపై మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు అని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.