'హ్యారీపోటర్' సిరీస్: పుస్తకాలలోని కథలు మార్చేయడం ఎంతవరకూ సమంజసం?
ఏదైనా పాపులర్ నవల లేదా పుస్తకం ఆధారంగా సినిమా లేదా టీవీ సిరీస్‌ను నిర్మిస్తున్నప్పుడు.. దాని మూల కథకు ఎంతవరకు కట్టుబడి ఉన్నారనేది అత్యంత కీలకమైన అంశం.
By: Sivaji Kontham | 3 Sept 2026 9:28 AM ISTఏదైనా పాపులర్ నవల లేదా పుస్తకం ఆధారంగా సినిమా లేదా టీవీ సిరీస్‌ను నిర్మిస్తున్నప్పుడు.. దాని మూల కథకు ఎంతవరకు కట్టుబడి ఉన్నారనేది అత్యంత కీలకమైన అంశం. ఇటీవల `హ్యారీ పోటర్` కొత్త టీవీ సిరీస్ ట్రైలర్ విడుదలైన తర్వాత.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రొడక్షన్ సంస్థలు ``పుస్తకంలోని కథను ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తాం`` అని ప్రతిజ్ఞ చేసినా.. దృశ్య రూపంలోకి వచ్చేసరికి అనేక మార్పులు చేస్తున్నారని అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ `స్నేప్`.. పాత్ర రూపురేఖల గురించి.. పుస్తకాల్లో స్నేప్ పాత్రకు ఉండే జిడ్డు జుట్టు.. పసుపు పచ్చటి చర్మం... వికారమైన రూపం కేవలం అతడి బాహ్య సౌందర్యానికి సంబంధించినవి మాత్రమే కావు. ఆ రూపమే అతడి సామాజిక దూరాన్ని.. అతడిలోని చేదు స్వభావాన్ని.. అతడి జీవితంలో జరిగిన సంఘటనలను ప్రతిబింబిస్తుంది. ఆధునిక దృశ్య మాధ్యమాల కోసం ఆ రూపాన్ని అందంగా లేదా ఇంకేదైనా రూపంలోకి మార్చి చూపించినప్పుడు.. ఆ పాత్ర అసలు ఆత్మ దెబ్బతింటుందని పాఠకులు భావిస్తున్నారు.
హాలీవుడ్ ఫిలింమేకర్స్ ఏదైనా కథను రీబూట్ చేసినప్పుడు.. పుస్తకంలోని మూల కథ లోతును అర్థం చేసుకోకుండా కేవలం గ్రాఫిక్స్.. మోడ్రన్ హంగులపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఒకవైపు నిర్మాణ విలువలు.. అద్భుతమైన కాజిల్స్ (కోటలు) చూపిస్తున్నా.. పాత్రల ఎంపిక .. సన్నివేశాల చిత్రీకరణలో పుస్తకంలో ఉన్న స్పష్టమైన వివరణలను విస్మరిస్తున్నారు. దీనివల్ల నవలలోని అసలైన భావోద్వేగాలు తెరపైకి వచ్చేసరికి నీరుగారిపోతున్నాయి.
సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం... నేటి ప్రొడక్షన్ హౌస్‌లు పాత కథలను యథాతథంగా చూపించడం కంటే తమ సొంత దృక్పథాన్ని లేదా ఆధునిక ట్రెండ్స్‌ను జోడించడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది కేవలం పాత అభిమానుల నుండి డబ్బులు వసూలు చేయడానికి ఉపయోగించే మార్కెటింగ్ ఎత్తుగడ మాత్రమేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కొత్తగా చూసే ప్రేక్షకులకు ఇది బాగానే అనిపించినా... దశాబ్దాలుగా ఆ పుస్తకాలను ఆరాధించిన అభిమానులకు మాత్రం ఇది తీవ్ర నిరాశను కలిగిస్తోంది.
చివరగా.. ఏదైనా పాపులర్ కథను మళ్లీ సినిమాగా లేదా సిరీస్ రూపంలో తీస్తున్నప్పుడు పాత జ్ఞాపకాలను గౌరవించడం చాలా అవసరం. పుస్తకంలోని సంక్లిష్టమైన పాత్రలను.. వారి కథనాలను మార్చకుండా తెరపైకి తీసుకొచ్చినప్పుడే ఆ రీబూట్‌కు నిజమైన సార్థకత లభిస్తుంది. లేకపోతే.. ఇవి కేవలం సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్.. వివాదాలకే పరిమితమై... కొద్ది రోజుల్లోనే తమ గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉంది.
