Begin typing your search above and press return to search.

హ్యారీస్ జైరాజ్ మార్క్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదే!

కానీ గత కొంతకాలంగా ఆ మార్క్ బాక్సాఫీస్ వద్ద గానీ, చార్ట్‌బస్టర్లలో గానీ ఎక్కడా కనిపించకపోవడం సంగీత ప్రియులను విస్మయానికి గురిచేస్తోంది.

By:  Srikanth Kontham   |   17 April 2026 1:07 PM IST
హ్యారీస్ జైరాజ్ మార్క్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదే!
X

ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో హ్యారీస్ జైరాజ్ పేరు ఒక సంచలనం. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాల తర్వాత ఆ స్థాయి మెలోడీలను, ట్రెండీ మ్యూజిక్‌ను అందించగల సత్తా ఉన్న ఏకైక సంగీత దర్శకుడిగా హ్యారీస్ గుర్తింపు పొందారు. వాసు, ఘర్షణ, ఆరెంజ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపిన హ్యారీస్ తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్నారు. కానీ గత కొంతకాలంగా ఆ మార్క్ బాక్సాఫీస్ వద్ద గానీ, చార్ట్‌బస్టర్లలో గానీ ఎక్కడా కనిపించకపోవడం సంగీత ప్రియులను విస్మయానికి గురిచేస్తోంది.

హ్యారీస్ జైరాజ్ సంగీతంలో వైవిధ్యం కంటే ఒకే రకమైన సౌండింగ్ వినిపిస్తోందనే విమర్శలు ఆయన మార్కెట్‌ను దెబ్బతీశాయి. ఒకప్పుడు ప్రతి పాటలోనూ కొత్తదనం చూపించిన ఆయన క్రమంగా తన పాత ట్యూన్లనే రీసైకిల్ చేస్తున్నారనే భావన శ్రోతలలో కలిగింది. దీనికి తోడు ప్రస్తుతం మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ,భారీ మాస్ బీట్స్ ట్రెండ్ నడుస్తోంది. హ్యారీస్ బలం మెలోడీ కావడం, ప్రస్తుత కమర్షియల్ సినిమాలకు కావలసిన ఇన్‌స్టంట్ ఎనర్జీని ఆయన అందించలేకపోవడం వల్ల వెనుక బ‌డ్డారా? అన్న సందేహాలు లేక‌పోలేదు.

ఒకప్పుడు సూర్య, విక్రమ్, హ్యారీస్ జైరాజ్ కాంబినేషన్ అంటే కనీసం ఆరు నెలల ముందు నుండే పాటల కోసం అభిమానులు వేచి చూసేవారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోల దృష్టి అంతా అనిరుధ్ రవిచందర్ , థమన్ వంటి యువ సంగీత దర్శకులపై పడింది. బిగ్ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులు హ్యారీస్ చేతి నుండి జారిపోవడంతో ఆయన మార్కెట్ పైనా ప్ర‌భావం చూపిస్తోంది . స్టార్ హీరోలతో నిరంతరం పని చేసిన ఆయన ఇప్పుడు యువ హీరోల సినిమాలకే పరిమితం కావాల్సి రావడం గమనార్హం. మారిన సాంకేతికతను , ప్రేక్షకుల అభిరుచులను అందిపుచ్చుకోవడంలో హ్యారీస్ కొంత నెమ్మదించారని విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

అనిరుధ్ వంటి వారు సోషల్ మీడియా ట్రెండ్స్‌కు తగ్గట్లుగా సాంగ్స్ కంపోజ్ చేస్తుంటే, హ్యారీస్ ఇంకా పాత పద్ధతులకే కట్టుబడి ఉండటం ఆయనకు మైనస్‌గా మారిందంటున్నారు. కేవలం ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరించేలా ఆయన సంగీతం ఉండటం వల్ల, మాస్ ప్రేక్షకులకు ఆయన దూర‌మ‌వుతున్నార‌న్న‌ది కొంద‌రి అభిప్రాయం. ఇది ఆయన కెరీర్ గ్రాఫ్‌ను అగ్రస్థానం నుండి కిందికి దించుతున్న‌ట్లే ఉంది. అయినా హ్యారీస్ జైరాజ్ ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. ఒక గొప్ప కంబ్యాక్ ఇవ్వడానికి ఆయనకు కావాల్సింది కేవలం ఒక సరైన దర్శకుడు, మంచి కథ మాత్రమే.

గౌతమ్ మీనన్, శంక‌ర్ లాంటి దర్శకులతో ఆయన పని చేసినప్పుడు వచ్చిన అవుట్‌పుట్ మళ్ళీ రిపీట్ అయితే? హ్యారీస్ మ్యాజిక్ మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న చిన్న సినిమాలు సంగీత పరంగా హిట్ అయితే? తిరిగి పెద్ద ప్రాజెక్టులు ఆయన తలుపు తట్టే అవకాశం లేకపోలేదు. సినీ పరిశ్రమలో మార్పు అనేది సహజం. నిన్న ఉన్న క్రేజ్ నేడు ఉండకపోవచ్చు. అయితే హ్యారీస్ జైరాజ్ వంటి అనుభవజ్ఞుడు తన శైలిని ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా మార్చుకుని మళ్ళీ తన మార్క్ మెలోడీలతో విరుచు కుపడితే తప్పకుండా పూర్వ వైభవాన్ని దక్కించుకోగలరు. అప్పటి వరకు సంగీత ప్రపంచంలోసైలెంట్ ఫేజ్ త‌ప్ప‌దు.