గబ్బర్ సింగ్ కావాలి.. రీమేక్ వద్దా? ఆడియన్స్‌పై హరీష్ అసహనం
టాలీవుడ్‌లో సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత డైరెక్టర్లు ఎదుర్కొంటున్న ఒత్తిడి, అభిప్రాయ భేదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 26 March 2026 10:29 PM ISTటాలీవుడ్‌లో సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత డైరెక్టర్లు ఎదుర్కొంటున్న ఒత్తిడి, అభిప్రాయ భేదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రేక్షకుల అభిరుచుల్లో కన్ఫ్యూజన్ డైరెక్టర్లకు పెద్ద సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
ఆడియన్స్ ఒకవైపు మాకు ఇంకో గబ్బర్ సింగ్ కావాలి అని కోరుకుంటూనే, మరోవైపు రీమేక్‌లు వద్దు అని చెప్పడం తనకు అర్థం కావడం లేదని హరీష్ శంకర్ వ్యాఖ్యానించారు. ఆయన దృష్టిలో ఈ రెండు అభిప్రాయాలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు. ఎందుకంటే గబ్బర్ సింగ్ స్వయంగా ఒక రీమేక్ మూవీ అన్న విషయం తెలిసిందే. అలాంటి సినిమాను మళ్లీ కోరుతూ, అదే సమయంలో రీమేక్‌లను తిరస్కరించడం ప్రేక్షకులలో స్పష్టత లేకపోవడాన్ని సూచిస్తుందని హరీష్ చెప్తున్నారు.
హరీష్ శంకర్ తన కెరీర్‌లో పలు రీమేక్ సినిమాలు తెరకెక్కించారు. అయితే వాటిలో గబ్బర్ సింగ్ మాత్రమే భారీ విజయాన్ని సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మిగతా సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించినా, అది రీమేక్‌నా? ఒరిజినల్‌నా? అనే చర్చలు ముందుగానే మొదలవుతుంటాయి.
ఈ విమర్శలపై స్పందిస్తూ హరీష్ శంకర్ ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేశారు. తాను రీమేక్ సినిమా చేయాల్సి వస్తే దాన్ని ఎప్పుడూ దాచిపెట్టనని, ముందుగానే ఆడియన్స్ కు క్లారిటీ ఇస్తానని అన్నారు. గబ్బర్ సింగ్ టైమ్ లో కూడా అదే విధంగా వ్యవహరించానని, టైటిల్ కార్డులోనే మాటలు, మార్పులు, దర్శకత్వం అని క్లియర్ గా వేసుకున్నట్టు గుర్తు చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇటీవలే రిలీజై ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా హరీష్ సినిమాను ప్రమోట్ చేస్తూ రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడి వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
