Begin typing your search above and press return to search.

ఉస్తాద్ ప్రీ-రిలీజ్: క‌ష్టంలో ఉన్న‌ప్పుడు నా దేవుడు ఆదుకున్నాడు

పవన్ కళ్యాణ్ పనితీరు గురించి మాట్లాడుతూ.. ఆయన పగలు ప్రజాసేవలో ఉంటూనే.. రాత్రిళ్ళు సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని హరీష్ తెలిపారు.

By:  Sivaji Kontham   |   16 March 2026 10:07 AM IST
ఉస్తాద్ ప్రీ-రిలీజ్: క‌ష్టంలో ఉన్న‌ప్పుడు నా దేవుడు ఆదుకున్నాడు
X

స‌క్సెస్ లో లేన‌ప్పుడు.. సినిమా చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మైన‌ప్పుడు ఏ దర్శకుడైనా మానసిక ఒత్తిడికి లోనవ్వడం సహజం. `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ సరిగ్గా ఇలాంటి ఎమోషనల్ గ్లిచ్‌నే షేర్ చేసారు. తాను కష్టాల్లో ఉండి.. మాన‌సికంగా కుంగిపోయి ఉన్న సమయంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనకు దేవుడిలా అండగా నిలిచారని చెబుతూ హరీష్ శంకర్ వేదికపై ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.

ముఖ్యంగా కోవిడ్ సమయంలో నెలకొన్న అనిశ్చితి వల్ల తాను మానసిక వేదనను అనుభవించానని హరీష్ వెల్లడించారు. ఆ క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పిలిచి షూటింగ్ ప్లాన్ చేసుకోమని ధైర్యం చెప్పడం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. అప్పటి నుండి ఎంతో కసితో ఈ సినిమా చేశామని.. పవన్ స్వయంగా పరుగెత్తుతూ చిత్ర యూనిట్ మొత్తాన్ని పరుగెత్తించారని ఆయన గుర్తుచేసుకున్నారు.

గతంలో `గబ్బర్ సింగ్` సినిమాలో `కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు` అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ డైలాగ్‌ను హరీష్ మార్చుకున్నారు. ``కమిట్ మెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటుంది.. ఆ కటౌట్‌ను మనందరం గుండెల్లో పెట్టుకున్నాం`` అని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తన గుండె లోపల- బయట.. తన గుండె ధైర్యం అంతా పవన్ కళ్యాణేనని హరీష్ శంకర్ ఎంతో ఇష్టంగా చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ పనితీరు గురించి మాట్లాడుతూ.. ఆయన పగలు ప్రజాసేవలో ఉంటూనే.. రాత్రిళ్ళు సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని హరీష్ తెలిపారు. సామాజిక బాధ్య‌త‌తో పాటు, సినిమా విష‌యంలో అంకితభావాన్ని సమంగా పాటిస్తూ పవన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారని కొనియాడారు. మార్చి 19న థియేటర్లలో `ఉస్తాద్ ఉగాది`ని జరుపుకుందామని అభిమానులకు పిలుపునిచ్చారు.

సినిమాలో సాంకేతిక నిపుణుల గురించి ప్రస్తావిస్తూ.. తెర మీద హీరో పవన్ కళ్యాణ్ అయితే.. తెర వెనుక హీరో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అని హరీష్ ప్రశంసించారు. డిఎస్పి అద్భుతమైన పాటలు అందించగా, థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే పంపిణీదారులు, థియేటర్ యజమానుల కోరిక మేరకే ఈ సినిమాను ఉగాది కానుకగా ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ సినిమాలో ఇతర నటీనటుల గురించి చెబుతూ.. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్ వంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషించారని హరీష్ పేర్కొన్నారు. హీరోయిన్ శ్రీలీల అనగానే అందరికీ డ్యాన్స్‌లే గుర్తుకొస్తాయి కానీ.. ఈ సినిమాలో త‌న‌ నటన గురించి అందరూ మాట్లాడుకుంటారని చెప్పారు. ఇక అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ గారి సిగ్నేచర్ డ్యాన్స్‌లు ఈ సినిమాలో కనువిందు చేస్తాయని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ లో జరిగిన ఈ ఈవెంట్‌తో చిత్రబృందంలో కొత్త జోష్ నెలకొంది.