13 ఏళ్ల తర్వాత కూడా తగ్గని జోరు..
ఒక రాయి శిల్పంగా మారాలి అంటే సరైన వ్యక్తి చేతిలోనే పడాలి అలాగే ఒక సెలబ్రిటీ స్టార్ హీరోగా మారాలి అంటే సరైన డైరెక్టర్ చేతిలోనే పడాలి.
By: Madhu Reddy | 13 Dec 2025 2:14 PM ISTఒక రాయి శిల్పంగా మారాలి అంటే సరైన వ్యక్తి చేతిలోనే పడాలి అలాగే ఒక సెలబ్రిటీ స్టార్ హీరోగా మారాలి అంటే సరైన డైరెక్టర్ చేతిలోనే పడాలి. అలా సరైన కాంబినేషన్ కుదిరినప్పుడే తెరపై ఊహించని రికార్డులు క్రియేట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ కి సరికొత్త పండగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. అందుకే అలాంటి కాంబినేషన్ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ లలో... అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్.
నిజానికి 2012లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇండస్ట్రీకి సరికొత్త ట్రెండు క్రియేట్ చేసింది. అప్పటివరకు సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కే కాదు ఐరన్ లెగ్ అనిపించుకున్న శృతిహాసన్ కి కూడా ఈ సినిమా వారి కెరియర్ తలరాతలను పూర్తిగా మార్చేసింది. తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ లోని మాస్ హై ఎనర్జిటిక్ వాల్యూస్ ను తెరపై చూపించడంలో హరీష్ శంకర్ సూపర్ హిట్ అయిపోయారు.
అలాంటి ఈ కాంబినేషన్ మళ్ళీ 13 ఏళ్ల తర్వాత తెరపైకి రాబోతోందని తెలిసి అభిమానులు ఎప్పటినుంచో ఎగ్జైట్ అవుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉండగా.. పవన్ కళ్యాణ్ ఒకవైపు హరిహర వీరమల్లు, ఓ జి సినిమాల షూటింగ్లో బిజీగా ఉండడం.. మరొకవైపు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపడుతూ తీరిక లేకపోవడం వల్లే ఈ సినిమాకు టైమింగ్స్ కేటాయించలేదు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా కోసం తన డేట్స్ కేటాయించడంతో త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
అందులో భాగంగానే తాజాగా దేక్ లెంగే సాలా ఫస్ట్ సింగిల్ ను ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఒక చిన్న ప్రోమోతో అనౌన్స్ చేశారు. భాస్కరభట్ల స్వరపరిచిన పాటను హరిప్రియ , విశాల్ దద్లాని ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. అలా తాజాగా విడుదల చేసిన సాంగ్ ప్రోమోలో పవన్ కళ్యాణ్ స్టెప్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. చూసే ఆడియన్స్ లో సరికొత్త జోష్ నింపుతున్నాయి.
సాధారణంగా పవన్ కళ్యాణ్ చిత్రాలు చూస్తే ఆయన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఒక మోస్తారు గానే ఉంటుంది. కానీ హరీష్ శంకర్ సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ లోని డాన్సర్ ను హరీష్ శంకర్ బయటకు తీయడంలో మొదటి పాత్ర వహిస్తారు. అలా గబ్బర్ సింగ్ తరువాత మళ్ళీ 13 ఏళ్లు గ్యాప్ తీసుకొని ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఇన్నేళ్లు గ్యాప్ వచ్చిన కూడా పవన్ కళ్యాణ్ లో ఏ మాత్రం తేడా లేదు అని.. ఆయనలో మరో సరికొత్త జోష్ కనిపిస్తోందని ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. 54 ఏళ్ల వయసులో కూడా హై ఎనర్జీ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అంటే ఇక పవన్ కళ్యాణ్ లోని నటుడిని హరీష్ శంకర్ ఏ విధంగా బయటకు తీశారో అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు సాయంత్రం రాబోయే ఈ పాటకి.. పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ కి.. ఫ్యాన్స్ ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి.
