ఆయనతో వర్క్ చేయాలని దేవుణ్ని కోరుకున్నా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 14 Dec 2025 2:34 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మళ్లీ చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి మేకర్స్ రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. దేఖ్ లేంగే సాలా అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయగా ఆ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాకు సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ను తన పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. ఈ ఈవెంట్ లో రెండే కటౌట్లు ఉన్నాయని, ఒకటి పవర్ స్టార్, రెండోది రాక్ స్టార్ కటౌట్ అని చెప్పారు.
ఎప్పుడో ఓసారే ఆ ఛాన్స్ వస్తుంది
శ్రేయాస్ మీడియా వాళ్లు ఫోన్ చేసి నిర్మాతల ఫోటోలు పంపిస్తే కటౌట్లు పెడతామని చెప్తే అక్కడ పవర్ స్టార్, రాక్ స్టార్ కటౌట్లు మాత్రమే ఉండాలని వాళ్లకి క్లియర్ గా చెప్పానని, దేవీ శ్రీ ప్రసాద్ మీద తమకున్న గౌరవం, ప్రేమ చూపించుకునే ఛాన్స్ ఎప్పుడో ఓసారే వస్తుందని, అందుకే ఈ ఛాన్స్ ను వదులుకోలేదని చెప్పిన హరీష్ శంకర్, దేవీ శ్రీ ఆనందం మూవీ చూసి బయటికొచ్చాక లైఫ్ లో ఎప్పుడైనా సరే ఈ మ్యూజిక్ డైరెక్టర్ తో పని చేస్తే చాలు దేవుడా అని కోరుకున్నానని, దానికి దేవుడు ఒకసారి కాదు, మూడుసార్లు ఛాన్స్ ఇచ్చాడని, ఇంకో మూడు సార్లు, ఇంకో మూడు సార్లు కూడా ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
దేవీ శ్రీ ప్రసాద్.. ఆ పేరే ఒక ఎమోషన్
నా సినిమాకు వర్క్ చేస్తున్నారని ఆయన్ని పొగడటం లేదని, డీఎస్పీ అంటే తనకు జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కాదని, ఆ పేరు తనకొక ఎమోషన్ అని, అప్పటివరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న ఓ వ్యక్తిని, తన మ్యూజిక్ తో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ ను చేసే సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ అని, ఈ విషయం చాలా సార్లు ఆయనతో చెప్పానని, దానికి తనదేం లేదని, డైరెక్టర్ ని బట్టే మ్యూజిక్ వస్తుందని తన కష్టాన్ని కూడా తమ ఖాతాల్లోకి అవలీలగా వేసేసి అలా చిరునవ్వుతో వెళ్లిపోతుంటారని, అందుకే తనకు డీఎస్పీ అంటే ఇష్టం, ప్రాణమని హరీష్ శంకర్ చెప్పారు.
