మహేష్ ఫ్యాన్స్ కి డైరెక్టర్ శంకర్ క్షమాపణ.. అసలేమైందంటే?
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. చిన్న మాట దొరికినా చాలు, రచ్చ రంబోలా అయిపోతుంది.
By: Madhu Reddy | 11 March 2026 12:44 PM ISTసోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. చిన్న మాట దొరికినా చాలు, రచ్చ రంబోలా అయిపోతుంది. తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ఒక చిన్న ట్వీట్ రిప్లై.. పవన్ కల్యాణ్ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధానికే దారితీసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డుల విషయంలో జరిగిన ఈ పొరపాట్లు, ఆ తర్వాత హరీష్ శంకర్ ఇచ్చిన సుదీర్ఘ వివరణ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి ..
అసలేం జరిగింది? వివాదానికి కారణం ఏంటి?:
హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజైన టీజర్, సాంగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక పవన్ అభిమాని ట్విట్టర్‌లో.. "ఈ సినిమాతో BoB (మహేష్ బాబు) బాక్సాఫీస్ రికార్డులు లేచిపోవాలి" అని ట్వీట్ చేశాడు. దానికి హరీష్ శంకర్ చాలా క్యాజువల్‌గా 'తథాస్తు' అని రిప్లై ఇచ్చారు. అంతే, మహేష్ బాబు అభిమానులు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. తమ హీరో రికార్డులను తక్కువ చేస్తారా అంటూ హరీష్‌పై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. వివాదం ముదరడంతో హరీష్ శంకర్ వెంటనే స్పందించి ఆ ట్వీట్ డిలీట్ చేశారు.
హరీష్ శంకర్ వివరణ - నాకు ఆ ఉద్దేశం లేదు:
ఈ గొడవపై హరీష్ శంకర్ క్లారిటీ ఇస్తూ ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. ఆ రోజు సెన్సార్ బోర్డు మీటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్లతో తాను చాలా బిజీగా ఉన్నానని.. ఆ హడావిడిలో నెటిజన్ అడిగిన ట్వీట్‌ను సగం మాత్రమే చదివి రిప్లై ఇచ్చానని చెప్పుకొచ్చారు. తన టీమ్ అలర్ట్ చేయగానే తప్పు తెలుసుకుని నిమిషంలోనే డిలీట్ చేశానని అన్నారు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకు ఎంతో గౌరవమని, ఆయన పుట్టినరోజున తాను చేసిన పాత ట్వీట్లు చూస్తే ఆ ప్రేమ అర్థమవుతుందని గుర్తు చేశారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు అస్సలు లేదని ఆయన స్పష్టం చేశారు.
క్షమాపణలు - సినిమాకి అందరి మద్దతు కావాలి:
ఇక ఒక సినిమా రికార్డులు సృష్టించాలంటే అందరు హీరోల అభిమానుల మద్దతు అవసరం. సినిమా రిలీజ్‌కు మరో పది రోజులే ఉన్న టైంలో కావాలని ఇలాంటి పనులు చేసేంత అవివేకిని కాను అంటూ హరీష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక పొరపాటున ఎవరి మనసైనా నొచ్చుకుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని హరీష్ శంకర్ తెలిపారు. ఈ వివరణతోనైనా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఫ్యాన్ వార్ సర్దుమణిగి, వివాదం సద్దుమణుగుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. ఏ వివాదాల నడుమ మార్చి 20న థియేటర్లలోకి రాబోతున్న 'ఉస్తాద్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
