దేవరకొండకు మద్ధతుగా ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన హరీష్ శంకర్
రణబాలి గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి విజయ్ దేవరకొండ శ్రమ అసాధారణమైనదని కొనియాడారు.
By: Sivaji Kontham | 13 Oct 2026 11:16 PM ISTటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ `రణబాలి`. అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన గ్రాండ్ ప్రీ-ఈవెంట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు, పంచ్ డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈవెంట్‌కు కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఓపెనింగ్‌లో బ్యాటింగ్ చేయాల్సిన బ్యాట్స్‌మన్‌ను చివరిలో పంపించినట్లు తన పరిస్థితి ఉందంటూ చేసిన సరదా కామెంట్స్‌తో అందరినీ నవ్వులు పూయించారు.
రణబాలి గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి విజయ్ దేవరకొండ శ్రమ అసాధారణమైనదని కొనియాడారు. ముఖ్యంగా ఈ చిత్రం కోసం విజయ్ ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకోవడం అతడి అంకితభావానికి నిదర్శనమని.. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ సినిమా కోసం గొప్పగా పరిశోధించారని.. అతడు ఎంతటి ప్యాషన్ చూపించారో తనకు తెలుసని చెప్పారు. ఒక అద్భుతమైన సినిమా తెరకెక్కడానికి నటీనటులు, దర్శకులు ఎంతటి శ్రమకోర్చి పని చేస్తారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండపై జరిగే ఆన్‌లైన్ ట్రోల్స్, విమర్శలపై హరీష్ శంకర్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో కొంతమంది విజయ్ మాట్లాడే శరీరభాషను- శైలిని విమర్శించవచ్చని.. కానీ సినిమా కోసం అతడు పడే కష్టాన్ని, పెట్టే ఎఫర్ట్‌ను మాత్రం ఎవరూ ఎప్పటికీ ట్రోల్ చేయలేరని స్పష్టం చేశారు. విజయ్ సిన్సియారిటీని, అతడి కష్టాన్ని ఎవరూ కాదనలేరని చెబుతూ.. అతడిపై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు.
సినీ ఇండస్ట్రీలో విజయాలు, అపజయాలు అనేవి సర్వసాధారణమని హరీష్ శంకర్ కుండబద్దలు కొట్టారు. ఒక సినిమా ఆడకపోతే మరో సినిమా చేయడం మానేయమని.. అలాగే బ్లాక్‌బస్టర్ అయితే ప్రయత్నాలు ఆపేయమని... చెబుతూ సినిమాపై నిజమైన ప్రేమతో ప్రయాణించే వాళ్లకు ఆ కళే సరైన న్యాయం చేస్తుందని తెలిపారు. తాను తెరకెక్కించిన `గద్దలకొండ గణేష్` సినిమాలో రాసినట్లుగా.. ``సినిమా మనిషిని సినిమానే నిలబెడుతుంది`` అనే సత్యాన్ని ఈ సందర్భంగా ఆయన మరోసారి గుర్తుచేశారు.
విజయ్ దేవరకొండతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. `పెళ్లిచూపులు` సినిమా రోజుల నుంచే ఇరువురియ నడుమా స్నేహం కుదిరిందని.. రెగ్యులర్‌గా కలుసుకునేవాళ్లమని..అతడితో అనుబంధం, పాజిటివ్ ఎనర్జీ తనకెంతో ఇష్టమని హరీష్ తెలిపారు. కెరీర్ ఆరంభంలోనే ఇంత భారీ స్పాన్ ఉన్న కథను ఎంచుకుని...అందులో విజయ్ లాంటి హీరోను ఊహించడం మామూలు విషయం కాదంటూ దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. రాహుల్‌కు ఈ సినిమాతో పెద్ద సక్సెస్ రావాలని ఆకాంక్షించిన ఆయన.. ఈ చిత్రానికి సంగీతం అందించిన అజయ్-అతుల్ తన తొలి చిత్రం `షాక్`కు కూడా మ్యూజిక్ అందించారని గుర్తుచేసుకుంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
