ప్రకాష్ రాజ్ తో పవన్.. హరీష్ శంకర్ క్లారిటీ ఇలా..
అందులో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు లేదా సెటైర్లు ఉండవని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశారు.
By: M Prashanth | 23 Feb 2026 9:08 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని, అందులో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు లేదా సెటైర్లు ఉండవని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశారు. రీసెంట్ గా సినిమా నుంచి విడుదలైన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో వస్తున్న అనుమానాలపై ఆయన వీడియో మెసేజ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. అభిమానులు, సినీ ప్రియులు ఆ పాటకు ఎడిట్స్, రీల్స్ చేసి పంపిస్తుండటంతో ఆనందంగా ఉందని హరీశ్ శంకర్ చెప్పారు. పాట రిథమ్ మొదలయ్యాకే ఒక ప్రత్యేకమైన ట్రాన్స్ లోకి వెళ్లిపోయామని, అందుకే దీనిని ట్రాన్స్ బస్టర్ అని పిలవొచ్చని సరదాగా వ్యాఖ్యానించారు.
అయితే, ఆ పాటలోని లిరిక్స్, పవన్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే స్టైల్ కారణంగా సినిమాలో ప్రస్తుత రాజకీయాలపై పరోక్ష వ్యాఖ్యలు ఉంటాయా? అనే డౌట్స్ వ్యక్తమయ్యాయి. దీనిపై హరీశ్ శంకర్ రెస్పాండ్ అవుతూ.. మొదటి రోజు నుంచే పవన్ సినిమా వేరు, రాజకీయాలు వేరు అని స్పష్టంగా చెబుతారని తెలిపారు. అదే ఫార్ములాను తాము కూడా పాటిస్తున్నామని చెప్పారు.
సైద్ధాంతిక విభేదాలు ఉన్నా, వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయరని ఆయన గుర్తుచేశారు. గతంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తో వకీల్ సాబ్, ఓజీ చిత్రాల్లో కలిసి నటించారని, ఇది పవన్ వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. తన పాలసీ కోసం పోరాడుతారని, పర్సనల్ గా కాదని చెప్పారు. రాజకీయాల పేరుతో ఎవరినీ ఇబ్బంది పెట్టే డైలాగ్స్ లేదా రిఫరెన్స్లు సినిమాలో ఉండవని స్పష్టం చేశారు.
"సినిమా లక్ష్యం వినోదం పంచడం. ప్రేక్షకులు నవ్వుతూ థియేటర్ నుంచి బయటికి రావాలి. ఎవరికైనా నొప్పించే మాటలు, సెటైర్లు పెడితే ఆ ఉద్దేశ్యం దెబ్బతింటుంది. అందుకే అలాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటున్నాం" అని హరీశ్ శంకర్ తెలిపారు. హీరోను ఎలివేట్ చేసే డైలాగ్స్ మాత్రమే ఉంటాయని, మరెవరినీ తగ్గించే ప్రయత్నం చేయబోమన్నారు.
