ఉస్తాద్ పవన్ విశ్వరూపం చూస్తారు: హరీష్ శంకర్
నిర్మాతల గురించి ప్రస్తావిస్తూ హరీష్ శంకర్ ఎమోషనల్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ - రవిశంకర్ ఈ సినిమా కోసం ఎంతగానో సహకరించారని చెప్పారు.
By: Sivaji Kontham | 16 March 2026 10:00 AM ISTహైదరాబాద్‌లో జరిగిన `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ప్రసంగం అత్యంత భావోద్వేగ భరితంగా సాగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధాన్ని, ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని ఆయన వివరిస్తూ అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన బిజీ రాజకీయ షెడ్యూల్‌లో కూడా సినిమా కోసం కేటాయించిన సమయం గురించి హరీష్ చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
పవన్ కళ్యాణ్ గారు పగలు 12 గంటలు ప్రజల కోసం పనిచేసి.. మళ్లీ షూటింగ్ కోసం రాత్రి 2 గంటల వరకు కష్టపడ్డారని వెల్లడించారు. రోజుకు కేవలం మూడు, నాలుగు గంటల సమయం మాత్రమే దొరికినా.. ఆ తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ అద్భుతమైన ఎనర్జీని చూపించారని కొనియాడారు. అంతటి బిజీ షెడ్యూల్‌లో కూడా సినిమాను పూర్తి చేయడానికి పవన్ చూపించిన నిబద్ధతకు హరీష్ శిరస్సు వంచి నమస్కరించారు.
నిర్మాతల గురించి ప్రస్తావిస్తూ హరీష్ శంకర్ ఎమోషనల్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ - రవిశంకర్ ఈ సినిమా కోసం ఎంతగానో సహకరించారని చెప్పారు. నేను ఏ రోజు ఏది అడిగినా.. అది ఎంత అవుతుంది? అని అడిగారు తప్ప.. ఎందుకు కావాలి? అని ఎప్పుడూ ప్రశ్నించలేదు అని వారిపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. క్వాలిటీ విషయంలో నిర్మాతలు చూపించిన పట్టుదల వల్లే ఈ స్థాయిలో సినిమాను తీసుకురాగలిగామని ఆయన తెలిపారు.
ఈ సినిమాలో `ఎత్తరా కాలర్` సాంగ్ కోసం వేసిన సెట్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సెట్ అని హరీష్ గర్వంగా చెప్పారు. ఆ సెట్ నిర్మాణం కోసం నిర్మాతలు పెట్టిన ఖర్చు చూపించిన చొరవ అసాధారణమని పేర్కొన్నారు. పవర్ స్టార్ పవర్‌ను వెండితెరపై ఎలా చూపించాలో తనకు తెలుసని, `గబ్బర్ సింగ్` కేవలం ఆరంభం మాత్రమేనని `ఉస్తాద్ భగత్ సింగ్`తో బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ విశ్వరూపం చూపిస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
ఒక వీరాభిమానిగా తాను పవన్ కళ్యాణ్‌ను ఎలా చూడాలనుకుంటున్నానో అలాగే ఈ సినిమాను తీర్చిదిద్దానని హరీష్ శంకర్ భావోద్వేగంతో చెప్పారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక ఆయనను మిస్ అవుతున్నామని బాధపడే అభిమానులకు ఈ సినిమా ఒక గొప్ప సమాధానంగా ఉంటుందని చెప్పారు. ప్రతి సీన్ లోనూ పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్, డైలాగ్స్ అదిరిపోయేలా ప్లాన్ చేశానని ఆయన వెల్లడించారు.
చివరగా పవన్ కళ్యాణ్ గారికి నేను దర్శకుడిని మాత్రమే కాదు.. ఆయన భక్తుడిని అని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈనెల 19న విడుదలకు వస్తున్న ఈ సినిమా కేవలం రికార్డులు తిరగరాయడం మాత్రమే కాదు.. పవర్ స్టార్ స్టామినా ఏంటో ప్రపంచానికి మరోసారి చూపిస్తుందని హరీష్ శంకర్ స్పష్టం చేశారు. అతడి మాటలు వింటుంటే `ఉస్తాద్ భగత్ సింగ్` పై అంచనాలు మరో మెట్టు పైకి చేరాయి.
