Begin typing your search above and press return to search.

వీరమల్లు-2.. అలా చూస్తామా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో.. క్రిష్ జాగర్లమూడి లాంటి అభిరుచి ఉన్న దర్శకుడు.

By:  Garuda Media   |   4 Sept 2025 2:00 PM IST
వీరమల్లు-2.. అలా చూస్తామా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో.. క్రిష్ జాగర్లమూడి లాంటి అభిరుచి ఉన్న దర్శకుడు. ఏఎం రత్నం లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్.. ఈ కలయికలో సినిమా అన్నపుడు తెలుగు ప్రేక్షకులు ఎంత ఎగ్జైట్ అయ్యారో. కానీ భారీ అంచనాల మధ్య మొదలై ఒక దశ వరకు మంచి బజ్‌తో సాగిన ‘హరిహర వీరమల్లు’ సినిమా.. రిలీజ్ కావడమే కష్టం అనుకునే స్థితికి చేరుకుంది. చివరికి అతి కష్టం మీద సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చినా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కలేదు.

పవన్ కెరీర్లోనే నిర్మాత, బయ్యర్లకు అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాగా ఇది నిలిచింది. ఐతే క్రిష్‌యే ఈ సినిమాను పూర్తి చేసి ఉంటే.. మొదట అనుకున్న కథతోనే మూవీ తెరకెక్కి ఉంటే ఫలితం వేరుగా ఉండేదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. తాజాగా క్రిష్ మాటల్ని బట్టి చూస్తే ఆ అభిప్రాయం మరింత బలపడింది. ఢిల్లీలో ఔరంగజేబు దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని దోచుకురావడం ‘వీరమల్లు’ సినిమాలో సెకండాఫ్ అయితే.. అదంతా రెండో భాగం కోసం పక్కన పెట్టి మధ్యలో సనాతన ధర్మ పరిరక్షకుడిగా హీరోను చూపిస్తూ వేరే ఎపిసోడ్లు పెట్టి కథను పక్కదోవ పట్టించేశాడు జ్యోతికృష్ణ. ‘ఘాటి’ ప్రమోషన్లలో భాగంగా క్రిష్.. ‘వీరమల్లు’ కోసం తాను షూట్ చేసిన 40 నిమిషాల ఎపిసోడ్‌ను రెండో భాగం కోసం పక్కన పెట్టిన విషయాన్ని వెల్లడించాడు. ఆ ఎపిసోడ్ గురించి క్రిష్ చెప్పిన మాటలు వింటే పవన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వచ్చాయి.

నిజంగా ఈ ప్రకారమే కథ నడిచి ఉంటే.. ఆ సీన్లు సినిమాలో ఉండుంటే రిజల్టే వేరుగా ఉండేదేమో. ఐతే ‘వీరమల్లు’ డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఇక రెండో పార్ట్ తీసే అవకాశాలు లేనట్లే. మరి క్రిష్ షూట్ చేసిన పెట్టిన హైలైట్ ఎపిసోడ్ సంగతేంటి అన్నది చూడాలి. అది ఏదో ఒక రూపంలో బయటికి వస్తుందని క్రిష్ అన్నాడు. అది ఎలా అన్నదే ఇప్పుడు ప్రశ్న. మరి ఆ ఎపిసోడ్లకు వేరే పేరు పెట్టి మినీ సినిమాలా ఓటీటీలో ఏమైనా రిలీజ్ చేస్తారా.. లేక యూట్యూబ్‌లో వదులుతారా.. అన్నది ఆసక్తికరం. ప్రేక్షకుల్లో కచ్చితంగా దీని మీద ఆసక్తి ఉంటుంది కాబట్టి.. ఆ కంటెంట్ అంతా పక్కన పడేయకుండా ఏదో ఒక రూపంలో రిలీజ్ చేసి నిర్మాత రత్నం ఆ రకంగా అయినా నష్టాలను కొంతమేర భర్తీ చేసుకుంటే మంచిదే.