హనుమాన్ తో రాలేదు.. అందుకే మిరాయ్ కి కసిగా చేశా - హరి
రివ్యూలు , ప్రేక్షకులు ఇస్తున్న ఫీడ్ బ్యాక్ లో ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ కంటే ముందు హరి గౌర మ్యూజిక్ ను మెచ్చుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు సంగీతం ఎంత బాగా కంపోజ్ చేశాడో.
By: M Prashanth | 16 Sept 2025 8:03 PM ISTటాలీవుడ్ లో హరి గౌర పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. సెప్టెంబర్ 12న రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న మిరాయ్ సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టరే హరి గౌర. ఈ సినిమా బీజీఎమ్, పాటలకు హరి ప్రాణం పెట్టేశాడు. అందుకే సినిమా సక్సెస్ మీట్ లో నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు హరినే హీరో అని ప్రశంసించారు.
అంతేకాదు ఇదే మీట్ లో హరి గౌరకు, మనోజ్ పాదాభివందనం కూడా చేశారు. రివ్యూలు , ప్రేక్షకులు ఇస్తున్న ఫీడ్ బ్యాక్ లో ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ కంటే ముందు హరి గౌర మ్యూజిక్ ను మెచ్చుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు సంగీతం ఎంత బాగా కంపోజ్ చేశాడో. అయితే మనోజ్ మాట్లాడిన దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. థీమ్ సాంగ్స్, బీజీఎమ్ స్కోర్ తో ఈ సినిమాకు హరి ఇచ్చిన ఎలివేషన్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా.. తక్కువే అవుతుంది.
అయితే ఈ సినిమాకు అతడు అంత కసిగా పని చేయడానికి కారణం లేకపోలేదని హరి చెప్పాడు. ఇంత కష్టపడడానికి కారణం హనుమాన్ సినిమానేనని అన్నాడు. ఆ సినిమాకు తాను ఎంతో కష్టపడి సంగీతం అందిస్తే.. తనకు రావాల్సిన క్రెడిట్ రాలేదట. అందుకే రెట్టించిన కసితోమిరాయ్ సినిమాకు పని చేసినట్లు హరి చెప్పాడు.
హనుమాన్ సినిమా రన్ టైమ్ 2. 38 గంటలైతే, దాదాపు రెండున్నర గంటల నిడివికి తానే సంగీతం అందించానని అన్నాడు. మిగిలిన సమయంలో ఇంకో ఇద్దరు కేవలం రెండు పాటలే ఇచ్చారని.. అయినా సినిమాకు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు అని ప్రచారం రావడంతో తనకు రావాల్సిన క్రెడిట్ వేరే వాళ్లకు పంచడం ఆవేదన కలిగించిందని అతడు తెలిపాడు. అందుకే ఈసారి మళ్లీ అలాంటిది రిపీట్ అవ్వకూడదని.. మిరాయ్ కు తానొక్కడే కంప్లీట్ గా వర్క్ చేశాడు.
రెట్టింపు కసితో పని చేసి సత్సఫలితం సాధించాడు. దీంతో ఇప్పుడు దీనికి రావాల్సిన క్రెడిడ్ దక్కుతుందని అన్నాడు. దీని పట్ల ఆనందంగా ఉన్నట్లు హరి తెలిపాడు. మిరాయ్ సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా బ్యానర్లోనే హరి ఇంకో నాలుగు చిత్రాలకు పని చేస్తుండడం విశేషం. జాంబిరెడ్డి- 2తో పాటు పినాక, కాలచక్ర, రణమండల ఈ ఆ నాలుగు సినిమాలకు పని చేస్తున్నట్లు వెల్లడించాడు.
