'పుష్ప' రిలీజై ఇన్నేళ్లయినా అదే ఫ్యానిజం..!
`పుష్ప` మానియా భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇంకా తగ్గడం లేదని నిరూపణ అవుతోంది.
By: Sivaji Kontham | 18 Feb 2026 9:00 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప రిలీజై నాలుగేళ్లయింది. ఆ తర్వాత పుష్ప 2 కూడా వచ్చి 1000 కోట్లు పైగా నెట్ వసూలు చేసింది. బన్ని పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. అయితే ఈ ఫ్రాంఛైజీలో అల్లు అర్జున్ నటన, డ్యాన్సులకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బన్నీని విపరీతంగా అభిమానించారు.
అయినా పుష్పరాజ్ ప్రభావం అలాంటిది.. ఆ చిత్రంలో బన్ని నటనకు ఫిదా కాని వాళ్లే లేరు. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్య తన ఫ్యానిజాన్ని మరోసారి బయటపెట్టాడు. నేను పుష్పకు ఫ్యాన్ అయిపోయానని అతడు అన్నాడు. హార్థిక్ ఇంతకుముందు సినిమా చూసాక `శ్రీవల్లి` హుక్ స్టెప్ వేసాడు. ఆ సమయంలో తన భామతో కలిసి స్టెప్ వేసిన విషయాన్ని ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకున్నాడు. అయితే అల్లు అర్జున్ కి కేవలం హార్థిక్ మాత్రమే కాదు.. చాలా మంది ఇతర క్రికెటర్లు ఫ్యాన్స్ అయ్యారు. షారూఖ్ ఖాన్ అంతటి అగ్ర నటుడు ప్రత్యేకించి అల్లు అర్జున్ ని అభినందించారు.. బన్నీకి సన్నిహితంగా మారారు.
`పుష్ప` మానియా భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇంకా తగ్గడం లేదని నిరూపణ అవుతోంది. అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఆయన క్యారెక్టరైజేషన్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, తాను బన్నికి పెద్ద అభిమానిని అని హార్దిక్ ఇదివరకే గర్వంగా చెప్పుకున్నారు. కేవలం మొదటి భాగమే కాదు `పుష్ప 2: ది రూల్` లో కూడా అల్లు అర్జున్ నటన అద్భుతమని హార్దిక్ కొనియాడారు. షారూఖ్ ఖాన్ కూడా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ గెలుచుకున్నప్పుడు .. `పుష్ప 2` సక్సెస్ సమయంలో ప్రత్యేకంగా అభినందించారు. అల్లు అర్జున్ తన శైలితో హిందీ బెల్ట్‌లో ఒక కొత్త మార్కెట్‌ను సృష్టించారని షారూఖ్ ప్రశంసించారు.
అల్లు అర్జున్ నెక్స్ట్ దండయాత్ర..
అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. అతడి తదుపరి ప్రాజెక్టులు ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాయి. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ LCUలో భాగంగా అల్లు అర్జున్‌తో భారీ యాక్షన్ సినిమాను ప్లాన్ చేస్తున్నారని, ఇది హాలీవుడ్ స్థాయిలో ఉండబోతోందని కూడా కథనాలొస్తున్నాయి. పుష్ప అంటే కేవలం ఒక సినిమా కాదు.. అదొక `బ్రాండ్` అని పదే పదే ప్రూవ్ అవుతోంది.
