ఆమెను విడిచి క్షణమైనా ఉండలేని హార్థిక్
ఇక ఇదే ఈవెంట్ లో హార్థిక్ పై ఒక దురభిమాని దురుసు కామెంట్ కూడా మీడియా హెడ్ లైన్ లోకి వచ్చింది.
By: Sivaji Kontham | 26 Dec 2025 9:34 AM ISTటీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిక్ నుంచి విడిపోయిన తర్వాత అతడిపై చాలా పుకార్లు వచ్చాయి. ప్రముఖ బ్రిటీష్ మోడల్ తో డేట్ చేసాడని, బాలీవుడ్ కథానాయికతో సీక్రెట్ గా డేటింగ్ ప్రారంభించాడని రకరకాలుగా గుసగుసలు వినిపించాయి. మధ్యలో ఈ డేట్ లు అన్నీ బ్రేకప్ అయ్యాయని కూడా కథనాలొచ్చాయి.
కానీ ఇటీవలి కాలంలో అతడు తన స్నేహితురాలు మహీక శర్మతో నిరంతరం పబ్లిక్ లో సన్నిహితంగా కనిపిస్తున్నాడు. ఇంతకుముందు జిమ్‌లో మహీకను ఎత్తుకుని కనిపించడంతో వారి మధ్య సాన్నిహిత్యం శ్రుతిమించిందని నెటిజనులు కామెంట్ చేసారు. ఫిట్నెస్ ఫ్రీక్ మహీక శర్మతో హార్థిక్ డేటింగ్ లైఫ్ నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లోకి వస్తోంది.
ఇప్పుడు మరోసారి తన గాళ్ ఫ్రెండ్ మహీకతో పార్టీ నుంచి వెళుతూ కనిపించాడు. అతడు క్రిస్మస్ ముందు రోజు రాత్రి ఒక రెస్టారెంట్ బయట తన స్నేహితురాలు మహీకా శర్మతో కలిసి కనిపించాడు. ఆ సమయంలో హార్థిక్ - మహీకను అభిమానులు వెంబడించారు. ముందుగా హార్దిక్ మహీకాను కారులో కూర్చోబెట్టి ఆ తర్వాత కొంతమంది అభిమానులకు తనతో సెల్ఫీలు తీసుకునేందుకు అనుమతించాడు. ఆ సమయంలో మహీకకు పూర్తి స్థాయి అంగరక్షకుడిగా అతడు వ్యవహరించిన తీరు నెటిజనుల దృష్టిని ఆకర్షించింది. అతడు ఆమెను విడిచి క్షణమైనా ఉండలేని స్థితిలో ఉన్నాడు! అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఇక ఇదే ఈవెంట్ లో హార్థిక్ పై ఒక దురభిమాని దురుసు కామెంట్ కూడా మీడియా హెడ్ లైన్ లోకి వచ్చింది. ప్రియురాలితో కలిసి హార్దిక్ రెస్టారెంట్ నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా అభిమానులు మరిన్ని ఫోటోల కోసం అభ్యర్థిస్తూనే ఉన్నారు. అయితే హార్థిక్ వారిని వారిస్తూ..``ఇప్పటికే తీసుకున్నారు కదా.. ఇంకా ఎన్ని కావాలి?`` అని ప్రశ్నించాడు. సరిగ్గా అప్పుడే ఒక అభిమాని హద్దులు దాటి ``నరకానికి పో`` అని కామెంట్ చేసాడు. కానీ హార్దిక్ దానిని చాలా పరిణతితో హ్యాండిల్ చేసాడు. అతడి వ్యాఖ్యపై స్పందించలేదు.
హార్థిక్ ఓవైపు ప్రియురాలితో షికార్లు చేస్తున్నా ఆటలో ఎక్కడా తగ్గడం లేదు. మైదానంలో బౌండరీలతో చెలరేగుతున్నాడు. సిక్సర్లు, ఫోర్లు బాదడంలో రికార్డులు తిరగరాస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా దూకుడైన ఆటను ప్రదర్శించాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఈ సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకోగా హార్థిక్ రెండు మ్యాచుల్లో చెలరేగి ఆడాడు. ఆ రెండు మ్యాచ్ లకు అతడి స్కోర్ చాలా కీలకమైంది. సిరీస్‌లోని ఐదవది అయిన చివరి మ్యాచ్‌లో హార్దిక్ టీ20ఐ క్రికెట్‌లో భారతదేశం తరపున రెండవ వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌పై 12 బంతుల్లో అర్ధ సెంచరీతో రికార్డు సృష్టించిన యువరాజ్ సింగ్ కంటే అతను కేవలం నాలుగు బంతులు మాత్రమే ఎక్కువ తీసుకున్నాడు. ఈ సిరీస్ లో అతడి స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది.
