Begin typing your search above and press return to search.

గ‌ర్ల్ ఫ్రెండ్‌తో పాండ్య షికార్.. కార్ ఖ‌రీదు తెలిస్తే షాక‌వుతారు!

ఈ కొత్త ఫెరారీ 12 సిలిండ్రి కారు విశేషాల్లోకి వెళితే.. ఇది ఫెరారీ సంస్థ నుండి వచ్చిన అత్యంత శక్తివంతమైన మోడల్స్‌లో ఒకటి.

By:  Sivaji Kontham   |   15 March 2026 10:24 AM IST
గ‌ర్ల్ ఫ్రెండ్‌తో పాండ్య షికార్.. కార్ ఖ‌రీదు తెలిస్తే షాక‌వుతారు!
X

భారత స్టార్ క్రికెట‌ర్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన విలాసవంతమైన జీవనశైలితో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. మైదానంలో తన దూకుడుతో అభిమానులను అలరించే పాండ్యా.. వ్యక్తిగత జీవితంలోనూ అంతే వేగంగా ఉంటారు. తాజాగా అత‌డు సుమారు 12 కోట్ల రూపాయల విలువైన సరికొత్త ఫెరారీ 12 సిలిండ్రి కారును కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ లగ్జరీ కారులో తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి ముంబై వీధుల్లో షికారు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హార్దిక్ పాండ్యాకు కార్లంటే ప్రాణం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన గ్యారేజీలో ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైన కార్లు కొలువుదీరి ఉన్నాయి. ముఖ్యంగా ఆయన వద్ద ఉన్న లంబోర్ఘిని ఉరుస్ మోడిఫైడ్ వెర్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వీటితో పాటు రేంజ్ రోవర్, మెర్సిడెస్ లాంటి మరెన్నో లగ్జరీ బ్రాండ్స్ గ్యారేజీలో ఉన్నా కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన ఫెరారీ కారు ఆయన కార్ల క‌లెక్ష‌న్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఈ కొత్త ఫెరారీ 12 సిలిండ్రి కారు విశేషాల్లోకి వెళితే.. ఇది ఫెరారీ సంస్థ నుండి వచ్చిన అత్యంత శక్తివంతమైన మోడల్స్‌లో ఒకటి. దీని పేరుకు తగ్గట్టే ఇందులో శక్తివంతమైన V12 ఇంజన్ ఉంటుంది. ఇది కేవలం 2.9 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 340 కిలోమీటర్లకు పైమాటే. అద్భుతమైన ఏరోడైనమిక్ డిజైన్, క్లాసిక్ లుక్‌తో ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే చూపరుల కళ్లు తిప్పుకోలేనంత స్టైలిష్‌గా ఉంటుంది.

సాధారణంగా ఫెరారీ కార్లు అంటేనే వేగానికి, విలాసానికి మారుపేరు. ఈ 12 సిలిండ్రి మోడల్‌లో అధునాతన టెక్నాలజీతో కూడిన ఇంటీరియర్స్ ఉంటాయి. డ్రైవర్ సౌకర్యం కోసం డిజిటల్ డిస్‌ప్లేలు, ప్రీమియం లెదర్ సీట్లు, అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంత ఖరీదైన కారును మెయింటెన్ చేయడం కూడా సామాన్యమైన విషయం కాదు, కానీ పాండ్యా వంటి గ్లోబల్ స్టార్‌కు ఇది పెద్ద విషయమేమీ కాదు.

చాలా మందికి ఈ పిచ్చి ఉంది:

క్రికెట్ ప్రపంచంలో కార్ల పిచ్చి ఉన్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వద్ద అరుదైన ఫెరారీ మోడల్స్ ఉన్నాయి. అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఫెరారీకి పెద్ద అభిమాని. అయితే హార్దిక్ కొనుగోలు చేసిన ఈ లేటెస్ట్ వెర్షన్ ఫెరారీ మాత్రం ప్రస్తుతం ఉన్న యాక్టివ్ క్రికెటర్లలో చాలా తక్కువ మంది వద్దే ఉందని చెప్పవచ్చు. విరాట్ కోహ్లీకి ఆడి అంటే ఇష్టమైతే.. పాండ్యాకు మాత్రం ఫెరారీ మరియు లంబోర్ఘిని అంటే మక్కువ ఎక్కువ.

నటి మహికా శర్మతో కలిసి ఈ కొత్త కారులో పాండ్యా చక్కర్లు కొడుతుండటంతో వారి రిలేషన్‌షిప్ గురించి కూడా నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా తన ఇష్టాఇష్టాలను నెరవేర్చుకోవడంలో పాండ్యా ఎప్పుడూ ముందుంటారని ఈ 12 కోట్ల కారు కొనుగోలు మరోసారి నిరూపించింది. ఈ లగ్జరీ రైడ్ వీడియోలు చూసిన అభిమానులు ``పాండ్యా లైఫ్ బిందాస్`` అంటూ కామెంట్స్ చేస్తున్నారు.