ప్రశాంత్ వర్మ హనుమాన్ పంచాయితీ.. ప్రొడ్యూసర్ రూ.200 కోట్ల డిమాండ్
పాన్ ఇండియా సంచలనం హనుమాన్ సృష్టించిన విజయం ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది.
By: M Prashanth | 2 Nov 2025 9:38 AM ISTపాన్ ఇండియా సంచలనం హనుమాన్ సృష్టించిన విజయం ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి (ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్) మధ్య ఆర్థిక విభేదాలు మరింత సీరియస్ గా మారాయి. ఈ గొడవ ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ మెట్లెక్కింది. ఇరువురూ ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక కంప్లైంట్ కూడా ఫిలిం ఛాంబర్ లో చేసినట్టు తెలుస్తుంది. అతని కంప్లైంట్ ప్రకారం, ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌లోని తదుపరి చిత్రాలైన అధీర, జై హనుమాన్ వంటి సినిమాల కోసం తమ సంస్థ నుంచే రూ.10.23 కోట్లకు పైగా అడ్వాన్స్ రూపంలో తీసుకున్నారని ఆరోపించారు. అయితే, ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఆ మాట తప్పినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదే కాకుండా, ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఆగిపోయిన ఆక్టోపస్ అనే మరో ప్రాజెక్టును కూడా తనచేత వేరే ప్రొడ్యూసర్ నుంచి కొనిపించారని, దానికోసం చాలా ఖర్చు పెట్టించారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆ సినిమాకు NOC ఇప్పిస్తానని హామీ ఇచ్చి విఫలమయ్యారని అన్నారు. ఈ కారణాల వల్ల తమ సంస్థకు జరిగిన నష్టానికి, ముఖ్యంగా జై హనుమాన్ ప్రాజెక్ట్ కోసమే 100 కోట్లు, మొత్తం కలిపి వ్యాపార నష్టంగా రూ.200 కోట్లు ప్రశాంత్ వర్మ నుంచి ఇప్పించాలని ఆయన ఛాంబర్‌ను డిమాండ్ చేశారు.
ప్రశాంత్ వర్మ క్లారిటీ
ఈ ఆరోపణలను దర్శకుడు ప్రశాంత్ వర్మ పూర్తిగా ఖండించారు. తాను తీసుకున్నది అడ్వాన్స్ కాదని, హనుమాన్ సినిమా లాభాల్లో తనకు చట్టబద్ధంగా రావాల్సిన వాటా అని ఆయన స్పష్టం చేశారు. తనకు కేవలం రూ.15.82 కోట్లు మాత్రమే ముట్టిందని, అది తన రెమ్యునరేషన్‌లో భాగమేనని చెబుతున్నారు.
భవిష్యత్ ప్రాజెక్టులపై ఎలాంటి ఒప్పందాలు లేవని, ఆక్టోపస్ సినిమా సమస్యకు తనకు సంబంధం లేదని, ఆ వ్యవహారాన్ని నిరంజన్ రెడ్డి, ఆ సినిమా పాత నిర్మాత చూసుకోవాలని వర్మ తేల్చి చెప్పారు. హనుమాన్ సినిమా నుంచి తనకు ఇంకా రావాల్సిన భారీ మొత్తాన్ని ఎగ్గొట్టేందుకే నిర్మాత తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని ప్రశాంత్ వర్మ తెలిపారు. మొత్తానికి ఈ రూ.200 కోట్ల వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
