నన్ను పాన్ ఇండియా స్టార్ అనొద్దు: తేజ సజ్జా
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ మూవీతో ఎలాంటి ఫేమ్ సొంతం చేసుకున్నారో అందరికీ తెలిసిందే.
By: M Prashanth | 28 Aug 2025 6:19 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ మూవీతో ఎలాంటి ఫేమ్ సొంతం చేసుకున్నారో అందరికీ తెలిసిందే. బాలనటుడిగా కెరీర్ స్టార్ చేసిన ఆయన.. ఆ తర్వాత లీడ్ రోల్ లో కూడా పలు సినిమాల్లో నటించారు. హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. తన నటనతో మెప్పించారు.
పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి తేజ సజ్జాను పాన్ ఇండియా యాక్టర్ అని పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు తేజ సజ్జా మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి విదితమే. ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా.. సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే మిరాయ్ మేకర్స్ నేడు ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో మేకర్స్ తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అప్పుడు తనను పాన్ ఇండియా యాక్టర్ గా పిలవవద్దని తేజ సజ్జా అభ్యర్థించారు. తాను తెలుగు సినిమాలు చూస్తూనే పెరిగానని తేజ సజ్జా తెలిపారు.
తాను పాన్ ఇండియా హీరో కాదు, తెలుగు ఆడియన్స్ కోసమే నటిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరి మెప్పు కోసం చేస్తున్నట్లు చెప్పారు. తన సినిమా మిగతావారికి కూడా నచ్చితే అది బోనస్ అంతేనని అన్నారు. కానీ తాను మాత్రం ఆడియన్స్ కోసం వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. మీ దగ్గరే ప్రెస్‌మీట్‌లు చేసుకుంటానని అన్నారు.
మీ ముందే పుట్టానని, మీ ముందే పెరిగానని, ఇక్కడే ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే పాన్ ఇండియా స్టార్ అని ఎందుకు పిలవొద్దని అంటున్నారు, ఏమైనా ఇబ్బందిగా ఉందా అని మీడియా ప్రతినిధి అడిగారు. నాకేం ఇబ్బందిగా లేదని, కానీ వినేవారికి ఏదోలా ఉండొచ్చని తెలిపారు. అబ్బా అని అనిపించవచ్చని పేర్కొన్నారు.
ఆ తర్వాత ఏదైనా 50 శాతం ప్లానింగ్ ఉన్నా.. 100 శాతం కలిసి రావాలని తేజ సజ్జా తెలిపారు. కచ్చితంగా గ్రహాలు అనుకూలిస్తే అన్నీ జరుగుతాయని చెప్పారు. అప్పుడే అనుకున్నవి అవుతాయని, మనకన్నా టాలెంట్ ఉన్నవాళ్లు, అందంగా ఉన్నవారు గల్లీకి పది మంది ఉంటారని తెలిపారు. ఆదిరించిన ఆడియన్స్, దేవుళ్ల దయ ఉంది కాబట్టి తనకు అవకాశం వచ్చిందని అన్నారు.
