నేషనల్ అవార్డ్స్: బెస్ట్ మూవీగా భగవంత్ కేసరి.. సుకుమార్ కూతురికి అవార్డు..
ప్రతిష్టాత్మకమైన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
By: M Prashanth | 1 Aug 2025 10:02 PM ISTప్రతిష్టాత్మకమైన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2023 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ హెడ్ , నిర్మాత అశుతోష్ గోవారికర్ ప్రకటించారు. అయితే ఈసారి టాలీవుడ్ సినిమాలకు పంట పండిందనే చెప్పాలి. వివిధ కేటగిరీల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటి పురస్కారాలు దక్కించుకున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.
భగవంత్ కేసరి భళా!
ఈసారి కేంద్రం ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు. శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. సన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు.
హను-మాన్ కు రెండు అవార్డులు
యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రూపొందిన హను- మాన్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన ఆ సినిమాకు ఇప్పుడు రెండు క్యాటగిరీల్లో నేషనల్ అవార్డులు దక్కడం విశేషం. ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ), ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో హను-మాన్ కు అవార్డులు వరించాయి.
ఊరు పల్లెటూరు సాంగ్ కు గాను..
ఆ తర్వాత ఉత్తమ గేయ రచయితగా టాలీవుడ్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ కు జాతీయ చలనచిత్ర అవార్డు దక్కింది. బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు సాంగ్ కు గాను పురస్కారానికి ఎంపికయ్యారు. వేణు యెల్దండి దర్శకత్వం వహించిన బలగం మూవీలోని ఆ పాట.. అందరి హృదయాలను తాకింది. సాంగ్ లోని ప్రతీ ఒక్క లిరిక్ కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
బేబీ సాయి రాజేష్ కు అవార్డు..
యంగ్ హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ లో నటించిన బేబీ మూవీ.. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించింది. గతంలో పలు అవార్డులు కూడా అందుకుంది. ఇప్పుడు జాతీయ పురస్కారాల్లో రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ స్క్రీన్‌ప్లేకి గాను దర్శకుడు సాయి రాజేశ్ ను జాతీయ అవార్డు వరించింది. ప్రేమిస్తున్నా సాంగ్ కు గాను పీవీఎన్ ఎస్ రోహిత్ కూడా బెస్ట్ సింగర్ గా అవార్డు సాధించారు.
సుకుమార్ కూతురికి కూడా..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తెకు ఉత్తమ బాల నటిగా అవార్డు వరించింది. గాంధీ తాత చెట్టులో యాక్టింగ్ కు గాను సుకృతి వేణి అవార్డును సాధించింది. బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఆ సినిమాకు పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. తన నటనతో ఆకట్టుకున్న సుకృతి అవార్డుకు ఎంపికయ్యారు. అయితే Tupaki తరఫున అవార్డులు సాధించిన వారందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం.. కంగ్రాట్యులేషన్స్ టు ఆల్!
