పాన్ ఇండియా ప్లాన్ లేకపోయినా.. ఇవే పెద్ద హిట్స్
హనుమాన్ అంశ్ మొదట హిందీలో చిన్న సినిమాగానే థియేటర్లలోకి వచ్చింది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు పెద్ద నంబర్ కూడా తెచ్చుకోలేదు.
By: M Prashanth | 15 Sept 2026 11:23 AM ISTహనుమాన్ అంశ్ మొదట హిందీలో చిన్న సినిమాగానే థియేటర్లలోకి వచ్చింది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు పెద్ద నంబర్ కూడా తెచ్చుకోలేదు. కానీ మౌత్ టాక్‌తో నెమ్మదిగా పికప్ అయి రూ.200 కోట్ల మార్క్ దాటింది. ఇప్పుడు సెప్టెంబర్ 18న తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాను తెలుగులో ప్రెజెంట్ చేస్తున్నారు. అంటే ముందే ఐదు భాషల్లో భారీగా రిలీజ్ చేయకుండా, హిట్ వచ్చిన తర్వాత మరో మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది.
కాంతార కూడా దాదాపు ఇదే రూట్‌లో వెళ్లింది. 2022 సెప్టెంబర్ 30న ముందుగా కన్నడలో మాత్రమే రిలీజ్ చేశారు. కర్ణాటకలో సినిమా ఊహించని స్థాయిలో ఆడటం, బయట కూడా టాక్ పెరగడంతో రెండు వారాల తర్వాత హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లు తీసుకొచ్చారు. హిందీ వెర్షన్ అక్టోబర్ 14న వచ్చింది. అప్పటికే కన్నడలో సినిమా ఏంటో దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. కొత్త భాషల్లో రిలీజ్ చేసే సమయానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.
ప్రేమలు విషయంలో కూడా ముందు మలయాళ ప్రేక్షకులే సినిమాను పెద్ద హిట్ చేశారు. ఫిబ్రవరి 9న మలయాళంలో వచ్చిన సినిమా గురించి తెలుగు సోషల్ మీడియాలో కూడా టాక్ మొదలైంది. ఆ తర్వాత రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగు హక్కులు తీసుకుని మార్చి 8న రిలీజ్ చేశారు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉండటంతో తెలుగు వెర్షన్‌కు మంచి రన్ వచ్చింది. అసలు సినిమా హిట్ అయిన తర్వాతే మరో భాషలో బిజినెస్ మొదలైంది.
మంజుమ్మల్ బాయ్స్ ఇంకాస్త ఆలస్యంగా తెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైన సినిమా రూ.200 కోట్ల మార్క్ దాటిన తర్వాత ఏప్రిల్ 6న తెలుగు వెర్షన్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో, సుకుమార్ రైటింగ్స్ కలిసి రిలీజ్ చేశారు. అప్పటికే తమిళనాడులో కూడా సినిమా భారీగా ఆడింది. తెలుగు రిలీజ్‌కు వచ్చేసరికి అది తెలియని సినిమా కాదు. మొదటి రోజే బుక్‌మైషోలో డబ్బింగ్ మలయాళ సినిమాకు మంచి టికెట్ సేల్స్ నమోదయ్యాయి.
కార్తికేయ 2 మాత్రం కొంచెం డిఫరెంట్. హిందీ వెర్షన్ కూడా తెలుగు సినిమాతోపాటే వచ్చింది. కానీ మొదట ఉత్తరాదిలో 50 షోలు కూడా సరిగా దొరకలేదు. టాక్ పెరిగిన తర్వాత రోజురోజుకూ స్క్రీన్స్ పెరిగాయి. కొద్ది రోజుల్లోనే పెద్ద హిందీ సినిమాల షోలు తగ్గించి కార్తికేయ 2కు ఇవ్వాల్సి వచ్చింది. చివరకు వేల స్క్రీన్స్ వరకు వెళ్లింది. ఇక్కడ కొత్త భాషలో రిలీజ్ ఆలస్యం కాలేదు కానీ, మార్కెట్ లో మాత్రం సినిమా ఆడిన తర్వాతే రేంజ్ పెరిగింది.
ఇప్పుడు హనుమాన్ అంశ్‌కు తెలుగులో అదే అవకాశం వచ్చింది. హిందీలో హిట్ అయిపోయిన సినిమాను ఇక్కడ కొత్తగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ అక్కడ పనిచేసిన భక్తి నేపథ్యం, ఎమోషన్ తెలుగు ప్రేక్షకులకు కూడా అదే స్థాయిలో కనెక్ట్ అవుతాయా అన్నది చూడాలి. ఒకవేళ తెలుగు వెర్షన్ కూడా మంచి నంబర్లు తెస్తే స్క్రీన్స్ పెరుగుతాయి అలాగే మిగతా భాషల్లో కూడా ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది.
